నీళ్లొచ్చేది 24 గంటలే
నీళ్లొచ్చేది 24 గంటలే
Published Sun, Apr 16 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM
నిడదవోలు : పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ పరిధిలోని ఉప కాలువలకు సోమవారం నుంచి నీటి విడుదల నిలిపివేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయిం చారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ గేట్లను పూర్తిగా మూసివేస్తారు. 45 రోజుల తరువాత గాని ఈ తలుపులు తెరుచుకునేఅవకాశం లేదు. తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాలకు శనివారం సాయంత్రం నుంచి నీటి విడుదలను నిలిపివేశారు.
పంటలు పూర్తిగా గట్టెక్కుతాయా!
కాలువలకు నీటి విడుదలను గత నెల 30న నిలిపివేయాలని మొదట్లో నిర్ణయించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈనెల 10వ తేదీ తరువాత మూసివేయాలని భావించారు. అయితే, సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని 17వ తేదీ వరకు గడువు పెంచారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 60 శాతం విస్తీర్ణంSలో మాసూళ్లు పూర్తయినట్టు అంచనా. కాలువలు మూసివేసే నాటికి ఇది 70 శాతానికి చేరుతుందని భావిస్తున్నారు. ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లోని చేలకు చివరి దశలో నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సోమవారం నుంచి నీటి విడుదల నిలిపివేస్తే పంట ఎలా గట్టెక్కుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కనీసం మరో వారం రోజులపాటు నీరందిస్తే తప్ప రైతులు గట్టెక్కే పరిస్థితి లేదు.
చెరువుల సంగతేంటి!
జిల్లాలో 400కు పైగా మంచినీటి చెరువులు ఉన్నాయి. వాటిలో పూర్తిగా నీరు నింపితే తప్ప వేసవిలో తాగునీటి అవసరాలు తీరవు. ప్రస్తుతం చెరువుల్లో 70 శాతం వరకు మాత్రమే నీరు చేరినట్టు చెబుతున్నారు. అవి పూర్తిగా నిండాలంటే మరికొన్ని రోజులు కాలువలకు నీరివ్వాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement