పోరు మానని వీరునిలా..అలుపెరగని అలలా..
ఎన్నిసార్లు ఉవ్వెత్తున ఎగసి, తీరాన్ని తాకి, అణగారిపోయినా మళ్లీమళ్లీ ఉరవడిగా దూసుకొచ్చే కడలి అలలాంటి వాడే కర్షకుడు. ఖరీఫ్‌లో నష్టపోతే ఆశలకు రబీని ఆలంబనగా చేసుకుంటాడు. రబీలో దెబ్బ తింటే.. ఖరీఫ్ కరుణిస్తుందన్న నమ్మకంతో మన్నును మళ్లీ మథించడానికి సన్నద్ధమవుతాడు. ఈ ఖరీఫ్‌లో మంచి దిగుబడి, రాబడి వస్తాయన్న నమ్మకం పోయిన డెల్టా రైతు రివాజుగా రబీ సాగుపై ఆశ పెట్టుకుంటున్నాడు. అయితే.. ప్రస్తుతం గోదావరిలో ప్రవాహం ఆశాజనకంగా ఉన్నా.. చివరి దశలో ఏమవుతుందోనన్న కలవరం రైతన్నను వెన్నాడుతోంది.
అమలాపురం :గోదావరి గత ఏడాది ఈ సమయానికి రికార్డుస్థాయిలో ఇన్‌ఫ్లో ఉన్నా రబీ చివరిలో నీటి ఎద్దడి ఏర్పడింది. గత ఏడాది ఇన్‌ఫ్లోతో పోల్చుకుంటే ఈ ఏడాది మూడో వంతు లేకపోవడం కలవరాన్ని కలిగిస్తోంది. అయినా ఖరీఫ్ సేద్యం గిట్టుబాటు కాదని నిట్టూరుస్తూనే అన్నదాతలు రబీ చుట్టూ ఆశలు అల్లుకుంటున్నారు. వర్షాభావం, తెగుళ్లు, చేలు పాలుపోసుకుంటున్న దశలో కురిసిన వర్షాలు ఖరీఫ్ దిగుబడిని దెబ్బతీశాయి. దీంతో వచ్చే రబీపైనే డెల్టా రైతులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం గోదావరికి ఇన్‌ఫ్లో ఆశాజనకంగానే ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో 98 వేల క్యూసెక్కులు ఉంటోంది. ఇందులో తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు పోగా 80 వేల క్యూసెక్కులకు పైగా దిగువకు వదిలేస్తున్నారు. సాధారణంగా గోదావరికి ఈ సమయంలో ఇన్‌ఫ్లో 30 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు మించి ఉండదు. అయితే హుదూద్ తుపాను తో సీలేరు, బలిమెల రిజర్వాయర్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడి, నీరు పెద్ద ఎత్తున వదిలేస్తుండడంతో గోదావరి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. మామూలు రోజుల్లో సీలేరు నుంచి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల మించి నీరు విడుదల కాదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 26 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.
గత రబీలో మార్చి తర్వాత నీటికి కటకట
సీలేరు నుంచి వచ్చే నీరు సాధారణ స్థాయికి వస్తే గోదావరి ఇన్‌ఫ్లో క్రమేపీ తగ్గి నవంబర్ నెలాఖరుకు 20 వేల క్యూసెక్కులకు పడిపోతుంది. ఇదే జరిగితే రబీకి నీరందించడం కష్టమవుతుంది. వర్షాభావం వల్ల బ్యారేజ్ వద్ద ఈ ఏడాది పెద్దగా ఇన్‌ఫ్లో నమోదు కాలేదు. సెప్టెంబర్ మొదటి వారంలో వరదపోటు తగిలినా ఇప్పటి వరకు కేవలం 1,945 టీఎంసీల నీరు బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేశారు.
ఈసారి ఏప్రిల్ చివరి వరకూ నీరు అవసరం
గత ఏడాది మూడుసార్లు వరద పోటెత్తడం, మూడోసారి వచ్చిన వరద 15 రోజులకు పైబడి ఉండడంతో అసాధారణంగా ఆరు వేల టీఎంసీలకు పైబడి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అయినా మార్చి తరువాత డెల్టా శివారుల్లో మెరక చేలకు నీరందక రైతులు దిగుబడులు కోల్పోయారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఇన్‌ఫ్లో 30 శాతం కూడా లేదు. డెల్టాలో ఖరీఫ్ సాగు అసాధారణరీతిలో ఆలస్యమైనందున రానున్న రబీలో ఏప్రిల్ నెలాఖరు వరకు నీటిని అందించాల్సి ఉంది. ఫిబ్రవరి నుంచి సీలేరుపై ఆధారపడడం డెల్టాకు పరిపాటిగా మారింది. రబీపై ఇరిగేషన్, వ్యవసాయశాఖ అధికారులతోపాటు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయకుంటే నీటి ఎద్దడి తప్పేలా లేదు. వరుస దెబ్బలు తింటున్న అన్నదాతలు మరోసారి కుదేలవకుండా ఉండాలంటే.. ఇప్పటి నుంచే కచ్చితమైన ప్రణాళిక రూపకల్పన, అమలుకు నడుం బిగించాలి.
సీలేరునే నమ్ముకుంటే కష్టమే..
విభజనలో పోలవరం నిర్మాణం కోసం సీలేరు, డొంకరాయి పవర్ ప్రాజెక్టులను, వాటి పరీవాహక ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపడం వల్ల నీరు తెచ్చుకునే సౌలభ్యం ఉంది. అయితే సహజ జలాల రాక తగ్గి, మొత్తం సీలేరుపై ఆధారపడాల్సి వస్తే రబీకి నీటి ఇక్కట్లు తప్పవు.
- విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ధవళేశ్వరం