సేంద్రియ ఇంటిపంటల సాగుపై మక్కువ పెంచుకుంటే ఆయురారోగ్యాలు, ఆనందోత్సాహాలను పొందడంతోపాటు.. మహానగరంలో సొంత ఇల్లున్న బాధ్యతాయుతమైన పౌరులుగా విశ్రాంత జీవితాన్ని అర్థవంతంగా గడపవచ్చని నిరూపిస్తున్నారు.. పిన్నాక శ్రీనివాస్, పద్మ దంపతులు. హైదరాబాద్ మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్ వాసులైన ఈ ఆదర్శ దంపతులు తమ సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు అమెరికాలో స్థిరపడ్డారు. దుబాయ్‌లో ఉద్యోగ విరమణ అనంతరం నగరంలో పద్మ, శ్రీనివాస్ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. విశ్రాంత జీవితంలో ఇంటిపంటల సాగును ప్రధాన వ్యాపకంగా మార్చుకున్నారు.
ఇంటిపైన గల వెయ్యి చదరపు అడుగుల స్థలాన్ని పూల మొక్కలు, సుసంపన్నమైన ఉద్యాన పంటల జీవవైవిధ్యానికి చిరునామాగా రూపుదిద్దారు. వంటింటి వ్యర్థాలు, ఆకులు అలములను తగుల బెట్టకుండా.. బయట పడేయకుండా.. ఇంట్లోనే కంపోస్టు తయారు చేసుకుంటూ ఆరోగ్యదాయకమైన, రుచికరమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఏడాది పొడవునా పండించుకొని తింటున్నారు. వీరి కృషికి మెచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ‘టెర్రస్ హార్టీకల్చర్’ విభాగంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇటీవల సత్కరించడం విశేషం. బోన్సాయ్, పూల మొక్కలపై ఉన్న ఆసక్తిని పద్మ, శ్రీనివాస్ దంపతులు మూడేళ్ల క్రితం నుంచి టెర్రస్‌పై సేంద్రియ ఇంటిపంటల వైపు మళ్లించారు. దాదాపుగా ఏమీ కొనడం లేదు. ఎక్కువ దిగుబడి ఉన్నప్పుడు ఇరుగుపొరుగు వారికి పంచిపెడుతున్నారు.
సాక్షిలో ఇంటిపంట, సాగుబడి కథనాలు, ఇతర పుస్తకాలు చదువుతూ.. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నామని పద్మ తెలిపారు. ఎక్కువ అవసరం అనుకున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను రకానికి ఐదేసి కుండీల్లో పెంచుకోవడం ద్వారా ఏడాది పొడవునా దిగుబడి వచ్చేలా ప్రణాళికా బద్ధంగా ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. అన్ని రకాల ఆకుకూరలు, వంగ, టమాటా, దొండ, దోస, కాకర.. తదితర కూరగాయలు.. బొప్పాయి, అంజూర, కమలాలు, నారింజ, నిమ్మ, స్టార్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, యాపిల్ బెర్ తదితర పండ్ల చెట్లు పెంచుతున్నారు.. ఇక పూల చెట్లకు లెక్కే లేదు. వెలగ, రావి, జువ్వి.. వంటి ఇతర చెట్లూ ఉన్నాయి. చీడపీడలు చాలా తక్కువ. ఏదైనా పురుగు కనిపిస్తే చేతులతోనే తీసేస్తున్నారు. అపుడప్పుడూ వేపనూనె, గంజి ద్రావణం వాడుతున్నారు.
సొంత విత్తనాలనే వాడుతున్నారు. ఇతరులకూ పంచుతున్నారు. లిచీ, యాపిల్ పండ్ల నుంచి విత్తనాలు తీసి.. మొక్కలు పెంచుతున్నారు. నిమ్మకాయలతో ఊరగాయ పచ్చడి పెట్టుకుంటున్నారు. ఎండాకాలంలోనూ షేడ్‌నెట్ అవసరం లేదని, రోజుకు 3 సార్లు నీరు ఇస్తే చాలన్నారు.
సేంద్రియ ఫలం రుచే వేరు..!
మా ఇంటి మీద పండిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరల రుచి చాలా బాగుంటుంది. తింటేనే ఆ తేడా తెలుస్తుంది. ముఖ్యంగా బొప్పాయిని రుచి చూస్తే.. సేంద్రియ ఫలం గొప్పతనం తెలుస్తుంది. ఉదయం, సాయంత్రం చెట్లను కనిపెట్టుకొని ఉంటున్నాం. విశ్రాంత జీవితంలో ఇంటిపంటలే మా లోకం, ఆనందం, ఆరోగ్యం కూడా. ఇంటిపంటల సాగును ఉచితంగా నేర్పిస్తాం. ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు. ముందుగా చెప్పి.. స్వయంగా వచ్చి చూడొచ్చు.
– పిన్నాక శ్రీనివాస్ (87900 73518), పద్మ(94406 43065), దీప్తిశ్రీనగర్, మియాపూర్, హైదరాబాద్
– పట్టోళ్ల గోవర్థన్‌రెడ్డి, సాక్షి, మియాపూర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment