జూన్ 1నుంచి కాలువలకు నీరు
జూన్ 1నుంచి కాలువలకు నీరు
Published Sat, May 20 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని కాలువలకు జూన్ 1నుంచి నీరు విడుదల చేయనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ఖరీఫ్ పంటకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూ సేకరణ తదితర అంశాలపై శనివారం ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 10లోగా నారుమడులు వేసుకోవాలని రైతులకు సూచించారు. ఇందుకు అనువుగా 7 నుంచి 10 టీఎంసీల వరకు సీలేరు జలాలను అదనంగా రప్పిస్తామని తెలిపారు. శివారు ప్రాంత భూములకు సమృద్ధిగా నీటిని అందించి జూన్ నెలాఖరు నాటికి జిల్లా అంతటా వరినాట్లు పూర్తయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
15 నాటికి పనులు పూర్తి కావాలి
చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు తప్ప మిగిలిన ఇరిగేషన్ పనులన్నిటినీ జూన్ 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు కురిస్తే డెల్టా ఆధునికీకరణ పనులు చేయడం కష్టమవుతుందని, ఈలోగా ఎర్రకాలువ, నందమూరు అక్విడెక్ట్, ఎస్‌కేకేవైఆర్ వంటి ఇరిగేషన్ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. తాడిపూడి ఎత్తిపోతల కోసం సేకరించిన భూమిలో పంటలు వేయకుండా చర్యలు తీసుకోవాలని, వేస్తే తొలగిస్తామనే విషయాన్ని రైతులకు చెప్పాలని అన్నారు. ఆ భూములను సాగుకు పనికిరాకుండా గుంతలు తవ్వాలన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. శేషావతారం చానల్ నుంచి జూన్ 15 నాటికి నీళ్లు ఇచ్చేలా పనులు పూర్తి చేయాలన్నారు. జూన్ 5 నాటికి పోణంగి పుంత పనులు పూర్తి చేయాలని కోరారు. లబ్బీపేట స్లూయిజ్ 19 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో పాతబడిన లాకుల షట్టర్లను తొలగించి కొత్తవి వేయాలని, వచ్చే మంగళవారం ప్రతి ప్రాంతానికి వెళ్లి తాను చూస్తానని అన్నారు. ఎక్కడైనా పాత షట్టర్లు కనిపించినా, పనులు కాకున్నా చర్యలు తప్పవని శెట్టిపేట డ్రెయినేజీ ఈఈ శ్రీనివాసరావును హెచ్చరించారు.
హైవేను పొడిగించండి
జాతీయ రహదారి–65ను కొవ్వూరు నుంచి నరసాపురం వరకు పొడిగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ ఎస్‌ఈ నిర్మలను కలెక్టర్ ఆదేశించారు. దీనివల్ల జాతీయ రహదారులకు కనెక్టివిటీ వస్తుందన్నారు.
Advertisement
Advertisement