నీటి విడుదలలో పశ్చిమ డెల్టాకు అన్యాయం
నీటి విడుదలలో పశ్చిమ డెల్టాకు అన్యాయం
Published Sat, Aug 20 2016 7:56 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
ఇరిగేషన్ అధికారులపై రైతుల కన్నెర్ర
రైతులకు బాసటగా నిలబడిన మేరుగ, అన్నాబత్తుని
తెనాలి: కృష్ణా పశ్చిమ డెల్టాలో మాగాణి భూములకు సాగునీటిని విడుదల చేయకుండా అవస్థలు పాల్జేయటంపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెనాలి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, డాక్టర్ మేరుగ నాగార్జున నేతృత్వంలో పార్టీ నాయకులు, రైతునాయకులు శనివారం మధ్యాహ్నం పశ్చిమ డెల్టా కార్యాలయానికి వెళ్లారు. అరకొర సాగునీటిపై కార్యనిర్వాహక ఇంజినీరు పులిపాటి వెంకటరత్నంను నిలదీశారు. ఇరిగేషన్ మంత్రి కారణంగా పశ్చిమ డెల్టాకు దామాషాకు మించి తూర్పుడెల్టాకు అధిక పరిమాణంలో సాగునీరు తీసుకుంటున్నట్టు నాగార్జున, శివకుమార్‌లు గణాంకాలతో సహా చెప్పారు. పశ్చిమడెల్టాలోనూ ప్రాజెక్టు ఛైర్మన్ మైనేని మురళీకృష్ణ ప్రోద్బలంతో రేపల్లె బ్యాంక్ కెనాల్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ, ఇతర ప్రాంతాలపై వివక్ష ప్రదర్శిస్తున్నట్టు ఆరోపించారు.
రైతునాయకులు మాట్లాడుతూ పుష్కరాల్లో మునిగితేలుతున్న చంద్రబాబు తమను నిండాముంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జూన్ పదో తేదీనుంచి వరినాట్లు వేసుకోమన్న చంద్రబాబు మాటలు నమ్మి, సర్వనాశనం అయిపోతున్నట్టు పార్టీ రైతువిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలవర్తి నాగభూషణం అన్నారు. రుణమాఫీ హామీతో రుణగ్రస్థులను చేశారనీ, ఇప్పుడు వరికి నీళ్లివ్వకుండా రైతులను అష్టకష్టాలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎకరా నీటి తడులకు రూ.5 వేల నుంచి రూ. 6 వేల వరకూ ఖర్చు చేయాల్సివస్తున్నట్టు రైతు ఘట్టమనేని రమేష్ చెప్పారు. దీనిపై ఈఈ పులిపాటి వెంకటరత్నం మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న సరఫరా మెరుగవుతుందని హామీనిచ్చారు.
Advertisement