తోడేస్తున్నారు
తోడేస్తున్నారు
Published Thu, Jun 15 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM
కొవ్వూరు : ఇసుక దందా కొత్త పుంతలు తొక్కుతోంది. గోదావరి నదీ గర్భంలోకి డ్రెడ్జింగ్ యంత్రాలను దింపి మరీ ఇసుకను తోడేస్తున్నారు. ర్యాంపుల్లో యంత్రాల వినియోగంపై నిషేధం ఉన్నా తూచ్ అంటున్నారు. తాళ్లపూడి మండలం తాడిపూడి ర్యాంపులో భారీ పడవలపై డ్రెడ్జింగ్ యంత్రాలను ఉంచి నది మధ్యలో పెద్దఎత్తున తవ్వకాలు సాగిస్తున్నారు. ఇలా తవ్విన ఇసుకను పొక్లెయిన్ల సాయంతోఒడ్డుకు చేర్చి లారీల్లో లోడు చేస్తున్నారు. నాలుగు రోజులుగా రేయింబవళ్లు నిరాటంకంగా ఈ తంతు సాగుతోంది. అబ్కారీ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది.
రోజుకు 500 యూనిట్ల సేకరణ
తాడిపూడిలో నాలుగు పెద్ద పడవలను వినియోగించి ఇసుకను డ్రెడ్జింగ్ పద్ధతిలో తవ్వుతున్నారు. ఒక్కొక్క పడవలో.. ఒక్కొక్క ట్రిప్పునకు 25 నుంచి 30 యూనిట్లకు పైగా ఇసుకను సేకరిస్తున్నారు. ఇలా రోజుకు 500 యూనిట్ల ఇసుకను తోడేస్తున్నారు. యూనిట్‌ను రూ.800 వరకు విక్రయిస్తూ రోజుకు రూ.4 లక్షల్ని దోచుకుంటున్నారు. ఇక్కడ తవ్విన ఇసుకను విశాఖపట్నం, నూజివీడు, విజయవాడ వంటి దూర ప్రాంతాలకు సైతం తరలిస్తున్నారు. టీడీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బల్లిపాడు ర్యాంపులోనూ గుట్టుచప్పుడుగా యంత్రాల సాయంతో తవ్వకాలు సాగుతున్నాయి.
కార్మికులతోనే తవ్వకాలు చేయించాలి
జిల్లా వ్యాప్తంగా 13 ఇసుక ర్యాంపులకు అనుమతులున్నాయి. వీటన్నిటిలో కార్మికులతోనే తవ్వకాలు చేయాల్సి ఉంది. పొక్లెయిన్ వంటి యంత్రాలను ఉపయోగించడానికి, డ్రెడ్జింగ్ చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు. తాడిపూడిలో డ్రెడ్జింగ్ చేస్తున్న విషయంపై పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటాం.
– పి.మోహనరావు, అసిస్టెంట్ డైరెక్టర్, మైన్స్
Advertisement
Advertisement