- కునుకు పట్టని కృష్ణాతీరం
- సీడ్‌క్యాపిటల్ ప్రణాళిక వెల్లడితో రాజధాని ప్రాంత గ్రామాల్లో భయాందోళనలు
- గ్రామాలను కదిలిస్తే సహించేదిలేదని హెచ్చరికలు
తుళ్లూరు/తాడికొండ : కృష్ణానదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. సీడ్ క్యాపిటల్ ప్రణాళిక అనంతరం ఊళ్లు ఖాళీ చేయాల్సి వస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. భూములిచ్చిన రైతులతో పాటు పొలం పనులు లేక పింఛన్ రాక పస్తులతో బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్న వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాలు రేపు ఏం జరుగుతుందోననే భయంతో తల్లడిల్లుతున్నారు. కృష్ణానది చెంతనే తరతరాలుగా ఉంటూ ఎన్నో వరద పోట్లు తట్టుకొని నిలబడ్డాం.. ఇప్పుడు ఊళ్లని వదిలి పోయే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. ఊరి కోసం ఉద్యమిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తుళ్ళూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం మండల పరిషత్ పాఠశాలలో మంగళ వారం వ్యవసాయకూలీలు, ఇతరవర్గాల ప్రజలు ధర్నా చేపట్టారు. తాళ్లాయపాలెం, మందడం, ఉద్దండ్రాయుని పాలెం, లింగాయపాలెం, రాయపూడి, బోరుపాలెం నదీపరివాహక గ్రామాల జాబితాలోఉన్నాయి. సీడ్ క్యాపిటల్ ప్రణాళిక అనంతరం అందరి దృష్టి లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తాళ్ళాయపాలెం గ్రామాలపైనే ఉంది. లింగాయపాలెంలో 613 కుటుంబాలు ఉండగా 1755 మంది జనాభా ఉన్నారు. తాళ్లాయపాలెంలో 460 కుటుంబాలు1700 జనాభా, ఉద్దండ్రాయునిపాలెంలో 630 కుటుంబాలుండగా 1846 మంది జనాభా ఉన్నారు.
రాజధాని కోసం భూములిచ్చాం..
ఇప్పుడు ఊళ్ళు ఖాళీ చేయాలంటే అంగీకరించేది లేదని లింగాయపాలెంకు చెందిన కొండెపాటి శ్రీనివాసరావు అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊళ్లు కదిలించేది లేదని నమ్మబలికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని మండిపడ్డారు. ‘చంద్రబాబు ఎలచ్చన్లపుడు ఇళ్ళు కట్టిత్తామని చెప్పి ఇప్పుడు ఇళ్ళు కూలుత్తానంటునడు..మమ్మల్ని ఏట్లో ముంచి పెద్దపెద్ద భవనాలు కడతానంటున్నాడు’ అని ఉద్ద్దండ్రాయునిపాలెంకు చెందిన 75 ఏళ్ళ కొర్లేమర్ల లక్ష్మీ అనే వృద్ధురాలు వాపోయింది.
చంద్రబాబు కడుతున్నది ప్రజలను ఉద్దరించే రాజధాని కాదని అదే గ్రామానికి చెందిన పూల నాగేశ్వరరావు అన్నారు. ఊళ్ళను ఖాళీ చేయించాలనుకుంటే రాజధాని నిర్మాణం సంగతి మరచి పోవాల్సిందేనని ముక్తకంఠంతో చెబుతున్నారు.