నెల్లూరులో...టీడీపీ ఇసుకాసురులు | TDP Sand Mafia In Nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులో...టీడీపీ ఇసుకాసురులు

Published Thu, Apr 4 2019 11:46 AM | Last Updated on Thu, Apr 4 2019 11:47 AM

TDP Sand Mafia In Nellore - Sakshi

జిల్లాలో ఐదేళ్లలో ఇసుకాసురులు రెచ్చిపోయారు. అధికార పార్టీలోని కొందరు మాఫియాగా ఇసుకను కొల్లగొట్టి.. రూ.కోట్లు గడించారు. జిల్లాలో ప్రధానమైన పెన్నా, స్వర్ణముఖి, కాళంగి, కైవల్యా నదులతో పాటు నీటి పారుదల జరిగే వాగుల్లో దొరికే ఇసుక కోసం వాటిని కుళ్లబొడిచేశారు. నిబంధనలకు విరుద్ధంగా గనుల మాదిరిగా తవ్వేసి రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమంగా తరలిపోకుండా జీపీఎస్‌ విధానం అమలు పరిచినా.. నెట్‌ వర్క్‌ కనెక్ట్‌ కాకుండా ఆపేసి యథేచ్ఛగా జిల్లా సరిహద్దులు దాటించి పక్క రాష్ట్రాలకు తరలించారు. జిల్లాలో పోలీస్, విజిలెన్స్, గనుల శాఖల అధికారులు సైతం టీడీపీ నేతలు తరలించే ఇసుక రవాణాపై పూర్తిగా ఆంక్షలు ఎత్తేశారు. స్థానిక ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలకు తీసుకెళ్లే ట్రాక్టర్లను మాత్రం అడ్డుకుని కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. స్థానిక అవసరాలకు రవాణా చేసే వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై నిఘా పెట్టి కోర్టుల చుట్టూ తిప్పిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.  

నెల్లూరు(సెంట్రల్‌): జిల్లాలో అధికార పార్టీ నేతలకు ఇసుక రవాణా పెట్టుబడి లేదని వ్యాపారంగా మారింది. ఆయా ప్రాంతాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఇసుక వ్యాపారానికి తెరలేపారు. ఇసుక ఉచితంగా ప్రకటించిన తర్వాత టీడీపీ నేతలు దాన్ని ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. దీంతో జిల్లాలో ఇసుక వ్యాపారం మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలుగా కొనసాగుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. పెన్నా, స్వర్ణముఖి, కాళంగి, కైవల్యా నదుల్లోని ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించి, రూ.కోట్లు గడిస్తున్నారు. నదుల్లో ఇసుకను తరలించేందుకు ఉన్న అనుమతులు పక్కన పెట్టి ఉచితం మార్గదర్శకాలకు భిన్నంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఎవరైనా తమ ఇళ్ల కట్టడాలకు ఉచితంగా తీసుకుందామని వెళ్తే వారిని బెదిరించి తమ వాటా ఇచ్చిన తర్వాతే తీసుకుని వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారికంగా 28.. అనధికారికంగా మరో 20
జిల్లాలో మొత్తం 28 ఇసుక రీచ్‌లు అధికారికంగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా స్వర్ణముఖి, పెన్నానది, కాళంగి, కైవల్యా నదులతో పాటు ఆయా పరివాహక ప్రాంతాల్లో ఈ రీచ్‌లు ఉన్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేట, సోమశిల, అప్పారావుపాళెం, పడమట కంభంపాడు, దవ్వూరు, కుట్టుపల్లి, పొట్టెంపాడు రీచ్‌లో భారీగా ఇసుక విక్రయాలు జరుగుతుంటాయి. వీటితో పాటు జొన్నవాడ, ముదివర్తి, వేగూరు, ఇందుకూరుపేట ప్రాంతాల్లో ఎక్కువగా  అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతోంది. పొదలకూరు ప్రాంతంలో ఉన్న రీచ్‌లో జిల్లాలోని ఒక మంత్రి అనుచరులు ఎక్కువగా ఈ ప్రాంతంలో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్‌లోని పొట్టేపాళెం వద్ద కూడా అధికార పార్టీ నేతల పెత్తనం ఎక్కువగా ఉంది.

అమలు కాని జీపీఎస్‌ విధానం
జిల్లా నుంచి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారని స్వయంగా పోలీసు, రెవెన్యూ, సంబంధిత మైనింగ్‌ అధికారులు చెబుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఇసుక తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్‌ ఏర్పాటు చేయాలని నిబంధన పెట్టారు. దీంతో జిల్లాలో ఇసుక తరలించే ట్రాక్టర్లకు దాదాపుగా 2 వేలకు వరకు జీపీఎస్‌ పరికరాలను ఏర్పాటు చేసినా, కనెక్ట్‌ కాకుండా ఆపేసి రవాణా చేయడం గమనార్హం. జీపీఎస్‌ విధానం అమలు చేయాలని ఆదేశాలు వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లతో ఆ విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఏ స్థాయిలో జిల్లాలో ఇసుక అక్రమ రవాణా సరిహద్దులు దాటుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
చెప్పిందే రేటు 
అధికారికంగా ఇళ్ల నిర్మాణాలకు కొనుగోలు చేసుకోవాలంటే  ట్రాక్టర్‌ ఇసుక రూ.1100 లోపు తీసుకోవాలని ప్రభుత్వం ధర నిర్ణయించింది. కాని ఇళ్ల నిర్మాణాలకు రూ.2 వేల వరకు తీసుకుంటూ, వాణిజ్య అవసరాలకు డిమాండ్‌ను బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రీచ్‌లను తమ కనుసన్నల్లో నడిపిస్తున్న టీడీపీ నేతలు అధికంగా వసూలు చేస్తుండడంతో ట్రాక్టర్‌ యజమానులు కూడా వినియోగదారుల వద్ద అధికంగా తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తుంది.
ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ 
జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గంలోని స్వర్ణముఖి నది నుంచి తమిళనాడుకు, పక్కనే ఉన్న చిత్తూరు జిల్లాకు తరలిపోతుంది. ఆత్మకూరు నియోజక వర్గంలోని రీచ్‌ల నుంచి ఎక్కువగా వైఎస్సార్‌ జిల్లాకు తరలిపోతుంది. ఇక పోతే నెల్లూరు, కోవూరు నియోజకవర్గం పరిదిలోని ఇసుక రీచ్‌ల నుంచి జిల్లా అవసరాలతో పాటు డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేసుకుని జాతీయ రహదారిపై ఎక్కువగా తమిళనాడుకు పోతుంది. దీంతో లారీ ఇసుక రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పైగా ప్రాంతాలను బట్టి వసూలు చేస్తుండడం గమనార్హం. ఇతర రాష్ట్రాలకైతే మూడింతలు, నాలుగింతలు పెరుగుతుంది.  

తెలుగు తమ్ముళ్లే మాఫియాగా

సూళ్లూరుపేట: సూళ్లూరుపేట నియోజకవర్గంలో  నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లోని టీడీపీ నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి రూ. కోట్లు గడించారు.  నాయుడుపేట ప్రాంతంలో స్వర్ణముఖి, మామిడికాలువ, సూళ్లూరుపేట ప్రాంతంలో కాళంగినది, పాముల కాలువ, కరిపేటి కాలువల్లో ఇసుకను స్థానికులకు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా తరలించి సొమ్ము  చేసుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పరసా వెంకటరత్నయ్య, మరో టీడీపీ నేత నెలవల సుబ్రహ్మణ్యం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.  బెంగుళూరు, చెన్నై నగరాల్లో ఇసుకకు గిరాకీ బాగా ఉండడంతో రాత్రి వేళల్లో పెద్ద సంఖ్యలో లారీలతో ఇసుకను తరలిస్తున్నారు.

అన్నమేడు, మర్లపల్లిలో రాత్రి వేళ 100 మంది కూలీలతో 50 లారీలకు పైగా ఇసుకను నింపి చెన్నైకు తరలించేవారు. తుమ్మూరు, స్వర్ణముఖి నదిలోని శివాలయం సెంటర్, బీడీ కాలనీ, పెళ్లకూరు మండల పరిధిలోని తాళ్వాయిపాడు, చావాలి, కలవకూరు, ముమ్మారెడ్డిగుంట, ప్రాంతాల నుంచి శ్రీకాళహస్తి మీదుగా వందల లారీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవి. అధికారులు నామమాత్రపు దాడులు, మామూళ్లతో టీడీపీ ఇసుక మాఫియా రెచ్చిపోయింది.   తడ, సూళ్లూరుపేట మండలాలకు ట్రాక్టర్లలో తరలించి అక్కడి నుంచి చెన్నైకు తరలించేవారు. ఓజిలి మండలంలో మామిడికాలువ, పున్నేపల్లి, కొత్తపేట ప్రాంతాల్లో నది నుండి ఇసుకను తరలించి ఓజిలి మండలానికి చెందిన టీడీపీ నేతలు  ఇసుక స్మగ్లింగ్‌ దర్జాగా సాగిపోయేది. తన వర్గీయులు ఇసుక మాఫియాతో కోట్లు గడిస్తుండడం చూసి టీడీపీలోని మరో వర్గం తన అనుచరులతో ఎదురు దాడికి దిగడంతో మాఫియాకు అడ్డుకట్ట వేయగలిగారు. ఇదిలా ఉండగా టీడీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న నెలవల సుబ్రహ్మణ్యం అనుచరులు కూడా ఇసుకను తరలించినట్లు ఆరోపణలు బాహాటంగానే వినిపించాయి.   


పచ్చ మాఫియా

గూడూరు: నిర్మాణాలకు ఇసుక ఉచితమనేది ప్రకటనలకు మాత్రమే.. కానీ పచ్చ మాఫియా నేతలకు అది కాసులు కురిపిస్తోంది. రాత్రనకా పగలనకా, ఇబ్బడిముబ్బడిగా ట్రాక్టర్లతో ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్‌ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుడు మాత్రం ఇసుకను తన సొంత ఇంటి నిర్మాణం కోసం తీసుకెళ్లాలంటే సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. గూడూరు నియోజక వర్గంలో వాకాడు, కోట, గూడూరు, చిట్టమూరు మండల ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. అయితే ఆయా మండలాల్లో గృహ నిర్మాణాలు చేపడుతున్న సామాన్య, మధ్య తరగతి పేద ప్రజలకు వివిధ రకాల అనుమతులు, ఆంక్షలు విధించిన అధికారులు, టీడీపీ నేతలకు మాత్రం ఏ విధమైన అనుమతులు లేకుండానే ఉచితంగా ఇసుకును తరలించుకునేందుకు దోహదపడుతున్నారు.

పోలీసులు, అధికారులు సొంత అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకెళ్తే మాత్రం దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తోన్నారు. దీంతో సామాన్య ప్రజలకు ఇసుక అందని ద్రాక్షలా మారింది.  వాకాడు మండలం కాశీపురంలో ఉన్న ఇసుక రీచ్‌ను అక్కడ గ్రామస్తులు అడ్డుకుని రీచ్‌ను మూసి వేశారు. కోట మండలంలోని పుచ్చలపల్లి వద్ద ఉన్న స్వర్ణముఖి రీచ్‌లో ఇసుక దోపిడీ జరుగుతోంది. స్థానికంగా ఉన్న వారు  ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక కోసం వెళ్తే సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. చిల్లకూరు మండలంలోని పరిశ్రమలకు ఇక్కడ నుంచి ఇసుకను తరలిస్తూ కొందరు టీడీపీ నాయకులు రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయి.  

కైవల్యా.. కుళ్లబొడిచారు

సైదాపురం: మండల పరిధిలోని కైవల్యా నదిని ఇసుక కోసం టీడీపీ నేతలు కుళ్లబొడిచేశారు.  అక్రమంగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇతర ప్రాంతాలకు ఇసుకను బహిరంగంగానే తరలిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి.  మండలంలోని గంగదేవిపల్లి, అనంతమడుగు, సైదాపురం, రామసాగరం, పాలూరు రాజుపాళెం కేంద్రంగా మారింది. ఈ గ్రామాల్లో  సమీపంలో కైవల్యా నది ఉండడంతో నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు ఇసుకను బహిరంగంగానే తరలిస్తున్నారు. ఉచిత ఇసుక విధానం ఉన్న సరిగా అమలు చేయకపోవడంతో వేల రూపాయలతో ఇసుకను అమ్ముకుంటున్నారు. ట్రాక్టర్‌ ఇసుక ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రూ.2,500 నుంచి రూ.3 వేలకు ధర పలుకుతుంది. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండానే కైవల్యా  నుంచి ఇతర ప్రాంతాలకు  విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్న సంబంధిత అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం. 

నధికారిక ఇసుక ర్యాంప్‌

నెల్లూరురూరల్‌: నెల్లూరు రూరల్‌ పరిధి లోని పెన్నానదిలో టీడీపీ నేతలు ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగిస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పెన్నానది నుంచి ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలి వెళుతుంది. 2014 ఎన్నికలకు ముందు నెల్లూరురూరల్‌ పరిధిలో పొట్టేపాళెం,  కోడూరుపాడు, నవలాకులతోట, ములుమూడి, సజ్జాపురం, గొల్లకందుకూరు ప్రాంతాల్లో పెన్నానది వద్ద ఇసుక రీచ్‌లు ఉండేవి. టీడీపీ అ«ధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేపాళెం రీచ్‌ మినహా మిగతా అన్ని రీచ్‌లను రద్దు చేసింది. ఇసుక ఉచితం కావడంతో పొట్టేపాళెం రీచ్‌ నుంచి ప్రతినిత్యం 300 నుంచి 400 ట్రాక్టర్లలో ఇసుక నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలకు రేయింబవళ్లు ఇసుక రవాణా సాగిస్తున్నారు.  నెల్లూరు రూరల్‌ పరిధిలోని కోడూరుపాడు, ములుమూడి, సజ్జాపురం, గొల్లకందుకూరు ప్రాంతాల్లో అనధికారికంగా ఇసుక ర్యాంప్‌ లు ఏర్పాటయ్యాయి. గతంలో రద్దు చేసిన రీచ్‌లనే అధికార పార్టీ నాయకులు ర్యాంప్‌లుగా నిర్వహిస్తున్నారు. ర్యాంప్‌ల వద్ద ట్రాక్టర్ల నిర్వాహకుల నుంచి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇసుక డంపింగ్‌లు రూరల్‌ ప్రాంతంలోని పలు చోట్ల ఇసుక డంపింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా పొట్టేపాళెం రీచ్‌ సమీపంలో ఇసుక డంపింగ్‌ కేంద్రాలు అధికంగా ఉన్నాయి. పెన్నానదిలో నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపింగ్‌ కేంద్రాలకు చేర్చి అక్కడ నుంచి లారీలు, టిప్పర్ల ద్వారా జిల్లాలోని దూర ప్రాంతాలకే కాకుండా తమిళనాడుకు ఇసుకను తరలిస్తున్నారు. నిబంధనలను అమలు చేయాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది ప్రేక్షక పాత్ర వహిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement