Nidadvolu
-
కన్నతల్లే కఠినాత్మురాలై..
నిడదవోలు రూరల్: పసికందును కన్నతల్లే మురుగు డ్రెయిన్‌లో పడవేసిన విషాదఘటన నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఓ యువతి ఈ ఘాతుకానికి పాల్పడింది. పెళ్లి కాకుండానే గర్భిణి అయిన ఈ యువతి గురువారం అర్ధరాత్రి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు గర్భంలోనే మృతిచెందడంతో డ్రెయిన్‌లో పడవేసినట్లు తెలిసింది. స్థానికులు శుక్రవారం ఉదయం మురుగు డ్రెయిన్‌లో ఉన్న శిశువును చూసి పంచాయతీ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటా సర్వే చేసి అనారోగ్యంతో ఉన్న ఆ యువతిని గుర్తించి నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. తాడిమళ్ల పీహెచ్సీ వైద్యాధికారి సుధీర్‌కుమార్ పర్యవేక్షణలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి యువతికి వైద్యపరీక్షలు చేశారు. యువతి సమాచారం మేరకు సమిశ్రగూడెం ఎస్సై టీవీ సురేష్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పనులకు వెళ్లి పరిచయం పెంచుకుని.. యువతితో పాటు ఆమె తండ్రి ఇద్దరూ కలిసి ఈ ఏడాది జనవరిలో జంగారెడ్డిగూడెం మండలంలో పొగాకు నారుమడుల పనికి వెళ్లారు. వారికి బంధువైన చాగల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గర్భం దాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. తనకు గర్భం వచ్చిందని తెలియదని ఆ యువతి చెప్పినట్లు తెలుస్తోంది. -
లోకేష్ సీఎం కావాలంటే 60 ఏళ్లు ఆగాలి
నిడదవోలు: నారా లోకేష్ బాబూ.. నువ్వ సీఎం కావాలంటే 60 ఏళ్లు ఆగాలి.. ఎన్టీఆర్ చిత్రసీమలో 60 ఏళ్లు కష్టపడిన తరువాత సీఎం అయ్యారు. నేనూ చిత్రసీమ నుంచే వచ్చాను. నేను ప్రజల సమస్యలపై పోరాడుతున్నా.. కష్టపడి సీఎం అయిన ఎన్టీఆర్‌ను నీ తండ్రి చంద్రబాబు వెన్నుపొటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లోకేష్‌పై ఘాటుగా విమర్శించారు. ప్రజా పోరాటయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో సోమవారం గణేష్‌చౌక్ సెంటర్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2014లో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు మద్దతిస్తే ప్రత్యేక హోదా సాధించలేకపోయారన్నారు. అధికారం చేపట్టి నాలుగేళ్లు అయినా నిడదవోలుకు ఒక్క ఆర్వోబీ నిర్మించలేకపోయారని విమర్శించారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్‌తో పాటు టీడీపీ నాయకులంతా చేతకాని దద్దమ్మలని విమర్శించారు. తాము రూపొందించబోయో మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వమే వృద్ధాశ్రమాలను నడిపే విధంగా చూస్తామన్నారు. తాను కోట్లు సంపాదించే సినిమా రంగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తునిలో రైలు తగలబెట్టిన సంఘటనలో అమాయకులపై చంద్రబాబు కేసులు పెట్టారని విమర్శించారు. జగన్ కాపుల విషయంలో మాట మార్చారన్నారు. కాపు రిజర్వేషన్లను రాజ్యాంగంలో 9వ షెడ్యుల్‌లో చేర్చి కేంద్రంతో పోరాటం చేస్తామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు చెందిన పేదలకు రిజర్వేషన్ల కోసం పోరాడతామన్నారు. ప్రభుత్వం ఇచ్చే కిలో రూపాయి బియ్యాన్ని ఎవరూ తినడంలేదన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశానికి రేషన్ బియ్యాన్ని తరలించి టీడీపీ నాయకులు రూ.కోట్లు సంపాదించుకుంటున్నారన్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేయొద్దు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండండి అంటూ పరోక్షంగా నారా లోకేష్‌ను హెచ్చరించారు. -
పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డ..
నిడదవోలు : నవ మాసాలు మోసిన తల్లి అందమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అంతలోనే కసాయిగా మారింది. మాతృత్వం మంట కలిసిన వేళ... స్త్రీ తన హృదయాన్ని బండరాయిగా చేసుకుని అప్పుడే పుట్టిన ఆడబిడ్డను పాడుబడ్డ ఇంట్లో ఎవరూ లేని సమయంలో వదిలి వెళ్లిన సన్నివేశం మానవత్వం ఉన్న మనుషులను కలచివేసింది. తల్లి గర్భం నుంచి అప్పుడే ప్రపంచాన్ని చూసిన ఆ బిడ్డ కేర్ కేర్ మని ఏడుస్తున్నా ఆ తల్లి మనసు కరగలేదు సరికదా రక్త సంబంధాన్ని కూడా నిర్ధాక్షిణ్యంగా తెంచుకుని వెళ్లిపోయింది. నిడదవోలు పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం వెనుక భాగంలో ఉన్న పాడుబడ్డ పెంకుటింట్లో శనివారం ఉదయం గుర్తు తెలియని మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఇంట్లో గత కొంత కాలంగా ఎవరూ నివాసం ఉండటం లేదు. ఈ మహిళ ఎప్పుడు వచ్చిందో.. ఏం కష్టం వచ్చిందో తెలియదు. పురిటి నొప్పులను మౌనంగా భరిస్తూ ఎవరూ లేని సమయంలో గోనె సంచిపై అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమాజం తనని వేలెత్తి ప్రశ్నిస్తుందని భయపడిందో లేక ఆడబిడ్డ ఎందుకని భావించిందో ఏమో తెలియదు కానీ బిడ్డను అక్కడే వదిలి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న బిడ్డను దోమలు, చీమలు కుట్టసాగాయి. దీంతో బిడ్డ బాధను భరించలేక కేర్ కేర్ మని ఏడవసాగింది. ఉదయం 9 గంటల సమయంలో పాడు బడ్డ ఇంట్లో నుంచి బిడ్డ ఏడుపు వినిపించడంతో సీతామహలక్ష్మి అనే మహిళతో పాటు స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బిడ్డ గోనె సంచిపై పడిఉంది. శిశువు పేగు కూడా తీయలేదు. మహిళలు ఈ బిడ్డను ఇంటికి తీసుకువెళ్ళి పేగు కోసి స్నానం చేయించారు. బిడ్డకు గాయాలు కావడంతో కొద్దిగా పౌడర్ అద్ది స్థానిక చిన్న పిల్లల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పట్ట ణ ఎస్సై జి.సతీష్ అక్కడ వచ్చి బిడ్డను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యాధికారి ఏవీఆర్ఎస్ తాతారావు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్య సేవలకు గాను 108 వాహనంలో ఏలూరు ఏరి యా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఐసీడీఎస్ అధికారులు ఏలూరు మతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉందని, ఇన్ఫెక్షన్ కారణంగా శరీరంపై దద్దర్లు వచ్చాయని వైద్యులు పేర్కొన్నారు. పట్టణ ఎస్సై జి.సతీష్ 317 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంతాన ప్రదాయిని కోట సత్తెమ్మ
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉంది కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం. అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. కోరిన కొర్కెలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది సత్తెమ్మ. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానానికి పురాతన చరిత్ర ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో నిడదవోలును నిరవధ్యపురంగా పిలిచేవారు. నిరవధ్యపురాన్ని పాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు శక్తిస్వరూపిణిగా పూజలందుకున్నారు. కాలక్రమేణా కోట శిథిలమైంది. అమ్మవారి విగ్రహం కనుమరుగైంది. అలా అదృశ్యమైన అమ్మవారు 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి పొలంలో, పొలం దున్నుతున్నప్పుడు బయటపడింది. భూమి యజమాని కలను అనుసరించి కోటసత్తెమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి నేటి వరకు అమ్మ... భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచుతోంది. ఈ ఆలయానికి ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, జిల్లాల భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. ఆలయంలో ఏటా దసరా ఉత్సవాలతోపాటు అమ్మవారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహిస్తున్నారు. శంఖచక్రగద అభయ హస్త యజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలసిన అమ్మవారిని సందర్శించటానికి రెండుకళ్లూ చాలవేమోననిపిస్తుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి. అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఇక్కడ 65 గదులు ఉన్నాయి. ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాలలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మెక్కుబడులు తీర్చుకుంటారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ కోటసత్యనారాయణ, కోటసత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఏటా శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముతైదువలతో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ వ్రతాలకు నిడదవోలు పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంటుంది. దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు రోజుకి సుమారు 100 మందికి శాశ్వత అన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సంతాన వృక్షానికి పెరుగుతున్న భక్తుల తాకిడి శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయల కట్టడం సంప్రదాయం. సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు చేరుకుని ఎర్రటి వస్త్రం, పూర్తిగా పండిన రెండు అరటిపండ్లను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును, ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దంపతులు సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, ‘అమ్మా... పండు కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ’ అని వేడుకుంటారు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధి తీసుకువచ్చి పేరు పెట్టుకోవడంతోపాటు బిడ్డ ఎత్తు తులాభారంతో మొక్కుబడి తీర్చుకుంటారు. తులాభారానికి నగదు (నాణేల రూపంలో) లేదా పటిక బెల్లం తూకం సమర్పించుకుంటారు. ఆలయానికి వచ్చే మార్గం... అమ్మవారి ఆలయం నిడదవోలు రైల్వేస్టేషన్‌కి (బస్ స్టాండ్, గణపతి సెంటర్ల మీదుగా) 3 కిలోమీటర్ల దూరాన ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి 26 కిలోమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. ప్రతిష్ఠాత్మకంగా రాజగోపుర నిర్మాణం అమ్మవారి దేవస్థానం ముందు భాగంలో దాతల సహకారంతో తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆలయ ఈవో చొరవతో ఇప్పటివరకు నాలుగు అంతస్థులు పూర్తయ్యాయి. - గాడి శేఖర్‌బాబు, సాక్షి, నిడదవోలు -
25నుంచి కాలువల మూసివేత
నిడదవోలు : జిల్లాలోని అన్ని కాలువలకు సాగు, తాగునీటిని అంది స్తున్న పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు ఈనెల 25 నుంచి నీటి విడుదల నిలిచిపోనుంది. ఈ మేరకు జిల్లా అధికారులు గురువారం నిర్ణయం తీసుకున్నారు. తిరిగి జూన్ 1వ తేదీ నుంచి గోదావరినుంచి నీటిని విడుదల చేస్తారు. తొలుత ఈనెల 10న కాలువలు కట్టివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, తాగునీటి అవసరాలను అధిగమించేందుకు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారు. అనంతరం రొయ్యలు, చేపల చెరువులకూ నీరివ్వాలనే డిమాండ్ రావడంతో 25వ తేదీ వరకు మరోసారి పొడిగించారు. ఆధునికీకరణ పనులపై నీలినీడలు ఈ ఏడాది కాలువల కట్టివేత ఆలస్యం కావడం డెల్టా ఆధునికీకరణ, తూడు తొలగింపు పనులపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి 37 రోజులపాటు మాత్రమే కాలువల్ని కట్టివేస్తుండటంతో.. ఆ వ్యవధిలో ఆధునికీకరణ పనులను ఏ మేరకు చేస్తారనే సందిగ్ధత నెలకొంది. ఈ పనులతో పాటు తూడు తొలగింపు కూడా టెండర్ల దశలోనే ఉంది. ఈ పనులు చేపట్టేందుకు ఏటా 60 రోజుల పాటు సమయం ఉండేది. పనులు పూర్తి చేయడానికి ఆ రెండు నెలలు సరిపోని పరిస్థితి. 37 రోజులపాటు మాత్రమే గడువు ఉండటంతో ఏ మేరకు పనులు పూర్తి చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఉభయ డెల్టాల్లో ఆధుని కీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసింది. పాత కాంట్రాక్ట్‌లను రద్దు చేసి కొత్తవారికి పనులు అప్పగిస్తామని ఇటీవల ప్రకటించారు. పనులను ప్రారంభించడం మాట దేవుడెరుగు.. కనీసం ప్రతిపాదన దశ కూడా దాటకపోవడంతో ఈసారి ఆధునికీకరణ చేపడతారా లేదా అనేది అనుమానాస్పదంగా ఉంది. 2016-17 సంవత్సరానికి గాను తూడు తొలగింపు పనుల కోసం రూ.5 కోట్లు అవసరమవుతాయని పేర్కొంటూ ప్రతిపాదనలు చేశారు. ఆ పనులను సైతం కాలువల కట్టివేత అనంతరమే చేపట్టాల్సి ఉంది. వీటికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. కాలువలు కట్టివేసిన తరువాత కాలువగట్లు ఎండటానికి కనీసం వారం రోజులు పడుతుంది. చివరకు 30 రోజులు మాత్రమే మిగులుతుంది. ఆధునికీకరణ, తూడు తొలగింపు పనులకు అనుమతులు వచ్చి, టెండర్లు పిలిచి, పనులు పూర్తి చేయడానికి 30 రోజులు సరిపోదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఏదో రకంగా పనులు చేపట్టి మమ అనిపిస్తారా లేక పక్కా ప్రణాళికతో కొన్ని పనులైనా పూర్తి చేస్తారా అనేది అధికారులు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంది. -
చెరువులో గుర్తుతెలియని మృతదేహం
నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామశివారులో ఉన్న ఓ చెరువులో గుర్తుతెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది. మృతదేహాన్ని పరిశీలించి చూడగా.. సుమారు 35 సంవత్సరాల ఉన్న పురుషుడి మృతదేహంగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.