కూరగాయల సాగుపై దృష్టి
– కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్ జాన్‌సుధీర్
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ ప్రారంభం కావడం, వర్షాలు కురుస్తున్నందున సీజన్‌లో పందిరి జాతి కూరగాయల పంటలను రైతులు సాగు చేసుకోవచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. కాకర, బీర, సొర, దోస, గుమ్మడి పంటలు ఎంపిక చేసుకుని సాగు చేసుకోవచ్చన్నారు.
తీగ జాతి కూరగాయల పంటలు
+ కాకర విషయానికి వస్తే పూసాదో మౌసమి, కోయంబతూర్ లాంగ్ గ్రీన్, కోలాంగ్ వైట్, అర్కహరిత, ప్రియ, మైకోగ్రీన్ లాంగ్, హైబ్రీడ్ ఎంఎస్–431, ఎంబీటీహెచ్–101, 102, శ్వేత, శ్రేయ, పాలీ విత్తన రకాలు అనువుగా ఉంటాయి.
+ బీరలో అయితే జగిత్యాల లాంగ్, జైపూర్ లాంగ్, అర్క సుజాత, హైబ్రీడ్స్ ఎంఎస్–3, 401, 403 రకాలు ఎంపిక చేసుకోవాలి.
+ సొరలో పూసా మంజరి, కావేరి, శారద, స్వాతి, శ్రామిక విత్తన రకాలు అనువైనవి.
+ దోసలో జపనీస్ లాంగ్ గ్రీన్, పాసఖీర, కో–1, హైబ్రీడ్స్ మైకో–4, మాలిని, సోలాన్ హైబ్రీడ్–1 రకాలు అనువుగా ఉంటాయి.
+ గుమ్మడిలో శక్తి, కో–1, కో–2 వంటి బూడిద గుమ్మడి రకాలు ఎంపిక చేసుకోవాలి.
విత్తే సమయం : అనప, దోస, కాకర పంటలు జూన్, జూలై చివరి వరకు.. అలాగే జనవరి రెండో పక్షం నుంచి ఫిబ్రవరి ఆఖరు వరకు విత్తుకోవచ్చు. గుమ్మడి, పొట్ల పంటలు జూన్, జూలై, డిసెంబర్, జనవరిలో వేసుకోవచ్చు. బీర, బూడిద గుమ్మడి జూన్ నుంచి ఆగస్టు మొదటి వారం.. అలాగే డిసెంబర్ రెండో పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. దొండ పంట జూన్, జూలై వరకు నాటుకోవచ్చు.
విత్తే పద్ధతి : భూమిపై పాకించే పాదులకు, వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోయేందుకు రెండు మీటర్ల దూరంలో కాలువలు చేయాలి. వేసవిలో వేసే పాదులకు పొలం అంతటా నీటి పారుదల కోసం బోదెలు చేయాలి. అన్ని రకాల పాదుల్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో మూడు విత్తనాలు పెట్టాలి. దొండ విషయానికి వస్తే చూపుడు వేలు లావు ఉన్న నాలుగు కణుపుల కొమ్మలు రెండేసి నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలు వర్షాధార పంటలకు 15 X 10 సెంటీమీటర్లు కొలతలు ఉన్న పాలిథీన్ సంచుల్లో విత్తుకుని 15 నుంచి 20 రోజులు పెరిగిన తర్వాత అదను చూసుకుని పొలంలో నాటుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్, 5 గ్రాముల ఇమిడిక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే ముందు ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు, 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్ ఎరువులు వేయాలి. 32 నుంచి 40 కిలోల నత్రజని ఎరువును రెండు భాగాలుగా చేసుకుని విత్తిన 25 నుంచి 30 రోజుల సమయంలో చల్లాలి. అనంతరం పూత, పిందె దశలో రెండో సారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరగా ఎరువులు వేయకూడదు. ఎరువులు వేసిన వెంటనే నీటి తడులు ఇవ్వాలి.