ఓరి దేవుడా..! | Cultivated land endowment Department saying not | Sakshi
Sakshi News home page

ఓరి దేవుడా..!

Published Tue, Jul 7 2015 3:37 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

ఓరి దేవుడా..! - Sakshi

ఓరి దేవుడా..!

ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న భూములనే కాదంటున్న దేవాదాయ శాఖ
కోరుతాడిపర్రులోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ భూములంటూ కౌలు హక్కులకు వేలం
అమృతలూరు మండలంలో ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నం.. మరో రైతుకు అస్వస్థత

 
కోరుతాడిపర్రుకు చెందిన రైతు దూపాటి శివనాగేశ్వరరావు...పెద్దలు ఏనాడో కొని తనకు సంక్రమించిన 1.30 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నారు. దాంతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొన్నాడు. కుటుంబమంతా రెక్కల కష్టంచేసుకుంటూ ఏదోలా జీవనం సాగిస్తున్నారు. అక్కడకు దగ్గర్లోని ఆలపాడు రైతు వీర్ణపు సత్తెయ్య పాతికేళ్ల క్రితం కొంత భూమిని కొనుక్కున్నాడు. ఇలాంటి 70 మంది రైతులకు మూడేళ్లుగా కంటిమీద నిద్ర కరవైందంటే అతిశయోక్తి కాదు. అయినా రైతులపక్షాన ఆలోచించకుండా అధికారులు ముందుకు సాగటం వారిని వేదనకు గురిచేసింది. ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నానికి దారితీసింది.
 
తెనాలి: అమృతలూరు మండలం కోరుతాడిపర్రు, వామనగుంటపాలెం, ఆలపాడు గ్రామాలకు చెందిన వీరంతా 47 ఎకరాల భూమిని ఎప్పటి నుంచో సాగుచేసుకుంటున్నారు. సమీప గ్రామస్తుల నుంచి, బంధువుల నుంచి భూమిని కొనుగోలు చేసినవారే అధికం. కొంతకాలం క్రితం దేవాదాయశాఖ అధికారులు ఆ భూమిని కోరుతాడిపర్రులోని శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయానికి సంబంధించినదని ప్రకటించటం ఆ రైతు కుటుంబాల్లో కల్లోలాన్ని రేపింది.

అంతేకాకుండా భూమిపై కౌలు హక్కులకు సంబంధించి వేలం కూడా వేశారు. ఎకరాకు రూ.3000 కౌలు చొప్పన వేలం పూర్తిచేశారు. ఆ భూమి స్వాధీనంలో ఉన్న రైతుల అభ్యంతరాలను పట్టించుకోలేదంటారు. దీనిపై ల్యాండ్ రెవెన్యూ కమిషనరు వరకు వివాదం నడిచింది. కోర్టులోనూ వ్యాజ్యం వేసినట్టు చెబుతున్నారు. ఈలోగా స్వాధీనంలో ఉన్న రైతులే పంటలు వేశారు. తీరా కోత సమయం వచ్చేసరికి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ వేలం హక్కులు దక్కించుకున్న రైతులు పంట కోసుకున్నారు.

మళ్లీ ఇప్పుడు వేలం నిర్వహించటంతో ఆ భూములకు శాశ్వతంగా నీళ్లొదులు కోవాల్సి వస్తుందన్న భయాందోళనలతోనే శివనాగేశ్వరరావు, సత్తెయ్యతోపాటు నక్కా ఏడుకొండలు, గొడవర్తి నాగేశ్వరరావు, తాళ్లూరి బోసుబాబు, రెడ్డి వెంకటసుబ్బమ్మ సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మరో రైతు అస్వస్థతకు లోనయ్యాడు. వీరంతా ఇప్పుడు తెనాలి, గుంటూరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
ముందురోజే బెదిరించారు...
పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న భూమిని ఇప్పుడు కాదుపొమ్మంటే ఏం చేయాలని దూపాటి శివనాగేశ్వరరావు కుటుంబ సభ్యులు తెనాలి ఆస్పత్రిలో కన్నీరుమున్నీరయ్యారు. వేలం నిలుపుదల చేయాలని కోరితే ఖాతరు చేయలేదన్నారు. ‘ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ నుంచి ఆ భూమిపై స్టేటస్‌కో ఉందనీ..అయినా వినకుండా వేలం వేశారు. వేలం ఛాయలకు వస్తే అరెస్టు చేస్తాం అని సీఐ మమ్మల్ని ముందురోజే బెదిరించారు’ అని చిలకపాటి మధుసూదనరావు చెప్పారు.

తక్కువ ధరకు భూములు కౌలుకు వస్తాయనీ, భవిష్యత్‌లో సొంతం చేసుకోవచ్చని మభ్యపెట్టి వేలంకు దింపారనీ, రైతుల మధ్య చిచ్చుపెట్టారని ఆరోపించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినపుడు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చాం...అందులో ఇవి ఏస్టేట్ భూములు’ అని స్పష్టంగా ఉందని వామనగుంటపాలెం సర్పంచ్ కోగంటి తరుణ్‌కుమార్ చెప్పారు. అసలయినా వివాదంలో ఉన్న భూమికి వేలం ఎలా నిర్వహిస్తారని సీపీఎం డివిజన్ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి ప్రశ్నించారు. బడుగు జీవుల భూమిని లాక్కుని పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే ఇదని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరికల కాంతారావు ఆరోపించారు. ఇలా విషణ్ణ వదనాలతో ఉన్న రైతుల కుటుంబసభ్యులను పరామర్శించిన రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు అధికారుల వైఖరిని ఖండించారు.
 
వేలం దగ్గర ఏం జరగలేదు...
కోరుతాడిపర్రు ఆలయంలో జరిగిన భూముల వేలం ప్రశాంతంగా జరిగిందనీ, అక్కడ రైతులెవరూ ఆత్యహత్యాయత్నం ప్రయత్నం చేయలేదనీ మా అధికారులు చెప్పారు. ఛానళ్లలో వస్తున్న వార్తలను చూసి వాకబు చేస్తే ఆ విధంగా చెప్పారు.
- సురేష్, దేవాదాయశాఖ
డిప్యూటీ కమిషనర్
 
అధికారుల కారణంగానే..   రైతుల ఆత్మహత్యాయత్నం  

వేమూరు: కొన్నేళ్ల నుంచి సాగు చేసుకొని బతుకుతున్న రైతులపై ఎండోమెంట్ అధికారులు, పోలీసులు ఓవరాక్షన్ చేసినందునే రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించారనీ, బాధ్యులైన ఆధికారులపై చర్యలు తీసుకుంటామని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు స్పష్టం చేశారు. అమృతలూరు మండలంలోని కోరుతాడిపర్రులోని 47 ఎకరాల భూమిని దేవాదాయ భూమి పేరుతో అధికారులు వేలం వేయటంతో ఆ భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఆరుగురు సోమవారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు.

తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వీరిని ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు పరామర్శించారు. వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, రైతులు 50 సంవత్సరాలు నుంచి సాగు చేసుకుంటున్న భూములకు ఎండోమెంట్ ఆధికారులు, పోలీసు యంత్రాంగం వేలం పెట్టటంతో రైతులు ఆత్మహత్యకు పూనుకున్నట్టు చెప్పారు. దీనికి ఎండోమెంట్ ఆధికారులు బాధ్యత  వహించాలని ఆయన డిమాండ్ చేశారు.ఎండోమెంట్ అధికారులకు తమ భూములు ఎక్కడ ఉన్న సంగతి ఈ రోజు వరకు పూర్తిగా తెలియదు. చిన్న సన్న కారులు రైతులు సాగు చేస్తుంటే అవి మాత్రం అధికారులకు కన్పిస్తాయని అన్నారు.  రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీరితో జడ్పీటీసీ చందోలు పృధ్వీలత, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement