పండినా..పండగ లేదు..
సాక్షి, రాజమండ్రి :జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 5.46 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 16.38 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని అంచనా. ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులే చెప్పారు. మాసూళ్ల అనంతరం రాసులు పడుతున్న ధాన్యాన్ని చూసినప్పుడు రైతుల కళ్లు మెరిసిపోతున్నాయి. అయితే.. ఆ ధాన్యాన్ని అమ్మి, సొమ్ములు చేతికి వచ్చాక ఆ మెరుపు మాయమైపోతోంది. కారణం.. కట్టాల్సిన రుణాలు కొండలా పేరుకుపోవడమే. రుణమాఫీపై కోటి ఆశలు పెట్టుకున్న రైతన్నలు ఎన్నికల ముందు నుంచీ అప్పులు కట్టడం మానేశారు. తీరా మాఫీ హామీ అమలులోకి వచ్చేసరికి సర్కారు దగాకోరుతనం బయటపడింది. ఎన్నికల్లో ఇచ్చిన బేషరతు రుణమాఫీ హామీని సమాధి చేసి, నానారకాల మెలికలతో, నిబంధనలతో లబ్ధిదారులైన రైతుల సంఖ్యను దారుణంగా కుదిం చిన సర్కారు.. చివరికి కొండంత రుణానికి గోరంత మాఫీనే వర్తింపజేసింది. మాఫీతో పొందిన ‘లబ్ధి’.. కళ్ల్లాల్లోని ధాన్యాన్ని ఇంటికి తో లేందుకు అయ్యే ఖర్చులకూ సరి పోలేదని రైతులు వాపోతున్నారు.
రబీకి పెట్టుబడి లేదు..
తొలి విడత రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఆచరణలో మాఫీ మొత్తాన్ని రూ.రెండు, మూడు వేలకు మాత్రమే ప రిమితం చేసింది. మాఫీ మాటెలా ఉన్నా ముందు బకాయిలు కట్టాల ని బ్యాంకు అధికారులు నోటీసులివ్వడంతో రైతులు పుండు మీద కా రం జల్లినట్టు విలవిలలాడుతున్నారు. మాఫీపై ఆశ పెట్టుకుని కట్ట డం మానేసిన అప్పుకు వడ్డీ భారం పెరిగిపోయింది. రూ.50 వేల అ ప్పు వడ్డీతో కలిపి రూ.65 వేలకు పైగా పెరిగింది. రుణ మాఫీ హామీ లేకపోతే అప్పులు సకాలంలో కట్టేవాళ్లమని, వడ్డీ భారం తప్పేదని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు బ్యాంకులు పాత బకాయిలు కడితే తప్ప కొత్త రుణాలు ఇవ్వమనడంతో రబీలో వ్యవసాయం సాగించాలంటే పెట్టుబడి కనిపించడం లేదు. చేతికి వచ్చిన పంట బ్యాంకు అప్పుకే సరిపోయేలా ఉందంటూ రైతులు వాపోతున్నారు.
మాఫీ ఓ మాయ..
నాకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏమిటో తెలీదు. చంద్రబాబు రుణ మాఫీ అంటే నమ్మి, ఓటేశాను. తీరా చూస్తే రుణమాఫీ ఓ మాయ. రూ.44,700 రుణం తీసుకుంటే రూ.15 వేలే మాఫీ అయిందని ఆన్‌లైన్ పత్రం చెబుతోంది. ఆ మొత్తం కూడా అయిదేళ్లలో ఏడాదికి రూ.3 వేల వంతున పోతుందట. నా అప్పు వడ్దీతో కలిపి రూ.57,967 అయితే మాఫీలో అయిదేళ్లకు పోయే రూ.15 వేలు తీసేస్తే మొదట్లో నేను తీసుకున్న అప్పులో రూ.40 వేలకు పైగా అలాగే ఉండిపోతుంది. రుణమాఫీ వల్ల నాకు ఒరిగేందేమిటి? ఇక పండగేం చేసుకుంటాం?
- మామిళ్లపల్లి శ్రీనివాసరావు,
పసుపల్లె, అంబాజీపేట మండలం
పిల్లలకు కొత్తబట్టలూ కొనలేం..
నా భార్య నగలు తాకట్టుపెట్టి నవంబరు 2012న కోరుకొండ ఆంధ్రా బ్యాంకులో తెచ్చిన రూ.50 వేల అప్పుపై రూ.2,523 మాఫీ అయిందని బ్యాంకు అధికారులు లేఖ పంపారు. దాంతోపాటే రూ.50 వేల రుణం వడ్డీతో కలిసి రూ.64,729 చెల్లించాలని, లేదంటే నగలు వేలం వేస్తామంటూ నోటీసూ ఇచ్చారు.చేసేది లేక నా భార్య మిగిలిన నగలన్నీ కుదువపెట్టి రూ.31 వేలు జమచేశాను. మళ్లీ సంవత్సరం అప్పు కావాలంటే అణాపైసలతో సహా బకాయిలు చెల్లించాల్సిందే అని బ్యాంకు అధికారులు చెప్పడంతో మిగిలిన రూ.33,729 వడ్డీపైనైనా తెచ్చి కట్టేయడానికి సిద్ధమవుతున్నాను. పండగకు పిల్లలకు బట్టలు కూడా కొనే పరిస్థితి లేదు.
- పాలా సత్యనారాయణ, గాదరాడ,
కోరుకొండ మండలం