నిడదవోలు : జిల్లాలోని అన్ని కాలువలకు సాగు, తాగునీటిని అంది స్తున్న పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు ఈనెల 25 నుంచి నీటి విడుదల నిలిచిపోనుంది. ఈ మేరకు జిల్లా అధికారులు గురువారం నిర్ణయం తీసుకున్నారు. తిరిగి జూన్ 1వ తేదీ నుంచి గోదావరినుంచి నీటిని విడుదల చేస్తారు. తొలుత ఈనెల 10న కాలువలు కట్టివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, తాగునీటి అవసరాలను అధిగమించేందుకు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారు. అనంతరం రొయ్యలు, చేపల చెరువులకూ నీరివ్వాలనే డిమాండ్ రావడంతో 25వ తేదీ వరకు మరోసారి పొడిగించారు.
ఆధునికీకరణ పనులపై నీలినీడలు
ఈ ఏడాది కాలువల కట్టివేత ఆలస్యం కావడం డెల్టా ఆధునికీకరణ, తూడు తొలగింపు పనులపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి 37 రోజులపాటు మాత్రమే కాలువల్ని కట్టివేస్తుండటంతో.. ఆ వ్యవధిలో ఆధునికీకరణ పనులను ఏ మేరకు చేస్తారనే సందిగ్ధత నెలకొంది. ఈ పనులతో పాటు తూడు తొలగింపు కూడా టెండర్ల దశలోనే ఉంది. ఈ పనులు చేపట్టేందుకు ఏటా 60 రోజుల పాటు సమయం ఉండేది. పనులు పూర్తి చేయడానికి ఆ రెండు నెలలు సరిపోని పరిస్థితి. 37 రోజులపాటు మాత్రమే గడువు ఉండటంతో ఏ మేరకు పనులు పూర్తి చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఉభయ డెల్టాల్లో ఆధుని కీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసింది.
పాత కాంట్రాక్ట్‌లను రద్దు చేసి కొత్తవారికి పనులు అప్పగిస్తామని ఇటీవల ప్రకటించారు. పనులను ప్రారంభించడం మాట దేవుడెరుగు.. కనీసం ప్రతిపాదన దశ కూడా దాటకపోవడంతో ఈసారి ఆధునికీకరణ చేపడతారా లేదా అనేది అనుమానాస్పదంగా ఉంది. 2016-17 సంవత్సరానికి గాను తూడు తొలగింపు పనుల కోసం రూ.5 కోట్లు అవసరమవుతాయని పేర్కొంటూ ప్రతిపాదనలు చేశారు. ఆ పనులను సైతం కాలువల కట్టివేత అనంతరమే చేపట్టాల్సి ఉంది. వీటికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు.
కాలువలు కట్టివేసిన తరువాత కాలువగట్లు ఎండటానికి కనీసం వారం రోజులు పడుతుంది. చివరకు 30 రోజులు మాత్రమే మిగులుతుంది. ఆధునికీకరణ, తూడు తొలగింపు పనులకు అనుమతులు వచ్చి, టెండర్లు పిలిచి, పనులు పూర్తి చేయడానికి 30 రోజులు సరిపోదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఏదో రకంగా పనులు చేపట్టి మమ అనిపిస్తారా లేక పక్కా ప్రణాళికతో కొన్ని పనులైనా పూర్తి చేస్తారా అనేది అధికారులు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంది.
25నుంచి కాలువల మూసివేత
Published Fri, Apr 22 2016 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM
Advertisement