కష్టాలను నిలువరించేనా! | sand rates are so high | Sakshi
Sakshi News home page

కష్టాలను నిలువరించేనా!

Published Sun, Jul 23 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

కష్టాలను నిలువరించేనా!

కష్టాలను నిలువరించేనా!

ఇసుక ధరలకు రెక్కలు 
గోదావరి వరదతో మూతపడిన ర్యాంపులు
నిండుకున్న నిల్వలు
చెలరేగుతున్న అక్రమార్కులు
అక్రమ నిల్వలతో ఇష్టారాజ్యంగా దోపిడీ
ర్యాంపులంతా.. మాయాజాలం 
అమలుకాని జీఓ 
 
కొవ్వూరు : జిల్లాలో ఇసుక ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గోదావరి వరద దృష్ట్యా ర్యాంపులన్నీ మూతపడడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. ఫలితంగా  తగినన్ని నిల్వలు లేకపోవడంతో ధర పెరిగింది. దీనిని ఆసరాగా తీసుకుని అక్రమార్కులు చెలరేగుతున్నారు. అక్రమ నిల్వలు పెట్టుకుని జోరుగా వ్యాపారం చేస్తున్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్నారు. 
 
యూనిట్‌ రూ.2,500!
నదీతీరంలోని ఓపెన్‌ ర్యాంపుల్లో యూనిట్‌ ఇసుకను రూ.175 నుంచి రూ.200 వరకూ అమ్మాలని, నది మధ్యలోని ర్యాంపుల్లో రూ.800 నుంచి రూ.900 వరకూ అమ్మాలని అధికారులు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఎక్కడా ఇసుక నిల్వలు లేకపోవడంతో అక్రమార్కులు యూనిట్‌ ఇసుకను రూ.2వేల నుంచి రూ.2,500 వరకు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో సామాన్యులకు ఇసుక దొరకని దుస్థితి నెలకొంది.  ఈ ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా పడింది. ఎక్కడికక్కడే నిర్మాణాలు నిలిచాయి. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. 
 
ర్యాంపుల మూతతో ఇక్కట్లు 
జిల్లాలో అధికారిక ర్యాంపులు పది ఉన్నాయి. వీటిలో మూడు ర్యాంపులు 20 రోజుల క్రితం, వారం నుంచి మరో ఐదు ర్యాంపులు మూతపడ్డాయి. మిగిలిన కొవ్వూరు, ఔరంగబాద్‌లో ర్యాంపుల్లో మాత్రమే ప్రస్తుతం అరకొర తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో ఇసుక ర్యాంపుల్లో నిల్వలు నిండుకున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని అక్రమార్కులు అడ్డూఅదుపు లేకుండా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అ«ధికారులు ఆ దిశగా యత్నించడం లేదు. దీంతో సామాన్యులు పాట్లు పడుతన్నారు. 
 
ర్యాంపుల్లో.. మాయాజాలం..?
జిల్లాలో పూడిక తీత పేరుతో నదిమధ్యలో పోలవరం, గూటాల, తాడిపూడి, ప్రక్కిలంక, కొవ్వూరు, ఔరంగబాద్‌లో ర్యాంపులకు అనుమతి చ్చారు.  పోలవరంలో లక్ష క్యూబిక్‌ మీటర్లు(సీఎం), గుటాలలో 90 వేల సీఎం, తాడిపూడి, ప్రక్కిలంకలో 80వేల సీబీ, కొవ్వూరు, ఔరంగాబాద్‌ల్లో 1.20 లక్షల సీఎం చొప్పున  తవ్వకాలకు అనుమతిచ్చారు. అంటే ఒక్కో ర్యాంపులో రోజుకు సరాసరి 300 యూనిట్ల నుంచి ఐదు వందల యూనిట్ల వరకు ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఈ లెక్కన ర్యాంపుల్లో నిర్దేశిత ఇసుకను ఎప్పుడో తవ్వేసి ఉంటారని అంచనా.  విచిత్రమేటంటే అధికారులు ర్యాంపుల్లో ఇసుక ఎంతమేర తవ్వాలనేది నిర్దేశిస్తారుగానీ, రోజుకు ఎంత తవ్వుతున్నారు? ఎంత తరలిస్తున్నారో పరిశీలించరు. ఆ లెక్కలూ వారి వద్ద ఉండవు. దీంతో నిర్దేశించిన గడువు వరకు అక్రమార్కులు ఇసుక తవ్వకాలు చేస్తూనే ఉంటారు. ఒక వేళ అధికారులు ఇప్పుడు మేల్కొని అక్రమ తవ్వకాలకు కళ్లెం వేద్దామన్న వరద వల్ల తవ్విన ప్రాంతమంతా చెదిరిపోయింది. దీంతో ఎంత తవ్వారన్నదీ లెక్క కట్టే వీలు ఉండదు. అదనంగా తవ్విన ప్రాంతంలోనూ వరద వల్ల కొత్త గుట్టలు ఏర్పడతాయి. దీంతో ఇసుక తవ్వకాలకు ఢోకా ఉండదు. గతంలో ర్యాంపుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినా.. ఉచిత ఇసుక పాలసీ పేరుతో వాటిని మూలనపడ వేశారు.
ఓపెన్‌ ర్యాంపుల్లోనూ..  
జిల్లాలో ఓపెన్‌ ర్యాంపులుగా తవ్వకాలకు అనుమతిచ్చిన కోడేరులో 4.999 ఎకరాల విస్తీర్ణంలో 42,400 సీఎం, ఖండవల్లిలో 1.800 ఎకరాల విస్తీర్ణంలో 12,600 సీఎం, ముత్యాల ంపాలెంకోడేరు ర్యాంపుల్లో 1.450 ఎకరాల విస్తీర్ణంలో 14,500 సీఎం, వేగేశ్వరపురంలో 2.165 ఎకరాల విస్తీర్ణంలో 21,650 సీఎంల ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ నాలుగు ర్యాంపుల్లో 91,150 సీఎం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. వాస్తవంగా ఓపెన్‌ ర్యాంపుల్లో రోజుకు 300 నుంచి 500 లారీల వరకు ఇసుక తవ్వకాలు చేశారు. అంటే రోజుకు సరాసరి మూడు వేల నుంచి నాలుగు వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలు చేశారు. అంటే నిర్దేశించిన ఇసుకను కేవలం వారం వ్యవధిలోనే తవ్వేసి ఉంటారనేది అంచనా. అంటే నిర్దేశిత క్యూబిక్‌ మీటర్ల కంటే అదనంగానే ఇక్కడ ఇసుక తవ్వకాలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 11 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10 వరకు ఇసుక తవ్వుకునేలా అధికారులు పర్యావరణ అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు తవ్విన ఇసుకకు అధికారులు వద్ద లెక్కల్లేవు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు యథేచ్ఛగా ఇసుక తవ్వుకునే వీలు అనుమతిదారులకు ఉంది. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇప్పటివరకు తవ్విన ఆనవాళ్లన్నీ గోదారమ్మ గర్భంలో కలిసిపోవడం అక్రమ తవ్వకాలకు మరింత ఊతమిచ్చినట్టయింది.
 
జీఓ తుంగలో.. 
2016లో ఇసుక ర్యాంపుల్లో అక్రమాల నియంత్రణ కోసం ప్రభుత్వం జీఓ 42ను విడుదల చేసింది. ఇది ఇప్పటివరకూ అమలైన దాఖలా లేదు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా శాండ్‌ మైనింగ్‌ కమిటీ  మండల స్థాయిలో ఎస్సై, డెప్యూటీ తహశిల్ధార్, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు దీనిని అమలు చేయాలి. కాల్‌సెంటర్, వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరించాల్సి ఉంది. జీఓ ప్రకారం.. అనధికారిక ర్యాంపుల్లో తవ్వకాలు చేసినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా లారీ, టిప్పర్, ఇతర వాహనాలకు రూ.లక్ష జరిమానా, రెండేళ్లు శిక్ష విధించాలి. ఇసుకను నిర్మాణ పనులకు తప్ప పూడ్చడానికి వినియోగించకుడదు. అక్రమ నిల్వలు పెట్టకుడదు. ర్యాంపులు ఆ««ధీనంలో పెట్టుకున్నా, సిండికేట్లుగా మారి ఇసుక విక్రయాలు సాగించినా రెండేళ్లు జైలు, రూ.2లక్షల వరకు జరిమానా విధించాలి. ర్యాంపుల్లో ఇసుక లోడింగ్‌కు గానీ, తవ్వకాలకు గానీ యంత్రాలను వినియోగించ కుడదు. వాడితే వాటిని సీజ్‌ చేయవచ్చు. టీడీపీ నేతలే ర్యాంపుల్లో తిష్టవేయడంతో జీఓను అమలు చేయలేక అధికారుల చేష్టలుడిగి చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 
ఎట్టకేలకు కదలిక!
ఇసుక అక్రమ తవ్వకాలు, విక్రయాలతో అప్రతిష్టను మూటకట్టుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు కళ్లు తెరిచినట్టు కనిపిస్తోంది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది. ఇప్పుడు నింబధనల పేరుతో మళ్లీ జూలు విదులుస్తున్నారు. అయితే ఇప్పటికైనా వారు అక్రమార్కులకు కళ్లెం వేసి, సామాన్యుల కష్టాలను నిలువరిస్తారో లేదో వేచిచూడాల్సిందే.
 
యంత్రాలు వినియోగిస్తే సీజ్‌ చేస్తాం
ఇసుక ర్యాంపుల్లో యంత్రాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం. లోడింగ్‌కి వినియోగించినా యంత్రాలను సీజ్‌ చేయిస్తాం. సంబంధిత వ్యక్తులపై కేసు పెడతాం.అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. నిర్వాహాకులపై కేసు నమోదు చేస్తాం.
జి.మణికంఠ రాజు, ఏఈ, ఏజీఆర్‌బీ, కొవ్వూరు
 
 
 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement