చంద్రబాబు ఇసుక స్కాం జరిగిందిలా.. ఆ నివేదికలో ఏముంది? | Kommineni Comments On Chandrababu Sand Scam | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఇసుక స్కాం జరిగిందిలా.. ఆ నివేదికలో ఏముంది?

Published Sat, Nov 4 2023 12:14 PM | Last Updated on Sat, Nov 4 2023 4:06 PM

Kommineni Comments On Chandrababu Sand Scam - Sakshi

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులు, ఒక మాజీ ఎమ్మెల్యేపైన ఇసుక కుంభకోణం కేసు నమోదు అవడం విశేషం. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో జరిగిన అవినీతిని ఈ ఉదంతం వెలుగులోకి తెచ్చింది. ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని గనుల అభివృద్ది సంస్థ అంచనా వేసింది. సీఐడీ ఆ మేరకు కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తెలియచేసింది. బహుశా దీనికి కూడా 17ఎ వర్తింపచేయాలని, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేయవచ్చు.

✍️తాము ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నందున తమపై ఇసుక కేసును బనాయించారని టీడీపీ నేతలు చేస్తున్న ప్రతి విమర్శ. ఎప్పుడు అక్రమం జరిగినా అది బయటకు రావల్సిందే కదా! టీడీపీ వారు ఆరోపిస్తేనే అవినీతి, ఏపీ ప్రభుత్వ సీఐడీ కేసు నమోదు చేస్తే అది అక్రమం అని ఎలా వాదిస్తారు?. ఇసుక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా సుమారు మూడు దశాబ్దాలుగా ఉంది. 1990వ దశకం మొదట్లో సుమారు వంద కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. పంచాయతీల ద్వారా కొంత కాలం, ఆ తర్వాత కేవలం ఎడ్ల బండ్ల మీద తీసుకువెళ్లేవారికే ఉచితం అని కొంత కాలం ఇలా పలు విధానాలు అమలు జరిగాయి. కాని అప్పట్లో ఇసుకలో ఇంత అవినీతి సొమ్ము ఉందని ఊహించలేకపోయారు.

✍️2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలం పాటలు జరిగేవి.  చంద్రబాబు వచ్చాక అందులో పలు మార్పులు చేశారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు ఈ రీచ్‌లు అప్పగిస్తున్నామని, తద్వారా వారికి ఇది ఉపయోగం అవుతుందని ఆయన ప్రకటించారు. నిజంగానే ఇది మహిళోద్దరణమోనని అనుకున్నారు. తీరా చూస్తే మహిళా సంఘాలను అడ్డుపెట్టుకుని అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఇసుకపై అక్రమ సంపాదనకు అది ఒక మార్గం మార్చారన్న సంగతిగా తేలింది. ఈ సంఘాల మహిళలకు కొద్దిపాటి డబ్బు ముట్టచెప్పి, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఇష్టారాజ్యంగా ఇసుకను తరలించి అమ్ముకునేవారు. ఒకే చలాన్ పై అనేక మార్లు లారీలను తిప్పడం, తదితర అవకతవకలకు పాల్పడేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

✍️కారణం ఏమోకాని, ఈ పద్దతి కన్నా అసలు ఇసుక ఉచితం అని చెబితే టీడీపీ నేతలకు ఎక్కువ లాభం అనుకున్నారేమో తెలియదు కాని ఉచిత విధానం తెచ్చారు. దీనికి మంత్రివర్గ ఆమోదం లేకపోవడం కూడా గమనించాలి. పోనీ చిత్తశుద్దితో దానిని అమలు చేశారా అంటే అదీ లేదు. ఇక పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి కలిగిన టీడీపీ నేతల ఇష్టారాజ్యం అయిపోయింది. వారు ఎక్కడ కావాలంటే అక్కడ తవ్వడం, అమ్ముకోవడం చేశారు. చివరికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగేవి.

✍️నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపై విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. ఉచిత ఇసుకలో దందా జరిగిందనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై పాతికవేల కోట్ల అక్రమాలు జరిగాయంటూ దావాలు కూడా వేశారు. తర్వాత అవి ఏమయ్యాయోకాని, ఆయన మాత్రం తదుపరి టీడీపీ మద్దతుదారుగా మారారు బహుశా. ఆ శ్రవణ్ కుమారే అనుకుంటా! కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని అప్పట్లో ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని ఆ సంస్థ తన నివేదికలో కూడా తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తే దానిపై కూడా కేసు పెడతారా అని టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా సంస్థలు ప్రశ్నించాయి.

✍️ఈనాడు అయితే జగన్ ప్రభుత్వంపై వేల కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసేసింది. ఇక్కడ సంగతి ఏమిటంటే చంద్రబాబు ఉచితం ఇసుక విధానం తెచ్చినందుకు కేసు పెట్టలేదు. ఆ పేరుతో ఇసుక దందా చేసినందుకు, వందల కోట్ల అక్రమార్జన చేసినందుకు అని గుర్తుంచుకోవాలి. అప్పట్లో ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు ఆమెపై దౌర్జన్యం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆ సందర్భంలో  చింతమనేనిని కాకుండా వనజాక్షినే చంద్రబాబు మందలించడం కూడా విమర్శలకు గురైంది.

✍️అంతేకాదు. ఒకసారి ఈనాడు పత్రికలోనే ఏ ఏ టీడీపీ ఎమ్మెల్యే ఇసుక రీచ్‌లను ఎలా దోచుకుంటున్నారో వివరిస్తూ ఒక కథనాన్ని ఇచ్చింది. కాకపోతే లోపలి పేజీలో ఆ ఎమ్మెల్యేల పేర్లు రాయకుండా స్టోరీ ప్రచురించారు. బహుశా ఆయా ఎమ్మెల్యేలను బెదిరించడానికి అయి ఉండవచ్చు. ఇసుక దోపిడీ పై ప్రస్తుతం సీఐడి పెట్టిన కేసు వివరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి, జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికే ఈనాడు, తదితర టీడీపీ మీడియాలు ప్రయత్నించాయి. కొద్ది రోజుల క్రితమే బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి  జగన్ ప్రభుత్వంపై ఇసుక దోపిడీ అంటూ ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం ఇసుకకు సంబంధించి ఒక నిర్దిష్ట విధానం తెచ్చి ఏడాదికి 750 కోట్ల మేర ఆదాయం సమకూర్చింది. అయినా అవినీతి జరిగిందని చెబుతున్నవారు గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన దందా గురించి ఎందుకు ప్రశ్నించడం లేదో తెలియదు.
చదవండి: పురందేశ్వరి గారూ.. మీది వెన్నుపోటు రాజకీయమా?’ 

✍️అసలు సీఐడీ కేసులు పెట్టడమే తప్పని వీరు వాదించడం ఆరంభించారు. మరి అలాంటప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై టీడీపీ నేతలు, వారి అంతేవాసులు నిత్యం కోర్టులకు వెళ్లి ఎందుకు కేసులు వేస్తున్నారు?. వైసీపీ అసమ్మతి ఎంపీని అడ్డం పెట్టుకుని ఏకంగా జగన్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరుతూ పిల్ ఎలా వేశారు. అలా చేయడం రైట్ అయినప్పుడు ఇప్పుడు ఏపీ సీఐడీ వారు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో సహా కేసులు వేయడం ఎలా తప్పు అవుతుంది?టీడీపీ కాని, ఈనాడు వంటి మీడియా సంస్థలు కాని పరస్పర విరుద్దంగా వ్యవహరిస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాం చేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నాయని పదే, పదే రుజువు చేసుకుంటున్నాయి.

✍️గత ప్రభుత్వంలో ఇసుకకు సంబంధించి వేల కోట్ల అవినీతి జరిగిందన్నది పచ్చి నిజం. టీడీపీ హయాంలో వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని కేసు పెట్టారు. దానిని రుజువు చేయడానికి సీఐడీ ఎలాంటి ఆధారాలు చూపుతుందన్నది చూడాలి. అవినీతి జరగడం వేరు. దానిని కోర్టులలో రుజువు చేయడం వేరు. ఏది ఏమైనా ఇప్పటికే పలు అవినీతి కేసులలో కూరుకుపోయిన చంద్రబాబు నాయుడిని ఈ అవినీతి ఇసుక ఎలా కప్పివేస్తుందో, దానిని ఆయన ఎలా కడుక్కుంటారో వేచి చూడాల్సిందే.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement