ఆగని అక్రమం
ఆగని అక్రమం
Published Tue, Feb 28 2017 12:10 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం వద్ద గోదావరి నదిలో ఇసుక తవ్వకూడదని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) హెచ్చరికలు జారీ చేసింది.ఇసుక తవ్వకూడని ప్రాంతాలను గుర్తిస్తూ హద్దులు నిర్ణయించింది. హద్దుల వెంబడి కర్రలు సైతం పాతించింది. అయినా.. ఇసుకాసురులు ఆగటం లేదు. చిత్తం వచ్చినట్టు చెలరేగిపోతూ పెద్దఎత్తున ఇసుకను తవ్వుకుపోతున్నారు. ఇసుక తవ్వకాల వల్ల పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రమాదం ముంచుకొస్తుందని సీడబ్ల్యూసీ స్పష్టం చేసినా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పైగా.. అక్రమార్కులకు లోపాయికారీగా సహకారం అందిస్తున్నారు. ఫలితంగా పోలవరం గ్రామంలో అక్రమ తవ్వకాలు అడ్డూఅదుపు లేకుండా సాగిపోతున్నాయి. ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల ర్యాంపు నుంచి రేయింబవళ్లు ఇసుకను ట్రాక్టర్లలో తరలించి విక్రయిస్తున్నారు. గోదావరి లంక ఒడ్డున గట్టును ఎత్తుచేసి నెక్లెస్ బండ్ నిర్మించినా.. అక్రమార్కులు ప్రత్యేకంగా బాటలు వేసుకుని ర్యాంపు ఏర్పాటు చేశారు. స్థానిక అవసరాలు, అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పగలు ట్రాక్టర్లపై తరలించి ఖాళీ ప్రదేశాల్లో డంపింగ్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో లారీల్లో ఇసుకను లోడ్‌చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. నిత్యం 150 నుంచి 200 ట్రాక్టర్ల ఇసుకను తవ్వుకుపోతున్నా కన్నెత్తి చూసిన అధికారులు లేరు. దీంతో గోదావరి నదిలో రెండు నుంచి మూడు మీటర్ల లోతున భారీ గోతులు ఏర్పడుతున్నాయి.
కర్రల్ని మార్చేస్తున్నారు
ఇసుక తవ్వకూడని ప్రదేశాల్లో సీడబ్ల్యూసీ అధికారులు మూడు రంగులు పూసిన కర్రలను ఇసుక తిన్నెలపై పాతారు. వాటిని ఇసుకాసురులు నిత్యం నది వెలుపలకు మార్చుకుంటూ దందా కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవంటూ రెవెన్యూ, పోలీసు అధికారులు ర్యాంపు మార్గంలో ఉన్న గేటుకు గతంలో తాళం వేశారు. ఆ మార్గంలో పెద్ద గొయ్యి తవ్వి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఎన్ని నిబంధనలు ఉన్నా అక్రమార్కుల దందా కొనసాగుతూనే ఉంది. చివరకు సీడబ్ల్యూసీ అధికారులు హద్దులు నిర్ణయించినా బేఖాతరు చేస్తూ ఇసుకను తోడేస్తున్నారు.
కూలీల సాయంతోనూ తవ్వకూడదు
హద్దులు దాటి ఇసుక తవ్వేస్తున్న వైనాన్ని సీడబ్ల్యూసీ ఏఈ సి.సత్యమూర్తి దృష్టికి తీసుకెళ్లగా.. ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తవ్వకూడదన్నారు. పోలవరంలోని సీడబ్ల్యూసీ కార్యాలయ స్టేషన్ గేజ్ లైన్ ప్రకారం దిగువన అర కిలోమీటరు, ఎగువన అర కిలోమీటరు భాగంలో ఎలాంటి తవ్వకాలు చేయకూ డదన్నారు. దీనివల్ల నీరు ప్రవహించే మార్గం మారిపోయే ప్రమాదం ఉందన్నారు. స్టేషన్ గేజ్‌లైన్ ఇరువైపులా మార్కింగ్ ఇస్తూ కర్రలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హద్దులు దాటి ఇసుక తవ్వితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇస్తామన్నారు.
Advertisement
Advertisement