అవి..నీటి మేతలు | sand | Sakshi
Sakshi News home page

అవి..నీటి మేతలు

Published Thu, Feb 16 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

అవి..నీటి మేతలు

అవి..నీటి మేతలు

 
  • ఇసుక మేటల తొలగింపులో మాయాజాలం 
  • మేటలు తొలగించకుండా నదిలో డ్రెడ్జింగ్‌
  • వరద వస్తే అక్కడ మళ్లీ చేరనున్న ఇసుక
  • కోటిలింగాల ఘాట్‌ వద్ద మరిన్ని విచిత్రాలు 
  • మేటలు అలాగే ఉన్నా గుట్టలుగా ఇసుక 
  • రూ.3 కోట్లు గోదారమ్మ పాలు
 
గోదావరి నదిలో మేటలు తీయడానికి రూ.3 కోట్లు కేటాయించారు...ఈ నిధులతో మేటలు తొలగిస్తూ ఇసుకను
విక్రయించాలి... దీనివల్ల నదీగర్భం లోతు పెరిగి ప్రవాహం వేగం అందుకుంటుంది. కానీ దీనికి భిన్నంగా మేటలు తొలగించకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో అసలు లక్ష్యానికి తూట్లు పడుతున్నా యన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
 
 
సాక్షి, రాజమహేంద్రవరం :
పనుల్లో కాంట్రాక్టర్ల చేతివాటం..వారికి అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండ, పనులపై అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. ఆ ధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళుతోంది. ఇందుకు గోదావరిలో ఇసుక మేటల తొలగింపు ప్రక్రియ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ పక్క ఎప్పటి నుంచో ఉన్న ఇసుక మేటలు డ్రెడ్జింగ్‌ అనంతరం కూడా అలాగే ఉన్నా ఇసుక మాత్రం గుట్టలుగా పడింది. తూతూ మంత్రంగా పని కానిచ్చేసి రూ.3 కోట్లను దర్జాగా జేబుల్లో వేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరి నదిలో ఇసుక మేటల డ్రెడ్జింగ్‌ పనుల మాయాజాలం పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ధవళేశ్వరం కాట¯ŒS బ్యారేజీకి ఎగువన వరదల కారణంగా గోదావరి నదిలో అనేక ప్రాంతాల్లో ఇసుక మేటలు వేసింది. దాదాపు 50 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఆయా మేటల్లో ఉన్నట్లు అంచనా. దీనివల్ల కాట¯ŒS బ్యారేజీ వద్ద నాలుగు ఆర్మ్‌ల్లో నీటి ప్రవాహం ఒకేలా ఉండటం లేదు. అంతేగాకుండా బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 2.91 టీఎంసీలు ఉండడం లేదు. వేసవిలో రాజమహేంద్రవరం నగరంలో తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 18న ప్రభుత్వం 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్‌ చేసి తొలగించడానికి రూ.16.52 కోట్లను మంజూరు చేసింది. వాడపల్లి, గోబలంక, పిచ్చుక లంక సమీపంలోని మేటలు, కాటవరం, కోటిలింగాలఘాట్‌ సమీపంలోని మేటలు తొలగింపజేయాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. ఇసుక మేటల డ్రెడ్జింగ్‌ పనులకు టెండర్లు పిలవగా ‘ఓష¯ŒS స్పార్కిల్‌ లిమిటెడ్‌’ పనులు దక్కించుకుంది. ముందుగా కాట¯ŒS బ్యారేజీ వద్ద పిచ్చుక లంక సమీపంలోని ఇసుక మేటలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఇసుకను అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా టూరిజం ప్రదేశాలకు తీర్చిదిద్దాలనుకుంటున్న పిచ్చుక లంకను చదును చేయడానికి, పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనులకు, మిగిలిన ఇసుకను సాధారణ ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. పర్యాటక శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు డ్రెడ్జింగ్‌ చేసిన ఇసుకతో పిచ్చుకలంకను చదును చేశారు.
కోటిలింగాల ఘాట్‌లో వి‘చిత్రాలు’...
రాజమహేంద్రవరం నగరంలోని కోటిలింగాల ఘాట్‌ సమీపంలోని ఇసుక మేటలను తొలగించే పనులను గత నెల 2వ తేదీన ప్రారంభించారు. నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, జలవనరులశాఖ ఈఈ కృష్ణారావులు పనులకు శ్రీకారం చుట్టారు. సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థ కోటిలింగాల ఘాట్‌ కైలాస భూమి పక్కన, పేపర్‌ మిల్లు వ్యర్థ జలాలు నదిలోకి విడుదలయ్యే ప్రాంతంలో డ్రెడ్జింగ్‌ను ప్రారంభించింది. మేటల తొలగింపు కాకుండా కాంట్రాక్ట్‌ సంస్థ నదీ గర్భంలో ఇసుకను తోడి గట్టున పోసింది. గట్టుపై చుట్టూ మట్టికట్టలు కట్టి అందులో ఇసుక పోసింది. ఇసుక మేటల జోలికి మాత్రం పోలేదు. కోటిలింగాల ఘాట్‌ వద్ద మేటలు తొలగించడం వల్ల వేసవిలో నీటి ఎద్దడి తీరడంతోపాటు గోదావరిలో మత్స్యకారులు చేపల వేట ద్వారా ఉపాధి లభిస్తుం దని పనులకు శంకుస్థాపన చేసిన సమయంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు. అయితే ఇందుకు భిన్నంగా పనులు జరుగుతున్నాయి. మేటలు తొలగించకుండా నదిలో ఇసుకను తోలి గట్టున పోయడం వల్ల ఎలాంటి లాభం లేదని జలవనరులశాఖ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే వరదల్లో నదిలో నుంచి తీసిన ఇసుక స్థానంలో మళ్లీ కొత్త ఇసుక చేరుతుందని చెబుతున్నారు. 
రూ. 3 కోట్లు గోదారమ్మపాలు... 
కాట¯ŒS బ్యారేజీ ఎగువన ఉన్న ఇసుక మేటల్లో 10 లక్షల క్యూబిక్‌ మీటర్లు ఇసుకను తొలగించాలని అధికారులు నిర్ణయించగా కోటిలింగాల ఘాట్‌ ప్రాంతంలోనే దాదాపు రెండు లక్షల క్యూబిక్‌ మీటర్లు తొలగించాల్సి ఉంది. ప్రభుత్వం కేటాయించిన రూ.16.52 కోట్లలో కోటిలింగాల ఘాట్‌ ఇసుక మేటలను తొలగించేందుకు రూ.3 కోట్లు కేటాయించారు. అయితే ప్రస్తుతం నదీ గర్భంలో నుంచి తీసిన ఇసుక అధికారులు నిర్ణయించిన లక్ష్యంలో 30 శాతం కూడా లేదు. అది కూడా ఇసుక మేటలు కాకుండా నదీ గర్భంలోని ఇసుక తీయడం వల్ల అసలు లక్ష్యం నెరవేర లేదు. పేపర్‌ మిల్లు వ్యర్థాలు గోదారిలో కలిసేచోట నదీ గర్భంలో ఇసుకను తీయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేపర్‌ మిల్లు వ్యర్థ జలాలు వేసవి కాలంలో కూడా సాఫీగా వెళ్లడానికా అన్నట్టు నదీ గర్భంలో ఇసుకను తోడినట్లుగా పనులు ఉన్నాయంటున్నారు. లేకుంటే కనిపించే ఇసుక మేటలు కాకుండా నదీ గర్భంలో ఇసుకను తోడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement