‘‘రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నాం. రాయలసీమ తరహాలో ఒకరి పోస్టుమార్టమ్‌కు కారణమైన వారికి కూడా పోస్ట్ మార్టమ్ తప్పదు. ఒకరిని చంపితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ వ్యక్తిని కూడా చంపుతారు. సూపర్ సిక్స్ హామీలను ప్రచారం చేసింది కార్యకర్తలే. బ్యూరోక్రసి కాదు. కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుంది" ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ప్రకటన ఇది. చాలా ప్రమాదకరమైన, బాబు వయసు, హోదాలు రెండింటికీ తగని ప్రకటన ఇది.
రాష్ట్రంలో పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదని, శాంతి భద్రతల పరిరక్షణ ఏకపక్షంగానే కొనసాగనుందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్లు ఉంది. ఒకప్పుడు మాజీ మంత్రి పరిటాల రవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఇలాంటి ప్రకటనే ఒకటి చేశారు. కొంతకాలం తీవ్రవాదిగా ఉండి ఆ తరువాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన పరిటాల రవి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీయార్ కేబినెట్‌లో మంత్రి అయిన విషయం తెలిసిందే. ఆ రోజుల్లో అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నేతలకు, ప్రత్యర్థి వర్గాలకు రవి అంటే హడల్! తాడిపత్రి కేంద్రంగా రాజకీయం నడుపుతున్న జేసీ సోదరులకు, రవికి అస్సలు పడేది కూడా కాదు. పెనుకొండ ప్రాంతంలో పరిటాల రవి, ఆయన ప్రత్యర్ది మద్దెలచెరువు సూరి వర్గానికి మధ్య పెద్ద ఎత్తున వర్గపోరు నడుస్తూండేది.
ఇందులో ఇరుపక్షాల్లోనూ చాలామంది హత్యకు గురయ్యారు. వీరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చివరకు రవి కూడా అనంతపురంలో టీడీపీ ఆఫీసు వద్ద జరిగిన కాల్పుల్లో హతమైన వైనమూ తెలిసిందే. ఫ్యాక‌్షన్ గొడవలపై ఒకసారి ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది.. ‘‘నాకు తెలుసన్నా.. ఎప్పటికైనా బల్ల ఎక్కాల్సిందే’’ అన్నారాయన. బల్ల ఎక్కడమేమిటి? అంటే.. ‘‘పోస్టమార్టమ్ టేబుల్’ అని సమాధానమిచ్చారు ఆయన. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. జేసీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తాడిపత్రి మున్సిపాలిటీ కాస్తా టీడీపీ తేలికగా స్వాధీనం చేసుకోగలిగింది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తాజాగా ‘పోస్ట్ మార్టమ్’ మాట ఎత్తడానికి ప్రాముఖ్యత ఏర్పడుతోంది. రాయలసీమలోనే కాకుండా.. రాష్ట్రమంతా ఫ్యాక‌్షన్ రాజకీయాలు చేస్తామని చెబుతున్నట్లుగా ఉందీ మాటలు వింటే. మంత్రి లోకేశ్ ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న నేపథ్యంలో బాబు ఇలా మాట్లాడటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ను లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో అదంత తేలిక కాదు కానీ.. 74 ఏళ్ల వయసులో, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి కేవలం తన కుమారుడికి అధికారం కట్టబెట్టేందుకు ఇంత దారుణంగా మాట్లాడతారా? అన్న విమర్శలు వస్తున్నాయి.
2014లో కూడా చంద్రబాబు అధికారంలోకి రాగానే, తమ పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పారు. కానీ 2019లో జగన్ అధికారం చేపట్టిన తరువాత పార్టీలకు, కులమతాలకు అతీతంగా పాలన సాగించాలని అధికారులకు స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎలాగైతేనే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టించారు. విధ్వంసాలకు పాల్పడుతున్నారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లను దగ్దం చేయడం, హత్యలకు పాల్పడడం, వేధింపులు మొదలైన చర్యలతో రాజకీయ పాలన దుర్మార్గం మొత్తాన్ని ప్రదర్శించారు.
ఇదీ చదవండి: బాబూ.. ఇందులో ఒక్కటైనా వచ్చిందా?
అయినా చంద్రబాబుకు తృప్తి కలిగినట్లు లేదు. ఇప్పుడు ఏకంగా పోస్టుమార్టమ్ పాలన అంటున్నారు. ఎంత దారుణం! చంద్రబాబు తన పార్టీవారికి అక్రమాలకు లైసెన్స్ ఇచ్చేశారు. అందువల్లే ఇలాంటి ఘోర కృత్యాలు జరుగుతున్నట్లు ఇప్పుడు తేటతెల్లమవుతోంది. చంద్రబాబు గతంలోనూ రాయలసీమలో ఒకపక్క ఫ్యాక‌్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఇంకోపక్క వాటిని అదుపు చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తూండేవారు. ఈ సారి మాత్రం నేరుగానే సూచనలిస్తున్నారు. అందుకే టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. దీంతో ఏపీలో ప్రభుత్వ పాలన పడకేసింది. అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని అనేక మంది చెబుతున్నారు.
ఈ మద్య ఏపీకి వెళ్లి వచ్చిన తెలంగాణ సీనియర్ అధికారి ఒకరు ఆసక్తికర పరిశీలన చేశారు. 'చంద్రబాబు పాలన ఇంత వీక్ గా ఉంటుందని ఊహించలేదు. ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరింది" అని ఆయన అన్నారు. అది నిజమేనని పలు ఉదంతాలు తెలియచేస్తున్నాయి. అధికారంలోకి రాగానే వైసీపీ వారిపై దాడులు చేయడమే కాదు.. యూనివర్భిటీలపై టీడీపీ చెందిన అసాంఘిక శక్తులు దాడులు చేసి వైస్ చాన్సలర్ లను దూషించి వారితో రాజీనామాలు చేయించి కొత్త ట్రెండ్ సృష్టించారు. ఆ తర్వాత ప్రభుత్వపరంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఇసుక దోపిడీకి గేట్లు ఎత్తివేశారు. సుమారు 40 లక్షల టన్నుల ఇసుకను ఊదేశారు.
తదుపరి రాష్ట్రవ్యాప్తంగా మద్యం కొత్త పాలసీని తెచ్చి పార్టీవారే షాపులన్నీ పొందేలా చేశారు.వేరే ఎవరైనా షాపులు ఒందితే అందులో బలవంతంగా 30 శాతం వాటాను, టీడీపీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు లాక్కున్నారు. యథేచ్ఛగా బెల్ట్ షాపులు పెట్టుకునేందుకు గ్రామాల్లో వేలంపాటలు జరిగే స్థాయికి పరిస్థితి వెళ్లింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన కోడిపందాలు, గుండాట, జూదం ,బెట్టింగ్ వంటివాటిని కూడా టీడీపీ నేతలే నిర్వహించుకున్నారు. ఈ వ్యవహారంలో కొన్నిచోట్ల జనసేన, టీడీపీ బాహాబాహీకి దిగడం, కొన్ని చోట్ల ఘర్షణలు జరగడం ఇటీవలి పరిణామాలే.
మహిళలపై దాడులు, అత్యాచారాలు వంటివి విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల టీడీపీ వారే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, అరాచకాలపై టీడీపీ జాకీ మీడియాలోనే కథనాలు వచ్చాయి. వీటన్నింటిని అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రి ఒకటి అర మాటలతో వదిలిపెట్టడమే కాకుండా.. ఇప్పుడు నేరుగా ఆయనే పోస్ట్‌మార్టమ్ మాటలు మాట్లాడుతున్నారు.
ఇలా మాట్లాడితే టీడీపీ వాళ్లు పెట్రేగిపోరా? ఈ రాజకీయ పాలన ద్వారా ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలన్నది చంద్రబాబు వ్యూహం కావచ్చు కానీ.. చరిత్ర అలా ఉండదు. ఆయన చెప్పిన సిద్ధాంతాన్నే ఎదుటి పార్టీలు, ప్రత్యర్ధులు కూడా పాటించే అవకాశం ఉంటుంది. అధికారం ఉన్నా, లేకపోయినా ఇలాంటివాటిని ప్రోత్సహించకూడదు. వచ్చేసారి ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే అప్పుడు ఆ పార్టీ వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ఊహించుకోవాలి. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రెచ్చగొట్టారు కదా అని టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతే వారికే నష్టం. ఎల్లకాలం తమకు విధేయులుగా ఉంచుకోవాలనే ఫ్యూడల్ ధోరణిలో చంద్రబాబు మాట్లాడారనిపిస్తుంది. ఇది రాజకీయపాలనగా ఉండదు. రాక్షస పాలన మాత్రమే అవుతుందన్న సంగతి గుర్తిస్తే మంచిది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment