పశ్చిమ డెల్టాకు ముంపు తిప్పలే
సాక్షి, ఏలూరు : రైతులు కొండంత ఆశ పెట్టుకున్న డెల్టా ఆధునీకరణ మందగమనంలో సాగుతుండటాన్ని ప్రభుత్వం అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా నిధులు విడుదల చేయకుండా తప్పించుకునేందుకు పనులను కుదించాలని చూస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిలో భాగంగానే కమిటీని నియమించిందని పలువురి వాదన. సాగు నీటి రంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజినీర్లతో కూడిన కమిటీ రెండు రోజుల క్రితం జిల్లాలో పర్యటించింది. అసంపూర్తిగా ఉన్న వాటితో పాటు ప్రారంభానికి నోచుకోని సుమారు రూ.300 కోట్ల విలువైన పనులను రద్దు చేయూలని కమిటీ సిఫార్సు చేయనుందని అనుమానిస్తున్నారు. వాటర్ మేనేజ్‌మెంట్‌కు అనుకూలంగా ఉన్నవి మినహా డ్రెయిన్లు, కాలువలపై వంతెనలు, స్లూయిజ్‌లు, లాకులు, డెరైక్ట్ పైపులు, రిటైనింగ్ వాల్స్, అక్విడెక్టు వంటి పనులు ఇక చేపట్టే అవకాశాలు లేవని భావిస్తున్నారు. వాటిని రద్దు చేయూలని కమిటీ సిఫార్సు చేయనుందని తెలుస్తోంది. వీటి విలువరూ.300 కోట్లు. అదే జరిగితే పంట చేలు బీళ్లుగా మారడానికి బీజం పడినట్టేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏటా రైతుకు అవస్థలే
జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు పది లక్షల ఎకరాలు సాగు చేస్తుండగా, సాగునీటి అవసరాలకు కాలువలు, డ్రెయిన్లే ప్రధాన ఆధారం. డెల్టా ఆధునికీకరణకు 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం లభించింది. ఆధునికీకరణ పనుల కోసం 2011లో జిల్లాలోని లక్ష ఎకరాల్లో పంట విరామం ప్రకటించగా సుమారు రూ.109కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఆ ఏడాది పంటవేసేందుకు అవకాశం లేకపోగా, తరువాత నుంచి తుపానులు, వరదలు పంటలను ముంచేయటంతో రైతులు దెబ్బతిన్నాడు. గతేడాది ఖరీఫ్‌లో భారీ వర్షాలు, పై-లీన్ తుఫాన్‌కు జిల్లాలో 1.36 లక్షల ఎకరాల్లో పంటలునాశనం అయ్యాయని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. దీంతో డెల్టాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో 7 నుంచి 12 బస్తాలు మాత్రమే వరి దిగుబడి వచ్చింది. డెల్టా ఆధునికీకరణ పూర్తరుుతే పంటలు ముంపునకు గురికావడం, రోజుల తరబడి నీటిలో నాని పాడయ్యే ప్రమాదం చాలా వరకూ తగ్గుతుందని రైతులు అశపడుతుంటే దానికి కూడా గండి కొట్టాలని ప్రభుత్వం చూస్తోందనే అనుమానాలకు ప్రస్తుత పరిస్థితులు తావిస్తున్నారుు.
నత్తనడకన పనులు
పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులకు రూ.1464 కోట్లు మంజూరు చేశారు. వీటిలో కాలువ పనులకు రూ.846.71 కోట్లు, డ్రెయిన్లకు రూ.419.60 కోట్లు, ఎర్రకాలువ ఆధునికీకరణకు రూ.111 కోట్లు, యనమదుర్రు డ్రెయిన్‌కు రూ.117.65 కోట్లు అవసరమని నిర్ణయించారు. గత నాలుగేళ్ల బడ్జెట్లలో రూ.905 కోట్ల వరకూ కేటాయించారు. రూ.476 కోట్ల మేర మాత్రమే పనులు చేయగలిగారు.