పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉంది కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం. అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. కోరిన కొర్కెలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది సత్తెమ్మ. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానానికి పురాతన చరిత్ర ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో నిడదవోలును నిరవధ్యపురంగా పిలిచేవారు. నిరవధ్యపురాన్ని పాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు శక్తిస్వరూపిణిగా పూజలందుకున్నారు. కాలక్రమేణా కోట శిథిలమైంది. అమ్మవారి విగ్రహం కనుమరుగైంది. అలా అదృశ్యమైన అమ్మవారు 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి పొలంలో, పొలం దున్నుతున్నప్పుడు బయటపడింది. భూమి యజమాని కలను అనుసరించి కోటసత్తెమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి నేటి వరకు అమ్మ... భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచుతోంది. ఈ ఆలయానికి ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, జిల్లాల భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. ఆలయంలో ఏటా దసరా ఉత్సవాలతోపాటు అమ్మవారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహిస్తున్నారు.
శంఖచక్రగద అభయ హస్త యజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలసిన అమ్మవారిని సందర్శించటానికి రెండుకళ్లూ చాలవేమోననిపిస్తుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి. అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఇక్కడ 65 గదులు ఉన్నాయి. ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాలలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మెక్కుబడులు తీర్చుకుంటారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ కోటసత్యనారాయణ, కోటసత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఏటా శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముతైదువలతో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ వ్రతాలకు నిడదవోలు పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంటుంది. దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు రోజుకి సుమారు 100 మందికి శాశ్వత అన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
సంతాన వృక్షానికి పెరుగుతున్న భక్తుల తాకిడి
శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయల కట్టడం సంప్రదాయం. సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు చేరుకుని ఎర్రటి వస్త్రం, పూర్తిగా పండిన రెండు అరటిపండ్లను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును, ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దంపతులు సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, ‘అమ్మా... పండు కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ’ అని వేడుకుంటారు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధి తీసుకువచ్చి పేరు పెట్టుకోవడంతోపాటు బిడ్డ ఎత్తు తులాభారంతో మొక్కుబడి తీర్చుకుంటారు. తులాభారానికి నగదు (నాణేల రూపంలో) లేదా పటిక బెల్లం తూకం సమర్పించుకుంటారు.
ఆలయానికి వచ్చే మార్గం...
అమ్మవారి ఆలయం నిడదవోలు రైల్వేస్టేషన్‌కి (బస్ స్టాండ్, గణపతి సెంటర్‌ల మీదుగా) 3 కిలోమీటర్ల దూరాన ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి 26 కిలోమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.
ప్రతిష్ఠాత్మకంగా రాజగోపుర నిర్మాణం
అమ్మవారి దేవస్థానం ముందు భాగంలో దాతల సహకారంతో తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆలయ ఈవో చొరవతో ఇప్పటివరకు నాలుగు అంతస్థులు పూర్తయ్యాయి.
- గాడి శేఖర్‌బాబు, సాక్షి, నిడదవోలు
Comments
Please login to add a commentAdd a comment