రైతన్నలూ! ఇలా చేస్తే మేలు..
అమలాపురం :ప్రకృతి ప్రకోపించినా, ప్రభుత్వం పరిహసించినా, దళారులు దోచుకుంటున్నా అన్నదాత వెన్ను చూపని వీరుడే. మన్నుపై నమ్మకం వీడక, మనుషులకింత ముద్ద పెట్టేందుకు ఎన్ని యుద్ధాలకైనా సంసిద్ధుడే. ఆ ధైర్యంతోనే, ఆ ఔదార్యంతోనే.. ఖరీఫ్ గిట్టుబాటు కాకున్నా.. కొండంత ఆశతో రబీకి శ్రీకారం చుట్టాడు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండడం, ఏలేరు పరిధిలో సాగు ఆలస్యం కావడం, అడుగంటిన భూగర్భ జలాలతో మోటార్లపై సాగు ముప్పుగా మారడం వంటి పరిణామాలు ఖరీఫ్ ఆరంభం నుంచి సవాళ్లు విసిరినా అదే మన్నులో మళ్లీ ఆశల విత్తులు నాటుతున్నాడు. రబీ నారుమడులు పోస్తున్నాడు.
అవసరమైన సమయంలో అనావృష్టి, వద్దనుకున్న సమయంలో అతివృష్టి, మొలకరాని విత్తనాలు, సుడిదోమ, తెగుళ్లు, సాకారం కాని రుణమాఫీ, అందని రుణం, పంటకు దక్కని మద్దతు.. ఇదీ ఖరీఫ్‌లో రైతులు చవి చూసిన చేదు. పెట్టుబడులూ రాకపోవడంతో అంతా రబీపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది జిల్లాలో రబీ వరి సాగు 3.89 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉన్నా అన్నీ అనుకూలిస్తే ఆ విస్తీర్ణం నాలుగు లక్షల ఎకరాలయ్యే అవకాశముంది. అయితే నీటి ఎద్దడి నేపథ్యంలో డిసెంబరు 15 నాటికి కోతలు పూర్తి కాని రైతులు అపరాలు సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అదే జరిగితే వరి స్థానంలో సుమారు లక్ష ఎకరాల్లో అపరాలు వేయాల్సి ఉంటుంది.
గోదావరి డెల్టాలతో పాటు, ఏలేరు నీటితో, బోర్ల మీద సాగు జరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ కోతలు జరుగుతున్న తీరు చూస్తే డెల్టా శివారు మండలాల్లో జనవరి మొదటివారానికి కూడా కోతలు పూర్తి కావు. ఇటువంటి చోట ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయకుంటే నీటి విడుదల గడువును పెంచాల్సి ఉంటుంది. డెల్టాలో తొలుత ఖరీఫ్ సాగు చేసిన చోట్ల కోతలు పూర్తి కావడంతో రబీ నారుమడులు వేయడం ఆరంభించారు. కొందరు రైతులు సకాలంలో నారు పోయడం కొంత శుభపరిణామమని, మిగిలిన రైతులూ ఇలా ముందస్తు సాగు చేయాలని అధికారులు కోరుతున్నారు.
అధిక దిగుబడి రబీలోనే..
డెల్టాలో ఖరీఫ్ సగటు దిగుబడి 28 బస్తాలు (21 క్వింటాళ్లు)కాగా, రబీ సగటు దిగుబడి 45 బస్తాలు (33.75 క్వింటాళ్లు). ఈ కారణంగా రైతులు, ముఖ్యంగా కౌలుదారులు రబీ దిగుబడిపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. రబీ పండితేనే పెట్టుబడి, శిస్తులు పోను సొమ్ములు కళ్లజూసేది. అయితే కీలకమైన గోదావరి డెల్టాకు నీటి ఎద్దడి పొంచి ఉండడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. మొత్తం సాగుకు 83 టీఎంసీల నీరు అవసరం కాగా, కేవలం 67 టీఎంసీల లభ్యత ఉండడంతో కొరత వచ్చే 16 టీఎంసీల నీటి సేకరణ ఎలా అనేది తేలడం లేదు. దీనిపై స్పష్టత వస్తేగాని ఇరిగేషన్ అధికారులు ఆయా కాలువలకు నీటి విడుదలపై ఒక అంచనాకు రాలేరు. నీటి ఎద్దడి నేపథ్యంలో రబీ సాగును ముందస్తుగా చేపట్టాలని, ఇందుకు రైతులు విజేత (ఎంటీయూ 1001), కాటన్‌దొర సన్నాలు (ఎంటీయూ-1010), ఎంటీయూ-1121 వంటి స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. డిసెంబరు 15 నాటికి నాట్లు పూర్తి చేసే అవకాశమున్న రైతులు బొండాలు (ఎంటీయూ-3626) కూడా సాగు చేసుకోవచ్చంటున్నారు.
పద్ధతి మార్చితేనే మేలు..
సాగు సమయం తక్కువగా ఉన్నందున నారుమడులు వేసి నాట్లు వేసే విధానాన్ని పక్కనబెట్టి వెదజల్లు, డ్రమ్‌సీడర్ పద్ధతిని ఎంచుకోవాలని వ్యవసాయశాఖాధికారులు సూచిస్తున్నారు. దీని వల్ల పది రోజుల నుంచి 15 రోజుల ముందే కోతకు వస్తుంది. నారుమడులు, నాట్ల విధానం లో కూలీలకయ్యే రూ.ఐదు వేలు కాగా వెదజ ల్లు, డ్రమ్‌సీడర్ పద్ధతిలో ఇద్దరు కూలీలు, ఇతర ఖర్చులు కలిపి ఎకరాకు రూ.వెయ్యి కూడా కా దు. డిసెంబరు ఆఖరు వరకు కోతలు పూర్తికాని చోట రైతులు యంత్రాలతో నాట్లు వేయ డం మంచిదంటున్నారు. ఇలా వేసే రైతులు 10 నుం చి 15 రోజుల ముందు పొలం గట్ల మీద, మ కాంల వద్ద, ఇళ్ల వద్ద ట్రేలలో నారు పెంచే సౌలభ్యం ఉన్నందున ఈ పద్ధతి కూడా మంచిదంటున్నారు. ఇప్పుడు స్వల్పకాలిక రకాలను, సకాలంలో సాగు చేస్తే రైతులు రబీలో మంచి దిగుబడులు పొందే అవకాశముంది.