పసుపు రైతుకు ని‘బంధనాలా’? | yellow crop farmers are angry in kadapa | Sakshi
Sakshi News home page

పసుపు రైతుకు ని‘బంధనాలా’?

Published Wed, Apr 26 2017 8:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

పసుపు రైతుకు ని‘బంధనాలా’? - Sakshi

పసుపు రైతుకు ని‘బంధనాలా’?

కడప అగ్రికల్చర్‌ : పసుపు కొనుగోలుకు శ్రీకారం చుట్టామని గొప్పలు చెప్పుకుని ఇటు రైతుల్లో అటు ప్రజల్లో పరపతి సంపాదించడానికి ప్రభుత్వం పన్నాగం పన్నిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు కొనుగోలుకు సవాలక్ష నిబంధనలు పెట్టి రైతు నడ్డివిరిచేందుకు ప్రభుత్వం పూనుకుందని రైతుసంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. సోమవారం నుంచి కడప మార్కెట్‌ యార్డులో జిల్లాలోని రైతుల నుంచి మార్క్‌ఫెడ్‌ సంస్థ ద్వారా పసుపును కొనుగోలు చేపట్టారు.

అయితే ప్రభుత్వం ఒక్కో రైతు నుంచి కేవలం 30 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధన విధించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లాలోని చెన్నూరు, ఖాజీపేట, చాపాడు, మైదుకూరు, దువ్వూరు మండలాల నుంచి పసుపు తీసుకువచ్చిన రైతులు కడప మార్కెటింగ్‌శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చిన్న, సన్నకారు రైతుల వద్ద ఉన్న పసుపంతా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి నిబందనలు లేవన్నారు.

ఇప్పుడు మార్కెట్‌యార్డుకు తీసుకువచ్చినందుకు బాడుగ, మళ్లీ ఇంటికి తీసుకుపోవడానికి బాడుగ, ఇంటి వద్ద పసుపు కొమ్ములను ఏరించి, గ్రేడింగ్‌ చేయాలంటే అదనపు భారం పడుతుందని, మరి ఈ ఖర్చులు ఎవరిస్తారని అధికారులను నిలదీశారు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులను నట్టేట ముంచుతూ నిబంధనలను రుద్దుతోందని ధ్వజమెత్తారు. సాధారణంగా ప్రభుత్వం వ్యవసాయ పథకాలకు ప్రాథమికంగా 2, 2 1/2 హెక్టారు భూమి ఉన్న రైతులందరికీ సబ్సిడీలను ఇచ్చే నిబంధన పెట్టారు. మరి అలాంటప్పుడు రెండు, రెండున్నర హెక్టార్ల పొలంలో పండిన పసుపు కొనుగోలును ఎందుకు చేపట్టడం లేదని మార్కెటింగ్‌శాఖ, మార్క్‌ఫెడ్‌ అధికారులను రైతులు నిలదీశారు. పసుపు ఉడికించిన తర్వాత ఎండబెట్టి బాగా రుద్ది, శుద్ధి చేసి మార్కెట్‌యార్డుకు తీసుకువచ్చినా ఏదో ఒక వంకపెట్టి కొనుగోలు చేయకుండా తిరస్కరించడం దారుణమన్నారు.

ఏదో నాలుగు రోజులు కేంద్రం నిర్వహించి చేతులెత్తేయడానికి పూనుకున్నట్లు ప్రభుత్వ తీరును బట్టి అర్థమవుతోందని రైతులన్నారు. మార్క్‌ఫెడ్‌ సంస్థ సీనియర్‌ మేనేజర్‌ సంజీవరెడ్డి నాణ్యతను చూడకుండానే కొన్ని కుప్పలు మాత్రమే బాగున్నాయని, మరికొన్ని బాగాలేవని రగడకు దిగారని రైతు సంఘం నాయకుడు నారాయణ ఆరోపించారు. ఎంతో శ్రమించి, వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి రైతులు పసుపును తీసుకువస్తే ఇదేనా మీరిచ్చే మర్యాద, గౌరవం అంటూ వాదనకు దిగారు. రైతు పండించిన పంటలో కేవలం 30 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా పంటను ఎవరు కొంటారని ప్రశ్నించారు.

అసలే అప్పుల భారంతో సతమతమయ్యే తమకు ధైర్యం చెప్పి, సాయమందించాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. అందుకు మార్కెటింగ్‌శాఖ రాయలసీమ రీజియన్‌ జేడీ సుధాకర్‌ స్పందిస్తూ ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోతామని, రాతపూర్వకంగా వినతిపత్రం ఇస్తే దాన్ని కూడా మంత్రులకు, మార్కెటింగ్, ఉద్యాన, వ్యవసాయశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్యాక్స్‌ మెసేజ్‌ ఇస్తామన్నారు.

మాయమాటలు చెబుతున్న మంత్రులు
రైతులకు ఏ సాయం చేయాలన్నా టీడీపీ ప్రభుత్వమేనంటూ అటు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో గొప్పలు చెప్పారని రైతుసంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ పసుపు కొనుగోలులోనే ప్రభుత్వ బండారం బయటపడిందని విమర్శిస్తున్నారు. కనీసం ఐదు ఎకరాల్లో పండించిన పసుపును కొనుగోలు చేస్తామని చెప్పి ఉంటే ఎంతో బాగుండేదని, అలాకాకుండా కేవలం 30 క్వింటాళ్లకే పరిమితం చేస్తే మిగతా పసుపు తక్కువ ధరకు అమ్ముకోవాలా?అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

పంటసాగుకు రూ.లక్షలు ఖర్చైంది
నేను ఎకరంలో పంటసాగు చేయగా పెట్టుబడి రూ.లక్షలు అయింది. మార్కెట్‌ ధర చూస్తే ఘోరంగా ఉంది. ప్రభుత్వం కొనుగోలుకు నిబంధనలు పెట్టింది. రైతు పండించిన పంటకు నిబంధనలు పెడతారు. కానీ ప్రభుత్వం ఇచ్చే విత్తనాలకు మాత్రం నిబంధనలు ఉండవు. ధరలు మాత్రం గూబగుయ్యిమనిపిస్తారు. నా పంట దిగుబడి 40 క్వింటాళ్లు వచ్చింది, 30 క్వింటాళ్లు కొంటే మిగతా 10 క్వింటాళ్లు ఎవరు కొంటారు? ఎక్కడ అమ్ముకోవాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.    –సుబ్బారెడ్డి, పసుపు రైతు

ఇంత అధ్వాన ధరతో కొనుగోలు చేస్తారా?
పసుపు పంట పండించిన రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన ధర అధ్వానంగా ఉంది. ఈ ధర రైతుకు ఏ మాత్రం గిట్టుబాటు కాదు. అయినా రైతు వచ్చిన కాడికి గోవిందా అంటూ తక్కువ ధరకు విక్రయించడానికి పూనుకున్నా ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తూ ప్రతి రైతు నుంచి 30 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం సమంజసంగా లేదు. నిబంధనలు ఎత్తివేయాలి.    –నారాయణ, రైతు సంఘం నాయకుడు, మైదుకూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement