సంక్షోభంలో వరి సాగు
సంక్షోభంలో వరి సాగు
Published Sun, Aug 21 2016 6:44 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
* కృష్ణా పశ్చిమడెల్టాలో దుర్భిక్ష పరిస్థితులు
* కనీవినీ ఎరుగని నీటికొరత
* వర్షాభావం కొంత...
పుష్కర తాపత్రయం మరికొంత
* 5.71 లక్షల ఎకరాల ఆయకట్టుకు లక్ష ఎకరాల్లోనే సాగు
* సాగునీటి కొరతతో ఎండుతున్న ‘వెద’జల్లిన వరి
కృష్ణా పశ్చిమ డెల్టాలో వరిసాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఖరీఫ్ ఆరంభంలోనే సాగునీటి కొరతతో సాగుకు ఆదిలోనే అవాంతరం ఎదురైంది. వర్షాభావం ఒకపక్క, ప్రభుత్వ పెద్దల పుష్కరాల తాపత్రయం మరికొంత నీటి సమస్యను జటిలం చేసింది. వెదజల్లిన చేలల్లో నీరు లేక పంట దెబ్బతింటోంది. నాట్లు వేసుకుందామని పోసిన నారుమళ్లు జీవం కోల్పోతున్నాయి. నీటితడులకోసం రైతాంగం నానా అవస్థలు పడుతోంది. అరకొర నీటినే ఆయిల్ ఇంజిన్లతో తోడుతూ పంటచేలకు మళ్లిస్తూ సాగు సమరం చేస్తున్నారు.
తెనాలి/ కొల్లిపర: పశ్చిమడెల్టాలో గత ఖరీఫ్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనిపించటం లేదు. అధిక వర్షాలు కురుస్తాయన్న అంచనాలనే నమ్ముకొన్నట్టు ఆచరణలో కనిపిస్తోంది. తీరాచూస్తే గత సీజను ఆరంభంనాటి పరిస్థితులే ప్రస్తుత ఖరీఫ్‌లోనూ ఎదురవటం రైతుల దురదృష్టం. జూలై 6 నుంచి పట్టిసీమ నీటిని విడుదల చేస్తున్నాం... 10వ తేదీ నుంచి నారుమళ్లు పోసుకోవచ్చని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని నమ్మిన రైతులు నిండా మునిగారు. ఆగస్టు మూడోవారం పూర్తికావస్తున్నా పంటకాలువలకు నీటి విడుదల కంటితుడుపుగానే కొనసాగింది. దామాషా ప్రకారం నీరివ్వకుండా సంబంధిత మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుడెల్టాకు పెద్దపీట వేశారు. పశ్చిమడెల్టాను నిర్లక్ష్యం చేశారు.
కేవలం లక్ష ఎకరాల్లోనే సాగు...
ఫలితంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిగా గల పశ్చిమ డెల్టాలో 5.71 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను కేవలం ఆగస్టు 16వ తేదీ వరకు లక్ష ఎకరాల్లో పంట వేయగలిగారు. ఇందులో నారుమళ్లతో పనిలేకుండా నేరుగా విత్తనాలు వెదజల్లిన విస్తీర్ణం 95 వేల ఎకరాలు. నాట్లు వేయగలిగింది కేవలం 5 వేల ఎకరాలేనంటే ఆశ్చర్యపోనవసరం లేదు. 10 వేల ఎకరాలకు సరిపడ నారుమళ్లు పెరుగుతున్నాయి. ఈ విస్తీర్ణం మొత్తం గుంటూరు జిల్లా పరిధిలోనే సుమా! పశ్చిమడెల్టా పరిధిలో ప్రకాశం జిల్లాలోని దాదాపు 70 వేల ఎకరాల ఆయకట్టు రైతులు, నీటికొరత కారణంగా సాగుకు సమాయత్తమయే పరిస్థితి కనిపించటం లేదు.
సాగునీటి అవసరాలు పట్టించుకోని ప్రభుత్వం...
ఇలా వరిసాగు వివిధ దశల్లో వున్న మాగాణి భూములకు నీటి కొరత తీవ్రంగా వుంది. పుష్కరాల కోసమని ప్రకాశం బ్యారేజి వద్ద 11 అడుగులపైగా నీటిమట్టం వుండేలా చూసుకున్న ప్రభుత్వం, రైతుల సాగునీటి అవసరాలను పట్టించుకోలేదు. ఫలితంగా గత నెలరోజుల్లో పంటకాలువలకు కనీస నీటి సరఫరా ఇవ్వలే కపోయారు. అందులోనూ ఇరిగేషన్ మంత్రి కారణంగా పశ్చిమ డెల్టాపై వివక్ష చూపారని రైతాంగం ఆరోపిస్తోంది. ప్రస్తుత సీజనులో తూర్పుడెల్టాకు 8.6 టీఎంసీల నీరివ్వగా పశ్చిమడెల్టాకు 4 టీఎంసీలనే ఇచ్చారు. ఆ నీటిని ఆయకట్టు ప్రకారం ఇవ్వాల్సివుండగా, తెలుగుదేశం నేతల పలుకుబడితో కొన్ని కాలువలకు ఎక్కువ సరఫరా ఇస్తూ వస్తున్నారు.
ఆయిల్ ఇంజిన్లతో నీటి సరఫరా....
ఆగస్టు నెలలో 20 రోజులుగా వర్షాలు జాడ లేకపోవడంతో 18 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పాటు పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం, పడమర గాలి వీస్తుండటంతో వరి పొలాలకు నీరు సరిపోవడం లేదు. బెట్టకు రాకుండా వరికి నీటితడుల కోసం రైతులు శ్రమించాల్సివస్తోంది. బోర్లు అందుబాటులో ఉన్న పొలాలకు ఆయిల్ ఇంజిన్లతో నీరు పెడుతున్నారు. ఇందుకోసం ఎకరాకు రూ.2000 వరకు ఖర్చవుతోందని సిరిపురం గ్రామానికి చెందిన రైతు పోపూరి సుబ్బారావు చెప్పారు. వేమూరు నియోజకవర్గంలో టీఎస్ ఛానల్‌పై 2వ బ్రాంచిపై ఏడు ఆయిల్ ఇంజిన్లు, 3వ నంబరు బ్రాంచిపై పది అయిల్ ఇంజిన్లతో రైతులు నిరంతరం నీటిని తోడుతున్నారు. బ్రాంచి కాలువల్లోకి వచ్చిన నీటిని మళ్లీ చేలల్లోకి తీసుకెళ్లేందుకు అక్కడా అయిల్ ఇంజిన్లే శరణ్యం. ఒక్కో ఎకరాకు ఎలా లేదన్నా రూ.5–6 వేలు నీటి తడులకే వ్యయం చేస్తున్నారు. మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల పరిధిలోని హైలెవెల్ ఛానల్‌లోనూ ఇదే పరిస్థితి. ఇంతగా కష్టపడుతున్నా వెదజల్లిన చేలల్లో వరి ఎండిపోతోంది.
మొక్కలు చనిపోతున్నాయి..
20 రోజుల కిందట వెద పద్ధతిలో వరి సాగు చేశాను. నీళ్లు అందకపోవడంతో పైరు ఎండిపోతుంది. బోర్ల ద్వారా ఉప్పునీరు రావడంతో పైరు వెంటనే ఎండిపోతుంది. కాల్వల ద్వారా కొంత నీరు వచ్చిన పొలంలోకి ఎక్కడం లేదు. పంట కాల్వలపైన ఉన్న రైతులకు మాత్రమే నీరు సరిపోతుంది. దిగువున్న ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు.
– వినుకొండ సుబ్బయ్య, రైతు, అత్తోట
Advertisement
Advertisement