west delta
-
పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు గోదావరి నీరు విడుదల
-
జూన్ 1నుంచి కాలువలకు నీరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని కాలువలకు జూన్ 1నుంచి నీరు విడుదల చేయనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ఖరీఫ్ పంటకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూ సేకరణ తదితర అంశాలపై శనివారం ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 10లోగా నారుమడులు వేసుకోవాలని రైతులకు సూచించారు. ఇందుకు అనువుగా 7 నుంచి 10 టీఎంసీల వరకు సీలేరు జలాలను అదనంగా రప్పిస్తామని తెలిపారు. శివారు ప్రాంత భూములకు సమృద్ధిగా నీటిని అందించి జూన్ నెలాఖరు నాటికి జిల్లా అంతటా వరినాట్లు పూర్తయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. 15 నాటికి పనులు పూర్తి కావాలి చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు తప్ప మిగిలిన ఇరిగేషన్ పనులన్నిటినీ జూన్ 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు కురిస్తే డెల్టా ఆధునికీకరణ పనులు చేయడం కష్టమవుతుందని, ఈలోగా ఎర్రకాలువ, నందమూరు అక్విడెక్ట్, ఎస్‌కేకేవైఆర్ వంటి ఇరిగేషన్ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. తాడిపూడి ఎత్తిపోతల కోసం సేకరించిన భూమిలో పంటలు వేయకుండా చర్యలు తీసుకోవాలని, వేస్తే తొలగిస్తామనే విషయాన్ని రైతులకు చెప్పాలని అన్నారు. ఆ భూములను సాగుకు పనికిరాకుండా గుంతలు తవ్వాలన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. శేషావతారం చానల్ నుంచి జూన్ 15 నాటికి నీళ్లు ఇచ్చేలా పనులు పూర్తి చేయాలన్నారు. జూన్ 5 నాటికి పోణంగి పుంత పనులు పూర్తి చేయాలని కోరారు. లబ్బీపేట స్లూయిజ్ 19 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో పాతబడిన లాకుల షట్టర్లను తొలగించి కొత్తవి వేయాలని, వచ్చే మంగళవారం ప్రతి ప్రాంతానికి వెళ్లి తాను చూస్తానని అన్నారు. ఎక్కడైనా పాత షట్టర్లు కనిపించినా, పనులు కాకున్నా చర్యలు తప్పవని శెట్టిపేట డ్రెయినేజీ ఈఈ శ్రీనివాసరావును హెచ్చరించారు. హైవేను పొడిగించండి జాతీయ రహదారి–65ను కొవ్వూరు నుంచి నరసాపురం వరకు పొడిగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ ఎస్ఈ నిర్మలను కలెక్టర్ ఆదేశించారు. దీనివల్ల జాతీయ రహదారులకు కనెక్టివిటీ వస్తుందన్నారు. -
నీళ్లొచ్చేది 24 గంటలే
నిడదవోలు : పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ పరిధిలోని ఉప కాలువలకు సోమవారం నుంచి నీటి విడుదల నిలిపివేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయిం చారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ గేట్లను పూర్తిగా మూసివేస్తారు. 45 రోజుల తరువాత గాని ఈ తలుపులు తెరుచుకునేఅవకాశం లేదు. తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాలకు శనివారం సాయంత్రం నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. పంటలు పూర్తిగా గట్టెక్కుతాయా! కాలువలకు నీటి విడుదలను గత నెల 30న నిలిపివేయాలని మొదట్లో నిర్ణయించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈనెల 10వ తేదీ తరువాత మూసివేయాలని భావించారు. అయితే, సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని 17వ తేదీ వరకు గడువు పెంచారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 60 శాతం విస్తీర్ణంSలో మాసూళ్లు పూర్తయినట్టు అంచనా. కాలువలు మూసివేసే నాటికి ఇది 70 శాతానికి చేరుతుందని భావిస్తున్నారు. ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లోని చేలకు చివరి దశలో నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సోమవారం నుంచి నీటి విడుదల నిలిపివేస్తే పంట ఎలా గట్టెక్కుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కనీసం మరో వారం రోజులపాటు నీరందిస్తే తప్ప రైతులు గట్టెక్కే పరిస్థితి లేదు. చెరువుల సంగతేంటి! జిల్లాలో 400కు పైగా మంచినీటి చెరువులు ఉన్నాయి. వాటిలో పూర్తిగా నీరు నింపితే తప్ప వేసవిలో తాగునీటి అవసరాలు తీరవు. ప్రస్తుతం చెరువుల్లో 70 శాతం వరకు మాత్రమే నీరు చేరినట్టు చెబుతున్నారు. అవి పూర్తిగా నిండాలంటే మరికొన్ని రోజులు కాలువలకు నీరివ్వాల్సి ఉంటుంది. -
పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు
కొవ్వూరు : పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీటి అవసరాల నిమిత్తం శనివారం 4,280 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,240 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. దీనిలో తూర్పు డెల్టాకు 2,400, సెంట్రల్ డెల్టాకు 1,560 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఏలూరు కాలువకు 694, అత్తిలి కాలువకు 358, నరసాపురం కాలువకు 1,534, ఉండి కాలువకు 997, జీ అండ్ వీకి 489 క్యూసెక్కుల చొప్పున సాగునీరు అందిస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.21 మీటర్లుగా నమోదైంది. -
లాకులకు తాళం.. అక్రమాలకు కళ్లెం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : గోదావరి నదిలోని ఇసుకను తవ్వి.. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ మీదుగా పడవల్లో తరలిస్తున్న అక్రమ వ్యవహారానికి ఎట్టకేలకు కళ్లెం పడింది. అర్ధరాత్రి 12 గంటల తరువాత విజ్జేశ్వరం లాకు గేట్లను అనధికారికంగా తెరిచి ఉదయం 9 గంటల వరకూ భారీ పడవల్లో పెద్దఎత్తున ఇసుక తరలిస్తున్న వైనాన్ని ఈనెల 29వ తేదీ సంచికలో కంట’పడవా’ శీర్షికన ’సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ కథనంపై స్పందించిన ఇరిగేషన్ హెడ్‌వర్క్స్ ఏఈ డి.రాధాకృష్ణ గోదావరి నుంచి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి నీటిని వదిలే విజ్జేశ్వరం హెడ్‌లాక్స్ గేట్లు మూయించి తాళాలు వేశారు. దీంతో ఇసుక రవాణా చేసే పడవలు నిలిచిపోయాయి. అ«ధికారులు పడవల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. అనధికారికంగా లాకులు తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోదావరి హెడ్‌వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు తెలిపారు. అధికారుల చర్యలతో నిడదవోలు మండలం శెట్టిపేట, తాళ్లపాలెం, తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం, ఆరుళ్ల తదితర 11 ప్రదేశాల్లో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ వెంబడి టీడీపీ నేతలు సాగించే ఇసుక అక్రమ వ్యాపారానికి తెరపడింది. లాకులఽను దాటుకుని గోదావరిలోకి వెళ్లేందుకు అధికారులు అనుమతి నిరాకరించడంతో భారీ పడవలను లాకుల వద్ద లంగరు వేసి నిలుపుదల చేశారు. ’సాక్షి’ కథనంతో లాకు గేట్లుకు తాళాలు పడడంతో నీటి వృథాకు అడ్డుకట్ట పడింది. ఓ ప్రజాప్రతినిధి పడవ కార్మికుల ముసుగులో అధికారులను బెదిరించి లాకుల్ని తెరిపించి సాగిస్తున్నా ఇసుక అక్రమ వ్యాపారానికి తెరపడింది. లాకుల తాళాలను స్వాధీనం చేసుకున్న ధవళేశ్వరంలోని హెడ్‌వర్క్స్ అధికారులు మాట్లాడుతూ.. దొంగచాటున సాగిస్తున్న ఇసుక రవాణా భాగోతాన్ని ’సాక్షి’ వెలుగులోకి తీసుకురావడం ద్వారా రోజుకు 500 క్యూసెక్కుల నీరు వృథాగా పోవడాన్ని నిరోధించి రైతులకు మేలు చేసిందంటూ కృతజ్ఞతలు తెలిపారు. లాకులను అక్రమంగా ఎవరు తెరుస్తున్నారు, ఏయే సమయాల్లో తెరుస్తున్నారు, ఎన్ని ఇసుక పడవలు వెళుతున్నాయి, ఇసుక ఎంతమేర వృథాగా పోతోందనే వివరాలను సేకరించిన హెడ్‌వర్క్స్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. -
పశ్చిమడెల్టాకు 5000 క్యూసెక్కుల సాగు నీరు
నిడదవోలు : విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ నుండి పశ్చిమడెల్టా ప్రధాన కాలువకు శుక్రవారం నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని తగ్గించి విడుదల చేస్తున్నారు. గురువారం వరకు 7,000 క్యూసెక్కుల విడుదల చేసిన అధికారులు 1,000 క్యూసెక్కులు తగ్గించి విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న మూడు డెల్టాలకు 10,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు3,000 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 2,200 క్యూసెక్కులు వదులుదున్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 13.96 మీటర్లు నమెదయ్యంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీల నుండి 25,183 క్యూసెక్కుల మిగులు జలాలలను సముద్రంలోకి వదులుతున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలోని ఏలూరు కాలువకు 865 క్యూసెక్కులు,నరసాపురం కాలువకు 1774, తణుకు కాలువకు 465, ఉండి కాలువకు 1129 క్యూసెక్కులు, అత్తిలి కాలువకు 390 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
సంక్షోభంలో వరి సాగు
* కృష్ణా పశ్చిమడెల్టాలో దుర్భిక్ష పరిస్థితులు * కనీవినీ ఎరుగని నీటికొరత * వర్షాభావం కొంత... పుష్కర తాపత్రయం మరికొంత * 5.71 లక్షల ఎకరాల ఆయకట్టుకు లక్ష ఎకరాల్లోనే సాగు * సాగునీటి కొరతతో ఎండుతున్న ‘వెద’జల్లిన వరి కృష్ణా పశ్చిమ డెల్టాలో వరిసాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఖరీఫ్ ఆరంభంలోనే సాగునీటి కొరతతో సాగుకు ఆదిలోనే అవాంతరం ఎదురైంది. వర్షాభావం ఒకపక్క, ప్రభుత్వ పెద్దల పుష్కరాల తాపత్రయం మరికొంత నీటి సమస్యను జటిలం చేసింది. వెదజల్లిన చేలల్లో నీరు లేక పంట దెబ్బతింటోంది. నాట్లు వేసుకుందామని పోసిన నారుమళ్లు జీవం కోల్పోతున్నాయి. నీటితడులకోసం రైతాంగం నానా అవస్థలు పడుతోంది. అరకొర నీటినే ఆయిల్ ఇంజిన్లతో తోడుతూ పంటచేలకు మళ్లిస్తూ సాగు సమరం చేస్తున్నారు. తెనాలి/ కొల్లిపర: పశ్చిమడెల్టాలో గత ఖరీఫ్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనిపించటం లేదు. అధిక వర్షాలు కురుస్తాయన్న అంచనాలనే నమ్ముకొన్నట్టు ఆచరణలో కనిపిస్తోంది. తీరాచూస్తే గత సీజను ఆరంభంనాటి పరిస్థితులే ప్రస్తుత ఖరీఫ్‌లోనూ ఎదురవటం రైతుల దురదృష్టం. జూలై 6 నుంచి పట్టిసీమ నీటిని విడుదల చేస్తున్నాం... 10వ తేదీ నుంచి నారుమళ్లు పోసుకోవచ్చని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని నమ్మిన రైతులు నిండా మునిగారు. ఆగస్టు మూడోవారం పూర్తికావస్తున్నా పంటకాలువలకు నీటి విడుదల కంటితుడుపుగానే కొనసాగింది. దామాషా ప్రకారం నీరివ్వకుండా సంబంధిత మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుడెల్టాకు పెద్దపీట వేశారు. పశ్చిమడెల్టాను నిర్లక్ష్యం చేశారు. కేవలం లక్ష ఎకరాల్లోనే సాగు... ఫలితంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిగా గల పశ్చిమ డెల్టాలో 5.71 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను కేవలం ఆగస్టు 16వ తేదీ వరకు లక్ష ఎకరాల్లో పంట వేయగలిగారు. ఇందులో నారుమళ్లతో పనిలేకుండా నేరుగా విత్తనాలు వెదజల్లిన విస్తీర్ణం 95 వేల ఎకరాలు. నాట్లు వేయగలిగింది కేవలం 5 వేల ఎకరాలేనంటే ఆశ్చర్యపోనవసరం లేదు. 10 వేల ఎకరాలకు సరిపడ నారుమళ్లు పెరుగుతున్నాయి. ఈ విస్తీర్ణం మొత్తం గుంటూరు జిల్లా పరిధిలోనే సుమా! పశ్చిమడెల్టా పరిధిలో ప్రకాశం జిల్లాలోని దాదాపు 70 వేల ఎకరాల ఆయకట్టు రైతులు, నీటికొరత కారణంగా సాగుకు సమాయత్తమయే పరిస్థితి కనిపించటం లేదు. సాగునీటి అవసరాలు పట్టించుకోని ప్రభుత్వం... ఇలా వరిసాగు వివిధ దశల్లో వున్న మాగాణి భూములకు నీటి కొరత తీవ్రంగా వుంది. పుష్కరాల కోసమని ప్రకాశం బ్యారేజి వద్ద 11 అడుగులపైగా నీటిమట్టం వుండేలా చూసుకున్న ప్రభుత్వం, రైతుల సాగునీటి అవసరాలను పట్టించుకోలేదు. ఫలితంగా గత నెలరోజుల్లో పంటకాలువలకు కనీస నీటి సరఫరా ఇవ్వలే కపోయారు. అందులోనూ ఇరిగేషన్ మంత్రి కారణంగా పశ్చిమ డెల్టాపై వివక్ష చూపారని రైతాంగం ఆరోపిస్తోంది. ప్రస్తుత సీజనులో తూర్పుడెల్టాకు 8.6 టీఎంసీల నీరివ్వగా పశ్చిమడెల్టాకు 4 టీఎంసీలనే ఇచ్చారు. ఆ నీటిని ఆయకట్టు ప్రకారం ఇవ్వాల్సివుండగా, తెలుగుదేశం నేతల పలుకుబడితో కొన్ని కాలువలకు ఎక్కువ సరఫరా ఇస్తూ వస్తున్నారు. ఆయిల్ ఇంజిన్లతో నీటి సరఫరా.... ఆగస్టు నెలలో 20 రోజులుగా వర్షాలు జాడ లేకపోవడంతో 18 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పాటు పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం, పడమర గాలి వీస్తుండటంతో వరి పొలాలకు నీరు సరిపోవడం లేదు. బెట్టకు రాకుండా వరికి నీటితడుల కోసం రైతులు శ్రమించాల్సివస్తోంది. బోర్లు అందుబాటులో ఉన్న పొలాలకు ఆయిల్ ఇంజిన్లతో నీరు పెడుతున్నారు. ఇందుకోసం ఎకరాకు రూ.2000 వరకు ఖర్చవుతోందని సిరిపురం గ్రామానికి చెందిన రైతు పోపూరి సుబ్బారావు చెప్పారు. వేమూరు నియోజకవర్గంలో టీఎస్ ఛానల్‌పై 2వ బ్రాంచిపై ఏడు ఆయిల్ ఇంజిన్లు, 3వ నంబరు బ్రాంచిపై పది అయిల్ ఇంజిన్లతో రైతులు నిరంతరం నీటిని తోడుతున్నారు. బ్రాంచి కాలువల్లోకి వచ్చిన నీటిని మళ్లీ చేలల్లోకి తీసుకెళ్లేందుకు అక్కడా అయిల్ ఇంజిన్లే శరణ్యం. ఒక్కో ఎకరాకు ఎలా లేదన్నా రూ.5–6 వేలు నీటి తడులకే వ్యయం చేస్తున్నారు. మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల పరిధిలోని హైలెవెల్ ఛానల్లోనూ ఇదే పరిస్థితి. ఇంతగా కష్టపడుతున్నా వెదజల్లిన చేలల్లో వరి ఎండిపోతోంది. మొక్కలు చనిపోతున్నాయి.. 20 రోజుల కిందట వెద పద్ధతిలో వరి సాగు చేశాను. నీళ్లు అందకపోవడంతో పైరు ఎండిపోతుంది. బోర్ల ద్వారా ఉప్పునీరు రావడంతో పైరు వెంటనే ఎండిపోతుంది. కాల్వల ద్వారా కొంత నీరు వచ్చిన పొలంలోకి ఎక్కడం లేదు. పంట కాల్వలపైన ఉన్న రైతులకు మాత్రమే నీరు సరిపోతుంది. దిగువున్న ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. – వినుకొండ సుబ్బయ్య, రైతు, అత్తోట -
నీటి విడుదలలో పశ్చిమ డెల్టాకు అన్యాయం
ఇరిగేషన్ అధికారులపై రైతుల కన్నెర్ర రైతులకు బాసటగా నిలబడిన మేరుగ, అన్నాబత్తుని తెనాలి: కృష్ణా పశ్చిమ డెల్టాలో మాగాణి భూములకు సాగునీటిని విడుదల చేయకుండా అవస్థలు పాల్జేయటంపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెనాలి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, డాక్టర్ మేరుగ నాగార్జున నేతృత్వంలో పార్టీ నాయకులు, రైతునాయకులు శనివారం మధ్యాహ్నం పశ్చిమ డెల్టా కార్యాలయానికి వెళ్లారు. అరకొర సాగునీటిపై కార్యనిర్వాహక ఇంజినీరు పులిపాటి వెంకటరత్నంను నిలదీశారు. ఇరిగేషన్ మంత్రి కారణంగా పశ్చిమ డెల్టాకు దామాషాకు మించి తూర్పుడెల్టాకు అధిక పరిమాణంలో సాగునీరు తీసుకుంటున్నట్టు నాగార్జున, శివకుమార్‌లు గణాంకాలతో సహా చెప్పారు. పశ్చిమడెల్టాలోనూ ప్రాజెక్టు ఛైర్మన్ మైనేని మురళీకృష్ణ ప్రోద్బలంతో రేపల్లె బ్యాంక్ కెనాల్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ, ఇతర ప్రాంతాలపై వివక్ష ప్రదర్శిస్తున్నట్టు ఆరోపించారు. రైతునాయకులు మాట్లాడుతూ పుష్కరాల్లో మునిగితేలుతున్న చంద్రబాబు తమను నిండాముంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జూన్ పదో తేదీనుంచి వరినాట్లు వేసుకోమన్న చంద్రబాబు మాటలు నమ్మి, సర్వనాశనం అయిపోతున్నట్టు పార్టీ రైతువిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలవర్తి నాగభూషణం అన్నారు. రుణమాఫీ హామీతో రుణగ్రస్థులను చేశారనీ, ఇప్పుడు వరికి నీళ్లివ్వకుండా రైతులను అష్టకష్టాలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎకరా నీటి తడులకు రూ.5 వేల నుంచి రూ. 6 వేల వరకూ ఖర్చు చేయాల్సివస్తున్నట్టు రైతు ఘట్టమనేని రమేష్ చెప్పారు. దీనిపై ఈఈ పులిపాటి వెంకటరత్నం మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న సరఫరా మెరుగవుతుందని హామీనిచ్చారు. -
25నుంచి కాలువల మూసివేత
నిడదవోలు : జిల్లాలోని అన్ని కాలువలకు సాగు, తాగునీటిని అంది స్తున్న పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు ఈనెల 25 నుంచి నీటి విడుదల నిలిచిపోనుంది. ఈ మేరకు జిల్లా అధికారులు గురువారం నిర్ణయం తీసుకున్నారు. తిరిగి జూన్ 1వ తేదీ నుంచి గోదావరినుంచి నీటిని విడుదల చేస్తారు. తొలుత ఈనెల 10న కాలువలు కట్టివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, తాగునీటి అవసరాలను అధిగమించేందుకు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారు. అనంతరం రొయ్యలు, చేపల చెరువులకూ నీరివ్వాలనే డిమాండ్ రావడంతో 25వ తేదీ వరకు మరోసారి పొడిగించారు. ఆధునికీకరణ పనులపై నీలినీడలు ఈ ఏడాది కాలువల కట్టివేత ఆలస్యం కావడం డెల్టా ఆధునికీకరణ, తూడు తొలగింపు పనులపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి 37 రోజులపాటు మాత్రమే కాలువల్ని కట్టివేస్తుండటంతో.. ఆ వ్యవధిలో ఆధునికీకరణ పనులను ఏ మేరకు చేస్తారనే సందిగ్ధత నెలకొంది. ఈ పనులతో పాటు తూడు తొలగింపు కూడా టెండర్ల దశలోనే ఉంది. ఈ పనులు చేపట్టేందుకు ఏటా 60 రోజుల పాటు సమయం ఉండేది. పనులు పూర్తి చేయడానికి ఆ రెండు నెలలు సరిపోని పరిస్థితి. 37 రోజులపాటు మాత్రమే గడువు ఉండటంతో ఏ మేరకు పనులు పూర్తి చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఉభయ డెల్టాల్లో ఆధుని కీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసింది. పాత కాంట్రాక్ట్‌లను రద్దు చేసి కొత్తవారికి పనులు అప్పగిస్తామని ఇటీవల ప్రకటించారు. పనులను ప్రారంభించడం మాట దేవుడెరుగు.. కనీసం ప్రతిపాదన దశ కూడా దాటకపోవడంతో ఈసారి ఆధునికీకరణ చేపడతారా లేదా అనేది అనుమానాస్పదంగా ఉంది. 2016-17 సంవత్సరానికి గాను తూడు తొలగింపు పనుల కోసం రూ.5 కోట్లు అవసరమవుతాయని పేర్కొంటూ ప్రతిపాదనలు చేశారు. ఆ పనులను సైతం కాలువల కట్టివేత అనంతరమే చేపట్టాల్సి ఉంది. వీటికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. కాలువలు కట్టివేసిన తరువాత కాలువగట్లు ఎండటానికి కనీసం వారం రోజులు పడుతుంది. చివరకు 30 రోజులు మాత్రమే మిగులుతుంది. ఆధునికీకరణ, తూడు తొలగింపు పనులకు అనుమతులు వచ్చి, టెండర్లు పిలిచి, పనులు పూర్తి చేయడానికి 30 రోజులు సరిపోదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఏదో రకంగా పనులు చేపట్టి మమ అనిపిస్తారా లేక పక్కా ప్రణాళికతో కొన్ని పనులైనా పూర్తి చేస్తారా అనేది అధికారులు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంది. -
పోరు మానని వీరునిలా..అలుపెరగని అలలా..
ఎన్నిసార్లు ఉవ్వెత్తున ఎగసి, తీరాన్ని తాకి, అణగారిపోయినా మళ్లీమళ్లీ ఉరవడిగా దూసుకొచ్చే కడలి అలలాంటి వాడే కర్షకుడు. ఖరీఫ్‌లో నష్టపోతే ఆశలకు రబీని ఆలంబనగా చేసుకుంటాడు. రబీలో దెబ్బ తింటే.. ఖరీఫ్ కరుణిస్తుందన్న నమ్మకంతో మన్నును మళ్లీ మథించడానికి సన్నద్ధమవుతాడు. ఈ ఖరీఫ్‌లో మంచి దిగుబడి, రాబడి వస్తాయన్న నమ్మకం పోయిన డెల్టా రైతు రివాజుగా రబీ సాగుపై ఆశ పెట్టుకుంటున్నాడు. అయితే.. ప్రస్తుతం గోదావరిలో ప్రవాహం ఆశాజనకంగా ఉన్నా.. చివరి దశలో ఏమవుతుందోనన్న కలవరం రైతన్నను వెన్నాడుతోంది. అమలాపురం :గోదావరి గత ఏడాది ఈ సమయానికి రికార్డుస్థాయిలో ఇన్‌ఫ్లో ఉన్నా రబీ చివరిలో నీటి ఎద్దడి ఏర్పడింది. గత ఏడాది ఇన్‌ఫ్లోతో పోల్చుకుంటే ఈ ఏడాది మూడో వంతు లేకపోవడం కలవరాన్ని కలిగిస్తోంది. అయినా ఖరీఫ్ సేద్యం గిట్టుబాటు కాదని నిట్టూరుస్తూనే అన్నదాతలు రబీ చుట్టూ ఆశలు అల్లుకుంటున్నారు. వర్షాభావం, తెగుళ్లు, చేలు పాలుపోసుకుంటున్న దశలో కురిసిన వర్షాలు ఖరీఫ్ దిగుబడిని దెబ్బతీశాయి. దీంతో వచ్చే రబీపైనే డెల్టా రైతులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం గోదావరికి ఇన్‌ఫ్లో ఆశాజనకంగానే ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో 98 వేల క్యూసెక్కులు ఉంటోంది. ఇందులో తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు పోగా 80 వేల క్యూసెక్కులకు పైగా దిగువకు వదిలేస్తున్నారు. సాధారణంగా గోదావరికి ఈ సమయంలో ఇన్‌ఫ్లో 30 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు మించి ఉండదు. అయితే హుదూద్ తుపాను తో సీలేరు, బలిమెల రిజర్వాయర్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడి, నీరు పెద్ద ఎత్తున వదిలేస్తుండడంతో గోదావరి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. మామూలు రోజుల్లో సీలేరు నుంచి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల మించి నీరు విడుదల కాదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 26 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. గత రబీలో మార్చి తర్వాత నీటికి కటకట సీలేరు నుంచి వచ్చే నీరు సాధారణ స్థాయికి వస్తే గోదావరి ఇన్‌ఫ్లో క్రమేపీ తగ్గి నవంబర్ నెలాఖరుకు 20 వేల క్యూసెక్కులకు పడిపోతుంది. ఇదే జరిగితే రబీకి నీరందించడం కష్టమవుతుంది. వర్షాభావం వల్ల బ్యారేజ్ వద్ద ఈ ఏడాది పెద్దగా ఇన్‌ఫ్లో నమోదు కాలేదు. సెప్టెంబర్ మొదటి వారంలో వరదపోటు తగిలినా ఇప్పటి వరకు కేవలం 1,945 టీఎంసీల నీరు బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేశారు. ఈసారి ఏప్రిల్ చివరి వరకూ నీరు అవసరం గత ఏడాది మూడుసార్లు వరద పోటెత్తడం, మూడోసారి వచ్చిన వరద 15 రోజులకు పైబడి ఉండడంతో అసాధారణంగా ఆరు వేల టీఎంసీలకు పైబడి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అయినా మార్చి తరువాత డెల్టా శివారుల్లో మెరక చేలకు నీరందక రైతులు దిగుబడులు కోల్పోయారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఇన్‌ఫ్లో 30 శాతం కూడా లేదు. డెల్టాలో ఖరీఫ్ సాగు అసాధారణరీతిలో ఆలస్యమైనందున రానున్న రబీలో ఏప్రిల్ నెలాఖరు వరకు నీటిని అందించాల్సి ఉంది. ఫిబ్రవరి నుంచి సీలేరుపై ఆధారపడడం డెల్టాకు పరిపాటిగా మారింది. రబీపై ఇరిగేషన్, వ్యవసాయశాఖ అధికారులతోపాటు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయకుంటే నీటి ఎద్దడి తప్పేలా లేదు. వరుస దెబ్బలు తింటున్న అన్నదాతలు మరోసారి కుదేలవకుండా ఉండాలంటే.. ఇప్పటి నుంచే కచ్చితమైన ప్రణాళిక రూపకల్పన, అమలుకు నడుం బిగించాలి. సీలేరునే నమ్ముకుంటే కష్టమే.. విభజనలో పోలవరం నిర్మాణం కోసం సీలేరు, డొంకరాయి పవర్ ప్రాజెక్టులను, వాటి పరీవాహక ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపడం వల్ల నీరు తెచ్చుకునే సౌలభ్యం ఉంది. అయితే సహజ జలాల రాక తగ్గి, మొత్తం సీలేరుపై ఆధారపడాల్సి వస్తే రబీకి నీటి ఇక్కట్లు తప్పవు. - విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ధవళేశ్వరం -
పశ్చిమ డెల్టాకు ముంపు తిప్పలే
సాక్షి, ఏలూరు : రైతులు కొండంత ఆశ పెట్టుకున్న డెల్టా ఆధునీకరణ మందగమనంలో సాగుతుండటాన్ని ప్రభుత్వం అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా నిధులు విడుదల చేయకుండా తప్పించుకునేందుకు పనులను కుదించాలని చూస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిలో భాగంగానే కమిటీని నియమించిందని పలువురి వాదన. సాగు నీటి రంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజినీర్లతో కూడిన కమిటీ రెండు రోజుల క్రితం జిల్లాలో పర్యటించింది. అసంపూర్తిగా ఉన్న వాటితో పాటు ప్రారంభానికి నోచుకోని సుమారు రూ.300 కోట్ల విలువైన పనులను రద్దు చేయూలని కమిటీ సిఫార్సు చేయనుందని అనుమానిస్తున్నారు. వాటర్ మేనేజ్మెంట్కు అనుకూలంగా ఉన్నవి మినహా డ్రెయిన్లు, కాలువలపై వంతెనలు, స్లూయిజ్‌లు, లాకులు, డెరైక్ట్ పైపులు, రిటైనింగ్ వాల్స్, అక్విడెక్టు వంటి పనులు ఇక చేపట్టే అవకాశాలు లేవని భావిస్తున్నారు. వాటిని రద్దు చేయూలని కమిటీ సిఫార్సు చేయనుందని తెలుస్తోంది. వీటి విలువరూ.300 కోట్లు. అదే జరిగితే పంట చేలు బీళ్లుగా మారడానికి బీజం పడినట్టేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా రైతుకు అవస్థలే జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు పది లక్షల ఎకరాలు సాగు చేస్తుండగా, సాగునీటి అవసరాలకు కాలువలు, డ్రెయిన్లే ప్రధాన ఆధారం. డెల్టా ఆధునికీకరణకు 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం లభించింది. ఆధునికీకరణ పనుల కోసం 2011లో జిల్లాలోని లక్ష ఎకరాల్లో పంట విరామం ప్రకటించగా సుమారు రూ.109కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఆ ఏడాది పంటవేసేందుకు అవకాశం లేకపోగా, తరువాత నుంచి తుపానులు, వరదలు పంటలను ముంచేయటంతో రైతులు దెబ్బతిన్నాడు. గతేడాది ఖరీఫ్‌లో భారీ వర్షాలు, పై-లీన్ తుఫాన్‌కు జిల్లాలో 1.36 లక్షల ఎకరాల్లో పంటలునాశనం అయ్యాయని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. దీంతో డెల్టాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో 7 నుంచి 12 బస్తాలు మాత్రమే వరి దిగుబడి వచ్చింది. డెల్టా ఆధునికీకరణ పూర్తరుుతే పంటలు ముంపునకు గురికావడం, రోజుల తరబడి నీటిలో నాని పాడయ్యే ప్రమాదం చాలా వరకూ తగ్గుతుందని రైతులు అశపడుతుంటే దానికి కూడా గండి కొట్టాలని ప్రభుత్వం చూస్తోందనే అనుమానాలకు ప్రస్తుత పరిస్థితులు తావిస్తున్నారుు. నత్తనడకన పనులు పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులకు రూ.1464 కోట్లు మంజూరు చేశారు. వీటిలో కాలువ పనులకు రూ.846.71 కోట్లు, డ్రెయిన్లకు రూ.419.60 కోట్లు, ఎర్రకాలువ ఆధునికీకరణకు రూ.111 కోట్లు, యనమదుర్రు డ్రెయిన్‌కు రూ.117.65 కోట్లు అవసరమని నిర్ణయించారు. గత నాలుగేళ్ల బడ్జెట్లలో రూ.905 కోట్ల వరకూ కేటాయించారు. రూ.476 కోట్ల మేర మాత్రమే పనులు చేయగలిగారు. -
చినుకు కురిసె.. రైతు మురిసె
►జిల్లాలో విస్తారంగా వర్షాలు ముమ్మరంగా ఖరీఫ్ పనులు ►జులై నెల సగటు వర్షపాతంకంటే ఇప్పటికీ 44 శాతం తక్కువే ►వెదజల్లే విధానం మేలంటున్న వ్యవసాయ శాఖ అధికారులు సాక్షి, ఏలూరు : ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న వాన కొన్ని గంటలైనా కురవాలని ఎన్నాళ్లగానో అన్నదాతలు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తూ వచ్చారు. సాగునీరు కరువై వ్యవసాయ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నెలాఖరులోపు ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోతే వరి సాగు కుదరదని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోక తప్పదని ఆందోళపడుతున్న తరుణంలో నేలను వాన పలకరించింది. అది రైతు మురిసేలా చేసింది. ఇప్పటికీ తక్కువే జిల్లాలో ఆదివారం ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. దీంతో రైతులు ఖరీఫ్ పనులను ముమ్మరం చేశారు. వడివడిగా దమ్ములు చేస్తున్నారు. కొన్ని చోట్ల నాట్లు వేస్తున్నారు. సాధారణంగా జూన్ మొదటి వారంలో వర్షాలు పలుకరిస్తుంటాయి. కానీ ఈ ఏడాది మొహం చాటేశా యి. ఈ నెల రెండో వారంలో ఒకసారి వర్షం పలకరించినా ఇంతలా కురవలేదు. ఇప్పుడు మాత్రం కాస్త నిలిచి కురవటంతో రైతుల్లో సాగుపై నమ్మకం ఏర్పడింది. ఈ సమయంలో సుమారు 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యేది ఆదివారం 21.3 మిల్లీమీటర్లు కురిసింది. ఈ రోజు వర్షపాతం సాధారణం కంటే చాలా ఎక్కువ. అయితే ఈ నెలలో నెమోదు కావాల్సిన వర్షపాతం మాత్రం తక్కువగానే ఉంది. జులై 1 నుంచి 27 వరకు 214.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 120.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ లెక్కన ఇప్పటికీ 43.73 శాతం వర్షపాతం తక్కువగానే ఉంది. డెల్టాలో సాగుకు నీటి కొరత లేదు ఎగువ ప్రాంతాల్లో వానల వల్ల గోదావరిలో నీరు సమృద్ధిగా చేరుతోంది. దీంతో పశ్చిమ డెల్టాకు 7వేల క్యూసెక్కులకుపైగా సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీనివల్ల డెల్టా కింద భూములకు సాగునీటి కొరత లేదు. నిన్నమొన్నటి వరకూ విద్యుత్ కోతలతో సాగునీటికి దూరమైన మెట్టప్రాంత రైతులకు కొద్ది రోజులుగా కాస్త ఊరట లభించింది. జిల్లాలో దాదాపు 87 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులతో బోర్లపై ఆధారపడి సుమారు 52 వేల హెక్టార్లలో రైతులు పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి రెండు విడతల్లో రోజుకి 6 నుంచి 7 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. -
పశ్చిమ డెల్టా లో తగ్గిన వరి పంట
సాక్షి, గుంటూరు: ఈ ఏడాది వరుస తుపాన్లు జిల్లా రైతును నిలువునా ముంచేశాయి. సెప్టెంబరు నుంచి అక్టోబరు చివర వరకూ వెంటాడిన తుపానులతో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా ఖరీఫ్‌లో వరిసాగు చేసిన రైతులకు పెట్టుబడులు దక్కడమే కష్టమైంది. జిల్లా అంతటా ఈ ఏడాది దిగుబడులు బాగా తగ్గాయి. ఎకరాకు 10 బస్తాలు నష్టపోయారు. దీంతో ఒక్కో రైతు ఎకరాకు సుమారు రూ.15 వేలకు పైగా ఆదాయం నష్టపోయారు. జిల్లాలోని కృష్ణా పశ్చిమ డెల్టా కాల్వల కింద, కుడికాల్వ ఆయకట్టు కింద కలిపి ఏడు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరిసాగు చేశారు. విత్తనాలు, నాట్లు, ఎరువులు, కలుపులు, కోతలు, నూర్పిళ్లు.. ఇలా అన్నింటికీ కలిపి ఎకరాకు సుమారు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకూ ఖర్చయ్యాయి. కౌలు రైతులైతే డబ్బు కౌలు చెల్లించి మరీ పొలాల్ని సాగుకు తీసుకున్నారు. తీరా చేతికందిన పంట చూస్తే ఎకరాకు 25 నుంచి 30 బస్తాలు కూడా కనిపించడం లేదు. కిందటేడాది ఎకరాకు గరిష్టంగా 40 బస్తాల పంట దిగుబడి తీసిన రైతాంగం ఈ ఏడాది దిగుబడిని చూసి కంగుతింటున్నారు. తెనాలి కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో వరి కోతలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. 40 శాతం మంది రైతులు కుప్పలు నూర్చి ధాన్యాన్ని ఇళ్లకు చేర్చారు. మిగతా రైతులు పొలంలోనే కుప్పలేశారు. సాగర్ కుడికాల్వ కింద ఆలస్యంగా నాట్లు పడటంతో కోతలు కూడా ఆలస్యంగానే వచ్చాయి. ఇప్పుడిప్పుడే అందుతున్న దిగుబడుల్ని చూసి రైతాంగం కలవరపడుతోంది. పంటల సాగు కోసం బ్యాంకుల్లోనూ, ప్రయివేటు వ్యక్తుల దగ్గరా తీసుకున్న అప్పులకు సరిపడా దిగుబడులన్నా అందుతాయని కలలుగన్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. సుమారు రెండు లక్షల ఎకరాల్లో దిగుబడులు బాగా తగ్గాయని వ్యవసాయ శాఖ అంచనా. బావురుమంటోన్న కౌలు రైతులు జిల్లాలోని కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎకరాకు రూ.10 వేల వరకూ ముందస్తు కౌలు చెల్లించి పొలాలను కౌలుకు తీసుకున్న రైతులు దిగుబడులు తగ్గడంతో తీవ్రంగా నష్టపోయారు. వేమూరు, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, పొన్నూరు, తెనాలి, బాపట్ల, కర్లపాలెం, పిట్లవానిపాలెం మండ లాల్లో ఉన్న 60 శాతం కౌలు రైతులు కౌలు చెల్లింపులతో కలిపి ఎకరాకు రూ.20 వేలకు పైగా నష్టపోయినట్లు సమాచారం. బ్యాంకులు అప్పులివ్వకపోవపడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వరి పంట సాగు చేశామనీ, ప్రకృతి ప్రకోపంతో ఆశలన్నీ అడియాశలయ్యాయని చెరుకుపల్లి మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రబీ పంట పైనే ఆశలు పెట్టుకున్నామనీ, కాలం కలిసి వస్తే రెండో పంట ద్వారానైనా చేసిన అప్పులు తీర్చుకుంటామని వీరంటున్నారు.