‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు..’ ఏపీలో ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్లి మరీ మహిళలు, పిల్లలందరికీ ఈ వాగ్ధానమిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లు మాట్లాడారు. యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా.. ‘‘మీకు పద్దెనిమిది వేలు’’ అని, వలంటీర్ల దగ్గరకు వెళ్లి ‘‘మీకు నెలకు పదివేలు ఖాయం’’ అంటూ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు.
వైఎస్ జగన్ విజయవంతంగా అమలు చేసిన ‘అమ్మ ఒడి’కి నకలుగా టీడీపీ ‘తల్లికి వందనం’ పేరుతో ఓ పథకాన్ని ఎన్నికల హామీగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ కుటుంబంలో తల్లికి మాత్రమే నగదు ఇచ్చేవాడని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న ప్రతీ బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికింది కూటమి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతోపాటు నిమ్మల రామానాయుడు వంటి టీడీపీ నేతలు ఈ హామీకి విస్తృతంగా ప్రచారం చేశారు.
చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని ఊదరగొట్టారు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నలుగురుంటే రూ.60 వేలు అంటూ పేద కుటుంబాలను ఊరించారు. చివరకు కూటమి అధికారంలోకి వచ్చింది కానీ.. పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రం ఎక్కాలు చెప్పుకోవడమే తప్ప, లెక్క (డబ్బు) అందలేదు. ఈ మార్చిలోగా ఇస్తారేమోలే అని పలువురి ఆశలపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇప్పుడు తల్లికి వందనం పెట్టడం లేదని తేల్చేసింది. వచ్చే జూన్‌లో చేస్తామని ప్రకటించింది. అంటే జనం అమాయకులు, పిచ్చోళ్లు, వారికి ఏమీ తెలియదు.. తాము ఏ అబద్దం చెబితే దానిని నమ్ముతారన్నది కూటమి పెద్దల విశ్వాసం. అందుకే ధైర్యంగా ఈ ప్రకటన చేశారనుకోవాలి.
తల్లికి వందనం స్కీమ్ దేని కోసం ప్రకటించారు?. పేద పిల్లలు స్కూల్ మానకుండా, విద్యను ఎంకరేజ్ చేయడం కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మ ఒడి స్కీమ్ తెచ్చారు. దీనికి ప్రజలలో విపరీతమైన ఆదరణ లభించింది. స్కూళ్లకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లను బాగా అభివృద్ది చేయడం, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తీర్చి దిద్దడం, డిజిటల్ విద్య, గోరుముద్ద తదితర కార్యక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. దాంతో ఈ స్కీమ్‌ను కాపీ కొట్టి, తామైతే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సాధారణంగా ప్రతీ ఏడాది జూన్ నెలలో ఈ మొత్తాలను తల్లుల ఖాతాలోకి వేయవలసి ఉంది.
వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్‌కు సుమారు రూ.6000 కోట్ల వ్యయం అయితే.. టీడీపీ, జనసేనలు చెప్పిన వాగ్దానం ప్రకారం సుమారు రూ.13 వేల కోట్ల వరకు వ్యయం అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు గడిచినా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయలేదు. ఏదో రకంగా ఈ పథకాన్ని ఎగవేయడమో లేక బాగా కోత పెట్టి అమలు చేయడానికో కసరత్తులు చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కాని అదీ లేదు.. ఇదీ లేదు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పినట్లు తాము పలావు పెడుతుంటే, బిర్యానీ తినిపిస్తామని చంద్రబాబు, పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు పలావు పోయే.. బిర్యానీ రాకపోయే.. అని పిల్లలు, తల్లులు ఉసూరుమంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2024 జూన్‌లోనే అమ్మ ఒడి డబ్బులు అందేవి కదా అన్నది ప్రజల భావన.
తల్లికి వందనం మాత్రమే కాదు.. మరి కొన్ని స్కీములను కూడా ఇలాగే నీరు కార్చే పనిలో ప్రభుత్వం ఉందని మంత్రివర్గ నిర్ణయాలు తెలియచేస్తున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20వేల చొప్పున ఇస్తామన్నది ఎన్నికల హామీ అయితే, ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.10 వేలకు మరో రూ.10వేలు జత చేసి ఇస్తామని చెబుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఆ ప్రకారం ఏటా అందించింది. నాలుగేళ్లు ఇస్తామని అన్నా, ఐదేళ్లు చెల్లించింది. అప్పట్లో కూడా కేంద్రం ఇచ్చిన ఆరు వేలతో కలిపి ఈ మొత్తాన్ని ఇస్తే ఇదే చంద్రబాబు, పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం కేంద్రం ఇచ్చే పది వేలతో కలిపి ఇస్తామంటున్నారు. అంటే వారు గతంలో చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకుంటే రైతులకు పది వేల రూపాయలు ఎగవేస్తున్నారన్నమాట. ఈ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని అన్నారే తప్ప స్పష్టంగా నిర్దిష్ట తేదీని చెప్పలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఈ పంటల సీజన్‌లో రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉచిత బీమా సదుపాయాన్ని కూడా ఎగవేసింది.
తల్లికి వందనం, రైతు భరోసా తర్వాతే మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పించనున్నారని కొత్త లింక్ పెడుతున్నారు. అంటే ఆ రెండు స్కీమ్‌లు ఎప్పుడు ఇస్తారో, ఈ బస్ స్కీమ్ ఎప్పటికి అమలు అవుతుందో దేవుడికే ఎరుక. కాకపోతే ఈలోగా ప్రజలను మాయ చేసే పనిలో బిల్డప్ బాబాయిలు, జాకీ మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దూసుకెళ్తోంది. జూన్‌లోగా తల్లికి వందనం అని శీర్షికను ఈనాడు పెడితే, తల్లికే తొలి వందనం అంటూ ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇచ్చింది. అంతే తప్ప ఈ ఏడాదికి ఎగనామం పెట్టారని రాయలేదు. పైగా ఈనాడు వారు ఏం బిల్డప్ ఇచ్చారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం మరో రెండు పధకాలను అమలు చేయబోతోందని నిస్సిగ్గుగా రాసింది. ఇప్పటికీ ఒక్క పెన్షన్‌లను వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలినవి ఏవీ అమలు చేయలేదని జనం గగ్గోలు పెడుతుంటే, ఈనాడు మీడియా రాతలు ఇలా ఉన్నాయి.
ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గందరగోళంలోకి నెడుతోంది. డీఎస్సీని ఆరు నెలల్లో అమలు చేస్తామని గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు తాజాగా వచ్చే జూన్‌కు డీఎస్సీ పూర్తి చేస్తామని అంటున్నారు. నిజానికి అప్పటికి కూడా అది జరగకపోవచ్చని టీడీపీ మీడియానే కథనాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ తదితర సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా శక్తి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం దాని జోలికి వెళ్లలేదు. నిరుద్యోగ భృతి అతీగతి లేదు.
ఎన్నికల మేనిఫెస్టో దగ్గర పెట్టుకుని జాకీ మీడియా ఏయే హామీలు అమలు చేసింది చెప్పగలిగితే విశ్వసనీయత వస్తుంది. అంతే తప్ప కేవలం చంద్రబాబు ప్రభుత్వాన్ని జాకీ పెట్టి లేపడం కోసం కథనాలు ఇస్తే ప్రజలకు ప్రయోజనం ఏంటి?. ఇప్పటికే జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన ఎల్లో మీడియా రోజురోజుకు అధఃపాతాళానికి పడిపోతోంది. ఆ సంగతి పక్కనబెడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తల్లికి వందనం గురించి నోరెత్తకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. దీని ద్వారా తల్లిని వారు గౌరవించినట్లా? మోసం చేసినట్లా?.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment