రుణమాఫీ విషయమై ఎన్నికల్లో ఇచ్చిన హామీని యథాతథంగా అమలు చేయకుండా, సవాలక్ష మెలికలు, చిక్కుముడులు పెట్టి రైతన్నలను హతాశులను చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పంట రుణ పరిమితిని తగ్గించి వారిని మరో దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది. ఎరువులు, పురుగు మందులు, కూలి ధరలు పెరగడం వల్ల గత ఏడాది ఖరీఫ్‌కు అయిన పెట్టుబడితో పోల్చుకుంటే ఈ ఏడాది ఖరీఫ్ వ్యయం 20 నుంచి 30 శాతం పెరగనుంది. ఈ నేపథ్యంలో రుణ పరిమితిని పెంచాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా తగ్గించాలని నిర్ణయించడం రైతులను ఆందోళన పరుస్తోంది.
రాజమండ్రి : జిల్లాలో ఖరీఫ్ సేద్యం పనులు మొదలు కాగా వరి సాగుకు సంబంధించి రైతులు నారుమడులు పోస్తున్నారు. మరో 15 రోజుల్లో జిల్లాలో అక్కడక్కడా నాట్లు మొదలయ్యే అవకాశమూ ఉంది. నెల రోజుల్లో రైతులు పూర్తిస్థాయిలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. ఆ సమయానికి రైతులు అప్పుల కోసం బ్యాంకుల వద్ద బారులు తీరతారు. బ్యాంకులు ఆయా పంటలకు ఎకరాకు అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుని రుణాలు మంజూరు చేస్తుంటారుు. పంటలకు అయ్యే పెట్టుబడులను జిల్లాకు చెందిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ టెక్నికల్ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ ఏడాది కూడా టెక్నికల్ కమిటీ పెరిగిన పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని వరి, అరటి వంటి పంటలకు రుణ పరిమితి పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక నివేదికను రాష్ట్ర సాంకేతిక కమిటీకి పంపించింది.
అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రుణ పరిమితిని పెంచడం కుదరదని, ఇప్పుడున్న దానిని కూడా తగ్గించాలని రాష్ట్ర కమిటీ తేల్చిచెప్పింది. అంతేకాదు.. వ్యవసాయ పెట్టుబడులు తగ్గించడం ద్వారా రైతులు లాభాలు పొందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పడం విడ్డూరం. ఏఏ పంటలకు ఎంత ఎంత రుణ పరిమితి ఉండాలో ఆ కమిటీ సూచిస్తూ జిల్లా కమిటీకి నివేదించింది. దీని వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి ఉండడంతో జిల్లా కమిటీ మరోసారి పంటల వారీగా రుణపరిమితిని నిర్ణయిస్తూ రాష్ట్ర కమిటీకి నివేదిక పంపింది. అయితే ఇప్పటి వరకు అక్కడ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బ్యాంకులు మంజూరు చేసే రుణ పరిమితిపై రైతుల్లో గందరగోళం నెలకొంది. రుణ పరిమితిని తగ్గించడం వల్ల పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించక తప్పదని రైతులు నిట్టూరుస్తున్నారు.
పంటరకం 2014లో ఎకరాకు 2015కి జిల్లా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ
రుణపరిమితి (రూ.లలో)= కమిటీ సిఫార్సు = సూచన= తాజా సిఫార్సు
వరి= 26,500= 29 వేలు= 20 వేల నుంచి 25 వేలు= 24 వేల నుంచి 29 వేలు
మొక్కజొన్న= 22 వేలు= 25 వేలు= 17 వేల నుంచి 20 వేలు= 20 వేల నుంచి 25 వేలు
పత్తి= 30 వేలు= 30 వేలు= 23 వేల నుంచి 28 వేలు= 23 వేల నుంచి 28 వేలు
అరటి= 85 వేలు= 95 వేలు= 75 వేల నుంచి 80 వేలు= 75 వేల నుంచి 95 వేలు
అరటి నాటురకం= 75 వేలు= 85 వేలు= 25 వేల నుంచి 30 వేలు= 55వేల నుంచి 85 వేలు
కొబ్బరి= 25 వేలు= 28 వేలు= 18 వేల నుంచి 22 వేలు= 22 వేల నుంచి 28 వేలు
కంద= 1.16 లక్షలు= 1.25 లక్షలు= సూచన ఏమీ లేదు= 1.16 లక్షల నుంచి 1.25 లక్షలు
పొగాకు= 36 వేలు= 36 వేలు= సూచన ఏమీలేదు= 30 వేల నుంచి 36 వేలు
వెనామీ= 5 లక్షలు= 5 లక్షలు= సూచన ఏమీ లేదు= 4లక్షల నుంచి 5 లక్షలు
పెంపు మాని.. కుదింపా?
Published Sun, Jun 28 2015 2:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement