‘సేంద్రియ’మే బెస్ట్‌ | technology of crops | Sakshi
Sakshi News home page

‘సేంద్రియ’మే బెస్ట్‌

Published Wed, Sep 13 2017 12:00 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

‘సేంద్రియ’మే బెస్ట్‌

‘సేంద్రియ’మే బెస్ట్‌

పంట సాగులో శాస్త్రీయత
పురాతన పద్ధతులే శ్రేయస్కరమని నిరూపిస్తున్న అన్నదాతలు
పర్యావరణ పరిరక్షణకు దోహదమంటున్న శాస్త్రవేత్తలు


ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ అనే ఆంశం అన్ని వర్గాల్లోనూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వాతావరణ కాలుష్యం వల్ల నెలకుంటున్న ఆందోళనకర పరిస్థితులు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. రసాయనిక క్రిమి సంహారక మందుల వినియోగం వల్ల పర్యావరణానికి ఎక్కువగా హాని జరుగుతోందనేది శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయంతో పర్యావరణ కాలుష్యం నివారణ సాధ్యమన్న విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. దీంతో పర్యావరణ పరిరక్షణపై ప్రజలను చైతన్యపరిచేందుకు టింబక్టు కలెక్టివ్‌ స్వచ్ఛంద సంస్థ చర్యలు చేపట్టింది.
- రొద్దం:

నేల, నీటిని సంరక్షిస్తూ.. భూసారాన్ని పెంచే విధానాలపై రైతుల్లో రొద్దంలోని టింబక్టు సంస్థ చైతన్యం తీసుకువస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా ధరణి సొసైటీ పేరుతో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఆ సంస్థ ఏర్పాటు చేసింది. సుస్థిర వ్యవసాయం దిశగా రైతులను నడిపిస్తూ పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టింది. సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగంపై ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. ధరణి సొసైటీ పర్యవేక్షణలో రొద్దం మండల వ్యాప్తంగా మండల వ్యాప్తంగా  140 మంది రైతులు 430 ఎకరాల్లో ఆరకులు, 129 ఎకరాల్లో కొర్ర,  30 ఎకరాల్లో బరిగ, 210 ఎకరాల్లో నూనె గింజలు, 530 ఎకరాల్లో వేరుశనగ, 30 ఎకరాల్లో పెసర పంటల సాగు చేపట్టారు. ఈ పంటలన్నీ సేంద్రియ ఎరువులతోనే సాగు చేయడం గమనార్హం.

రసాయన ఎరువుల దుష్పలితాలు
ఆరు దశాబ్దాల క్రితం కేవలం సేంద్రియ ఎరువులతోనే ఆహార ధాన్యాలను రైతులు ఉత్పత్తి చేసేవారు. ఆ తర్వాత వచ్చిన హరిత విప్లవం కారణంగా రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగం పెరిగిపోయింది. అప్పటి పరిస్థితులను బట్టి రసాయనిక ఎరువుల వినియోగంపై రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అప్పటి ప్రభుత్వాలకు దాదాపు 39 సంత్సరాలు పట్టింది. రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడడంతో భూములు నిస్సారంగా మారి, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ముప్ప అని తెలిసినా.. ప్రభుత్వాలే హరిత విప్లవం పేరుతో రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగాన్ని అప్పట్లో ప్రోత్సహిస్తూ వచ్చాయి.

భూమిలో ఏముంది?
సారవంతమైన భూమిలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి భూమిలోని సేంద్రియ పదార్థాన్ని కుళ్లింపజేసి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తుంటాయి. రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని మొక్క వేర్ల బుడిపెలలో నిల్వ చేసి మొక్కలకు అవసరమైనప్పుడు అందిస్తూ ఉంటుంది. మరికొన్ని రకాల సూక్ష్మజీవులు నేలలోని అనేక మలినాలను మొక్కలకు కావాల్సిన పోషకాలుగా మారుస్తుంటాయి. అంతేకాక ఇవి మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడినప్పుడు పంటలకు మేలు చేస్తున్న కొన్ని సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రసాయనిక క్రిమి సంహారక మందుల వినియోగం పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటికి బదులు భూసారాన్ని పెంచే సేంద్రియ ఎరువులు, కషాయాల వినియోగం సుస్థిరమని శాస్త్రవేత్తలు సైతం పేర్కొంటున్నారు.

సేంద్రియ ఎరువులు అంటే..
దిబ్బ ఎరువు, వర్మీ కంపోస్టు, ఆకులు అలములు, పొడి జీవామృతం, పంచగవ్వ లాంటివి భూమిలో సూక్ష్మక్రిములను పెంచి పోషించడమే కాకుండా భూమిని సారవంతం చేయడంలో తోడ్పడుతాయి. వీటిని సేంద్రియ ఎరువులుగా పిలుస్తుంటారు.

తెగుళ్ల నివారణకు కషాయం
సుస్థిర వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వినియోగంతో పాటు సేంద్రియ విధానంలోనే తయారు చేసిన కషాయాలను పిచికారీ చేయడం ద్వారా తెగుళ్ల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. విష తుల్యంకాని ఈ కషాయాలు పురుగులను చంపకుండా పొలాలనుంచి వాటిని తరిమేస్తుంటాయి. పంటను పురుగులు ఆశించకుండా కాపాడుతాయి. ఈ కషాయాలు మన చుట్టుపక్కల దొరికే వనరులతో తయారు చేసుకోవచ్చు. ఆకులతో తయారు చేసే కషాయం పంటను ఆశించి ఆకు తినే పురుగులు, రసం పీల్చు పురుగులను నివారిస్తుంది.

కషాయాల తయారీ ఇలా..
ఆకులపై గుడ్లు పెట్టకుండా చేస్తుంది. పశువులు మేయనివి, పాలుకారేవి, చేదైన తదితర  ఐదురకాల ఆకులను తీసుకుని ముద్దలా నూరి తొట్టిలో వేయాలి. ఈ ముద్ద మునిగిపోయే వరకూ పశువుల గంజు పోయాలి. రోజుకు ఒకసారి కర్రతో కలియతిప్పుతూ ఐదు రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టి, ఒక లీటరు కషాయాన్ని పది లీటర్ల నీటిలో కలుపుకుని పంటలపై పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే అందులో అర కిలో కారం పొడి లేదా, పావు కిలో పసుపు పొడి కలపుకుని వాడుకోవాలి.  వేపకషాయం పిచికారీ చేస్తే 150 రకాల పురుగులు పంటలను ఆశించకుండా పరుగులు తీస్తాయి.

10 కిలోల వేపగింజలను మెత్తగా రుబ్బి పిండి చేసి మూటలో కట్టి బకెట్‌ నీళ్లలో ఒక రాత్రంతా నానబెట్టాలి. అనంతరం మూట నుంచి ద్రావణాన్ని పిండి, 100 గ్రాముల సబ్బుపొడి, 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. ఒక లీటరు నీటికి 30 మి.లీటర్ల వేపనూనె, సబ్బు పొడి కలిపి పిచికారీ చేస్తే ఆకుముడత, పేనుబంక, తెల్లదోమ, కాండం తొలిచే పురుగులు నివారణ అవుతాయి. పంట పూతదశలో ఉన్నప్పుడు పది లీటర్ల మజ్జిగను పది రోజుల పాటు పులియబెట్టి, అందులో వంద గ్రాముల సీకాయపొడి కలిపి పెట్టుకోవాలి. ఈ ద్రావణం ఒక లీటరుకు పది లీటర్ల నీటిని కలిపి పంటలపై పిచికారీ చేస్తే పూత, గింజ నిలకడగా ఉంటాయి.

10 కిలోల పేడ, 10 లీటర్ల గంజు, 2 కిలోల కందిపిండి, 2 కిలోల బెల్లం, సారవంతమైన మట్టిని నీరుపోసి రెండు రోజులు ఒక డ్రమ్ములో మురగబెట్టడం ద్వారా వచ్చే జీవామృతాన్ని రోజుకు రెండు సార్లు ఈ ద్రావణాన్ని కలియపెడుతూ వారం రోజుల్లోపు వాడాలి. వడగట్టిన లీటరు ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలుపుకుని పంటలపై పిచికారీ చేయాలి. ఐదు కిలోల పేడ, అరకిలో నెయ్యి, ఒక కిలో బెల్లం, పెరుగు కలిపి మూడు రోజులు నానబెట్టడం ద్వారా వచ్చే కషాయానికి నాల్గో రోజు మూడు లీటర్ల ఆవు గంజు, రెండు లీటర్ల ఆవు పాలు, రెండు లీటర్ల ఆవు పెరుగు కలపాలి. దీనిని ప్రతి రోజూ బాగా కలియతిప్పుతూ ఉంటే పంచగవ్వ ఔషధం తయారవుతుంది. ఇది ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది. మూడు లీటర్ల పంచగవ్వను 100 లీటర్ల నీటిలో కలుపుకుని పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. దీని పంట ఏపుగా పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement