సాక్షి, న్యూఢిల్లీ: నోయిడా, గ్రేటర్ నోయిడా వంటి పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలను తనలో కలుపుకున్న గౌతమ్ బుద్ధ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేది రైతులే. బహుముఖ పోటీ నెలకొన్న ఈ నియోజకవర్గం ఓటర్లలో 70-80 శాతం రైతులు, గ్రామీణులు కావడమే ఇందుకు కారణం.
ప్రభుత్వం స్వాధీనపరుచుకున్న భూములకు రైతులు అధిక నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తుండడంతో.. ఇదే ఈ నియోజకవర్గం ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా మారింది. నష్టపరిహారాన్ని ఆరు రెట్లు పెంచాలని, కొత్తగా సేకరించే భూమి కోసం కొత్త విధానాన్ని రూపొందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నోయిడా, గ్రేటర్ నోయిడాలు ఆధునిక హంగులను సమకూర్చుకున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని వారు అంటున్నారు. రైతుల మద్దతుపైనే తమ విజయం ఆధారపడి ఉందని గుర్తించిన ప్రధాన రాజకీయ పార్టీలు రైతుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఉద్దేశమని అంటున్నాయి.
అయితే రాజకీయ పార్టీలు ఇస్తోన్న ఈ హామీకి ఏమాత్రం పొంతనలేని రీతిలో నోయిడా, గ్రేటర్ నోయిడా వాసుల సమస్యలు ఉన్నాయి. అపార్ట్‌మెంట్లు, సువిశాలమైన రోడ్లు, మాల్స్, ఎఫ్1 సర్క్యూట్ వంటి అంతర్జాతీయ హంగులున్న ఈ ప్రాంతంలో విద్యుత్తు కొరత ప్రధాన సమస్యగా ఉంది.
అభ్యర్థులు వీరే...
మొత్తం 17.34 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో వృత్తి రీత్యా వైద్యుడైన డాక్టర్ మేహ ష్ శర్మకు బీజేపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ రమేష్ చంద్ర తోమర్‌ను, సమాజ్‌వాదీ పార్టీ నరేంద్రసింగ్ భాటీని భట్‌ను నిలబెట్టాయి. ఈ ముగ్గురు అభ్యర్థులు 2009 ఎన్నికల్లో బీఎస్పీకి చెందిన సురేంద్ర సింగ్ నాగర్ చేతిలో ఓడిపోయారు. ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ గుజ్జర్ సామాజికవర్గానికి చెందిన సతీష్ అవానాను అభ్యర్థిగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నోయిడాకు చెందిన వ్యాపారవేత్త కేపీ సింగ్‌ను నిలబెట్టింది.
గౌతమ్‌బుద్ధ్‌నగర్ ఎన్నికల చిత్రం కర్షకులే నిర్ణేతలు..!
Published Wed, Mar 26 2014 10:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement