లాకులకు తాళం.. అక్రమాలకు కళ్లెం
లాకులకు తాళం.. అక్రమాలకు కళ్లెం
Published Mon, Jan 30 2017 10:27 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
సాక్షి టాస్క్‌ఫోర్స్ :
గోదావరి నదిలోని ఇసుకను తవ్వి.. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ మీదుగా పడవల్లో తరలిస్తున్న అక్రమ వ్యవహారానికి ఎట్టకేలకు కళ్లెం పడింది. అర్ధరాత్రి 12 గంటల తరువాత విజ్జేశ్వరం లాకు గేట్లను అనధికారికంగా తెరిచి ఉదయం 9 గంటల వరకూ భారీ పడవల్లో పెద్దఎత్తున ఇసుక తరలిస్తున్న వైనాన్ని ఈనెల 29వ తేదీ సంచికలో కంట’పడవా’ శీర్షికన ’సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ కథనంపై స్పందించిన ఇరిగేషన్ హెడ్‌వర్క్స్ ఏఈ డి.రాధాకృష్ణ గోదావరి నుంచి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి నీటిని వదిలే విజ్జేశ్వరం హెడ్‌లాక్స్ గేట్లు మూయించి తాళాలు వేశారు. దీంతో ఇసుక రవాణా చేసే పడవలు నిలిచిపోయాయి. అ«ధికారులు పడవల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. అనధికారికంగా లాకులు తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోదావరి హెడ్‌వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు తెలిపారు. అధికారుల చర్యలతో నిడదవోలు మండలం శెట్టిపేట, తాళ్లపాలెం, తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం, ఆరుళ్ల తదితర 11 ప్రదేశాల్లో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ వెంబడి టీడీపీ నేతలు సాగించే ఇసుక అక్రమ వ్యాపారానికి తెరపడింది. లాకులఽను దాటుకుని గోదావరిలోకి వెళ్లేందుకు అధికారులు అనుమతి నిరాకరించడంతో భారీ పడవలను లాకుల వద్ద లంగరు వేసి నిలుపుదల చేశారు. ’సాక్షి’ కథనంతో లాకు గేట్లుకు తాళాలు పడడంతో నీటి వృథాకు అడ్డుకట్ట పడింది. ఓ ప్రజాప్రతినిధి పడవ కార్మికుల ముసుగులో అధికారులను బెదిరించి లాకుల్ని తెరిపించి సాగిస్తున్నా ఇసుక అక్రమ వ్యాపారానికి తెరపడింది. లాకుల తాళాలను స్వాధీనం చేసుకున్న ధవళేశ్వరంలోని హెడ్‌వర్క్స్ అధికారులు మాట్లాడుతూ.. దొంగచాటున సాగిస్తున్న ఇసుక రవాణా భాగోతాన్ని ’సాక్షి’ వెలుగులోకి తీసుకురావడం ద్వారా రోజుకు 500 క్యూసెక్కుల నీరు వృథాగా పోవడాన్ని నిరోధించి రైతులకు మేలు చేసిందంటూ కృతజ్ఞతలు తెలిపారు. లాకులను అక్రమంగా ఎవరు తెరుస్తున్నారు, ఏయే సమయాల్లో తెరుస్తున్నారు, ఎన్ని ఇసుక పడవలు వెళుతున్నాయి, ఇసుక ఎంతమేర వృథాగా పోతోందనే వివరాలను సేకరించిన హెడ్‌వర్క్స్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.
Advertisement