
పెద్దగా ఖర్చు పెట్టకుండానే రసాయనాల అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సొంతంగా ఇంటిపైనే పండించుకోవచ్చని ఈ ఇంటిపంటల తోటను చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ నగరంలోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీ(బీహెచ్‌ఈఎల్ దగ్గర)లో ఇండిపెండెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్న గృహిణి లత తన అభిరుచి మేరకు తమ ఇంటిపైన స్వల్ప ఖర్చుతోనే సేంద్రియ ఇంటిపంటలను గత మూడేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. 3 సిమెంటు వరలను ఆకుకూరల మడులుగా మార్చేశారు. 1500 చదరపు అడుగుల టెర్రస్ పైన మూడు కార్నర్లలో హాలోబ్రిక్స్‌తో మడులు ఏర్పాటు చేసి తీగజాతి కూరగాయ మొక్కలను పెంచుతున్నారు. పాలకూర, తోటకూర, కీర, వంగ, సొర కాయలతోపాటు.. పైనాపిల్ పండ్లు, ఆపిల్ బెర్ పండ్లను ఆమె సాగు చేస్తున్నారు. డ్రమ్ములో నాటిన ఆపిల్ బెర్ మొక్క ఏడాదికి 3 సీజన్లలోనూ మంచి ఫలసాయాన్ని ఇస్తున్నదని ఆమె తెలిపారు. అంజూర మొక్క కూడా నిరంతరం పండ్ల దిగుబడినిస్తున్నదని తెలిపారు. సీతాఫలం మొక్కలను కూడా పెంచుతున్నారు. చెట్టుచిక్కుడు కాస్తున్నది. కీర దోస కాయలను సైతం తమ ఇంటిపైనే లత(96032 32114) సాగు చేస్తుండడం విశేషం.