Endowment Department officials
-
సింహాచలం భూముల అక్రమాలపై ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
సాక్షి, విశాఖపట్నం : సింహాచలం భూముల అక్రమాలకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్, ఏఈవో సుజాతను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, దేవాలయ ఆస్తుల రిజిష్టర్ నుంచి భూముల తొలగింపులో.. ఏసీ రామచంద్రమోహన్, ఏఈవో సుజాతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
కాలేజీ పేరుతో కాజేశారు
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీ ముసుగులో టీడీపీ పెద్దలు వందల ఎకరాల మాన్సాస్ భూములను అమ్మేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కనీసం దరఖాస్తు కూడా చేయకపోగా ఆ పేరుతో విశాఖ నగరానికి సమీపంలో మాన్సాస్ ట్రస్టు పేరిట ఉన్న 150.09 ఎకరాలను, మరో 1,430 చదరపు గజాల వాణిజ్య భూమి కారుచౌకగా తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేయడం గమనార్హం. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ‘ముఖ్య’నేత ఈ భారీ మాయకు తెరతీస్తే మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజు తన వంతు సహాయ సహకారాలను అందజేశారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మాన్సాన్ ట్రస్టులలో చోటు చేసుకున్న అక్రమాలపై దేవదాయ శాఖ ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రాథమిక విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందచేయడం తెలిసిందే. విజయనగరంలో మెడికల్ కాలేజీ పేరుతో మాన్సాస్ ట్రస్టు భూముల విక్రయాల్లో జరిగిన అక్రమాలను నివేదికలో పేర్కొన్నారు. మన భూమి అయితే ఇలాగే అమ్ముతామా..? భూమిని అమ్ముకుంటే ఎవరైనా సరే పూర్తి విస్తీర్ణం మేరకు లెక్కగట్టి డబ్బులు తీసుకుంటారు. ఆ స్థలంలో రోడ్లు వేసేందుకు కొంత భూమి కేటాయించాల్సి వస్తే అంతమేరకు తగ్గించుకుని డబ్బులు తీసుకుంటారా? ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఇళ్ల ప్లాట్ల ధరకు తగట్టుగానే భూమి ధరను నిర్ణయించి విక్రయిస్తారు. కానీ మాన్సాన్ భూములు అమ్మిన తీరు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మకమానవు. మెడికల్ కాలేజీ పేరుతో గత సర్కారు మాన్సాన్ భూములను నాలుగు ప్రాంతాల్లో విక్రయించింది. అందులో ఒకటి విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలసలో భూముల అమ్మకం. అక్కడ ట్రస్టు పేరిట ఉన్న భూముల్లో 53.40 ఎకరాల అమ్మకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 43.40 ఎకరాల విక్రయానికి తెరతీశారు. రోడ్లు వేయాలంటూ.. కొత్త వలసలో 43.40 ఎకరాల అమ్మకమన్నారు. అయితే కొనుగోలుదారులు అంతర్గతంగా 80 అడుగుల రోడ్లు ఏర్పాటు చేసుకుంటే 2.98 ఎకరాల భూమి వృధా అవుతుందంటూ దాన్ని విక్రయించే భూమి నుంచి ముందే మినహాయించారు. ఇక ఇళ్ల ప్లాట్లకు అనువుగా లేదంటూ మరో 4.31 ఎకరాలను మినహాయించారు. ఇలా మొత్తం 7.29 ఎకరాలను మినహాయించి మిగిలిన 36.11 ఎకరాలకు మాత్రమే కొనుగోలుదారుడి నుంచి డబ్బులు తీసుకున్నారు. 10.98 ఎకరాలు ఉచితంగా... ఇదొక ఎత్తు కాగా ఈ భూములను అమ్మిన తర్వాత ట్రస్టుకు అక్కడ మరో పది ఎకరాల స్థలం ఉండాలి. అయితే ఇప్పుడు 6.31 ఎకరాలే మిగిలినట్లు అధికారుల కమిటీ నిర్ధారించింది. అంటే అక్కడ మరో 3.69 ఎకరాలు ఈ అమ్మకం లావాదేవీల తర్వాత కనిపించకుండా పోయింది. అంటే మొత్తంగా ట్రస్టుకు చెందిన 10.98 ఎకరాల భూమికి ఎటువంటి ప్రయోజనం పొందకుండా కొన్నవారికి ధారాధత్తం చేశారు. 36.11 ఎకరాల్లో రూ.74 కోట్లు దోపిడీ.. మాన్సాన్ ట్రస్టు భూములను అమ్మిన కొత్తవలసలో రిజిస్ట్రేషన్ ధర ఎకరం రూ.89 లక్షలు ఉంది. అయితే ఆ భూమిని అమ్మే సమయంలో అక్కడ మార్కెట్ ధర ఎకరం రూ.2.51 కోట్లు ఉన్నట్లు దేవదాయ శాఖ అధికారులు నిర్ధారించారు. కానీ మార్కెట్ ధర కంటే సగం ధరకే ఎకరం రూ.1,20,70,000 చొప్పున విక్రయించారు. ఒకవైపు 10.98 ఎకరాల భూమిని కోల్పోతూ మరోవైపు మార్కెట్ కంటే సగం ధర తక్కువకు అమ్మేశారు. మెడికల్ కాలేజీ అంటూ మభ్యపెట్టి గత సర్కారు 150.09 ఎకరాల మాన్సాన్ ట్రస్టు భూములను అమ్మగా అందులో 36.11 ఎకరాల భూముల విక్రయంతో ట్రస్టుకు వచ్చింది రూ.43.58 కోట్లు అయితే నష్టపోయింది రూ.74.22 కోట్లకుపైనే ఉంటుందని దేవదాయ శాఖ అధికారుల కమిటీ నిర్ధారించింది. మొత్తం 150.09 ఎకరాల అమ్మకాల తీరును విశ్లేషిస్తే ఈ దోపీడీ రూ.250 కోట్లకు పైబడి ఉండవచ్చని తాజాగా భావిస్తున్నారు. సింగిల్ బిడ్ టెండర్లతోనే అమ్మకం.. కొత్తవలస భూముల కొనుగోళ్లలో కేవలం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మాత్రమే పాల్గొంది. భూములు అమ్మే సమయంలో ఏమాత్రం పారదర్శకంగా వ్యవహరించలేదు. బహిరంగ వేలం పాటకు సంబంధించిన నోటీసులను మాన్సాన్ ట్రస్టు కార్యాలయం, విజయనగరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం, భూములను అమ్ముతున్న ప్రాంతం, కనీసం నోటీసు బోర్డులో కూడా ఉంచలేదు. తగిన ప్రచారం కల్పించి ఉంటే ఎక్కువ మంది బహిరంగ వేలంలో పాల్గొని ఆ భూములకు మంచి ధర పలికి ఉండేదని అధికారులు నిర్ధారించారు. దేవదాయ శాఖ భూములను విక్రయించాలంటే నిబంధనల ప్రకారం అవన్నీ పాటించాలి. గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రయోజనం కల్పించేందుకు తూతూ మంత్రంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. -
సింహాచలం భూముల అక్రమాలపై నేడు నివేదిక
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): టీడీపీ ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం భూముల అన్యాక్రాంతం, మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి జరిగిన భూముల అక్రమాలపై విచారణ చేపట్టిన దేవదాయ శాఖ అధికారులు శుక్రవారం నివేదికను సమర్పించనున్నారు. ఈ వ్యవహారంపై దేవదాయశాఖ అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ, ఉప కమిషనర్ పుష్పవర్దన్‌ల కమిటీ విచారణ చేపట్టి సింహాచలం, విజయనగరం ప్రాంతాల్లో పర్యటించింది. పంచగ్రామాలను సందర్శించి.. అక్కడ ప్రజల నుంచి వివరాలు సేకరించింది. విశాఖ దేవదాయ శాఖ ఉపకమిషనర్ కార్యాలయంలో సింహాచలం దేవస్థానం రికార్డులు, ఆస్తుల జాబితా ప్రాపర్టీ రిజిస్టర్లను క్షుణ్నంగా పరిశీలించి నివేదిక రూపొందించింది. దీన్ని రాష్ట్ర దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావుకు శుక్రవారం సమర్పించనుంది. -
పెన్షన్ నిధికి దర్జాగా గండి!
► దేవాదాయశాఖలో అడ్డగోలు వ్యవహారం ► పాలకమండలి నియామకాలను ప్రభుత్వ నియామకాలుగా చూపుతున్న వైనం ► నిబంధనలకు విరుద్ధంగా సర్వీసు లెక్కింపు సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖలో స్వాహా పర్వం కొనసాగుతోంది. అడ్డదారిలో కొంతమంది పింఛన్ నిధిని కొల్లగొట్టేస్తున్నారు. గుమస్తాలుగా చేరి పదోన్నతిపై ఈవోలుగా నియమితులైన పలువురు ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. అసలు వారి నియామకాలే వివాదాస్పదం... ఆపై ప్రభుత్వ ఉద్యోగులుగా మారటమూ ఓ మిస్టరీ. అందునా నిబంధనలు తోసిరాజని ప్రభుత్వ పెన్షన్ పథకం జాబితాలోకి చేరి దర్జాగా పెన్షన్ స్వాహా చేస్తున్నారు. నిబంధనలున్నా ఇష్టారాజ్యం... సాధారణంగా ఎక్కడైనా నేరుగా ప్రభుత్వ నియామక ప్రక్రియల ద్వారా నియమితులైనవారినే ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. కానీ, దేవాదాయశాఖలో నిబంధనలు, అర్హతలు ఏమీ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులవుతున్నారు. క్యాడర్ స్ట్రెన్త్తో సంబంధం లేకుండానే దేవాలయ పాలకమండళ్లు తోచిన వ్యక్తులను ఆలయ గుమస్తా(క్లర్క్)గా నియమించుకుంటున్నారు. తర్వాత ఏకంగా కార్యనిర్వహణాధికారులు(ఈవో)గా పదోన్నతి పొందుతున్నారు. ఈవో అంటే అది ప్రభుత్వ ఉద్యోగమే. ఈ వ్యవహారమే ఓ గందరగోళమంటే... ఇప్పుడు దాన్ని మించిన బాగోతం వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగులుగా మారకముందు గుమస్తాలుగా ఉన్న కాలాన్ని కూడా అడ్డదారిలో పరిగణనలోకి తీసుకొచ్చి ఏకంగా పింఛన్ పొందుతున్నారు. గుమస్తాలుగా నియమితులైనవారు ఈవోలుగా మారినప్పటి నుంచి మాత్రమే వారి సర్వీసు లెక్కలోకి వస్తుంది. ఈవోలుగా 2004 ఆగస్టుకు ముందు నియమితులైతేనే పెన్షన్ పథకానికి అర్హత పొందుతారు. కానీ, 2004 తర్వాత ఈవోలుగా మారుతున్నవారు, అంతకుముందు గుమస్తాలుగా, సూపరింటెండెంట్లుగా పనిచేసిన కాలాన్ని కూడా సర్వీసుకు కలిపి అడ్డదారిలో ‘అర్హత’ తెచ్చు‘కొంటున్నారు’. దీన్ని గుర్తిం చాల్సిన ఉన్నతాధికారులు కళ్లు మూసుకుని సంతకాలు పెట్టేస్తున్నారు. అలా 2004 తర్వాత ఈవోలుగా మారి పదవీ విరమణ పొందుతున్న వందలమంది నిబంధనలకు విరుద్ధంగా గ్రాట్యుటీ, పింఛన్ పొందుతున్నారు. పెన్షన్ స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అమలులోకి వచ్చింది. 2004 ఆగస్టు తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు వారి మూలవేతనంలో 10 శాతాన్ని దీనికి జమచేయాలి. అంతేమొత్తం ప్రభుత్వం దానికి జత చేస్తుంది. పదవీ విరమణ తర్వాత ఈ మొత్తం ఒకేవిడతలో ఉద్యోగికి అందిస్తారు. కొంతమంది అడ్డదారిలో పెన్షన్ పథకం ఖాతాలోకి చేరుతున్నారు. విజిలెన్సు విభాగం కాని, ఆడిటింగ్ బృందాలు కాని అభ్యంతరం చెప్పకపోవటం గమనార్హం. సాధారణంగా పెన్షన్ పథకానికి ఎవరు అర్హులో గుర్తించాల్సిన విభాగం కూడా దీన్ని పసిగట్టకపోవటం కొసమెరుపు. -
ఓరి దేవుడా..!
ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న భూములనే కాదంటున్న దేవాదాయ శాఖ కోరుతాడిపర్రులోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ భూములంటూ కౌలు హక్కులకు వేలం అమృతలూరు మండలంలో ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నం.. మరో రైతుకు అస్వస్థత కోరుతాడిపర్రుకు చెందిన రైతు దూపాటి శివనాగేశ్వరరావు...పెద్దలు ఏనాడో కొని తనకు సంక్రమించిన 1.30 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నారు. దాంతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొన్నాడు. కుటుంబమంతా రెక్కల కష్టంచేసుకుంటూ ఏదోలా జీవనం సాగిస్తున్నారు. అక్కడకు దగ్గర్లోని ఆలపాడు రైతు వీర్ణపు సత్తెయ్య పాతికేళ్ల క్రితం కొంత భూమిని కొనుక్కున్నాడు. ఇలాంటి 70 మంది రైతులకు మూడేళ్లుగా కంటిమీద నిద్ర కరవైందంటే అతిశయోక్తి కాదు. అయినా రైతులపక్షాన ఆలోచించకుండా అధికారులు ముందుకు సాగటం వారిని వేదనకు గురిచేసింది. ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. తెనాలి: అమృతలూరు మండలం కోరుతాడిపర్రు, వామనగుంటపాలెం, ఆలపాడు గ్రామాలకు చెందిన వీరంతా 47 ఎకరాల భూమిని ఎప్పటి నుంచో సాగుచేసుకుంటున్నారు. సమీప గ్రామస్తుల నుంచి, బంధువుల నుంచి భూమిని కొనుగోలు చేసినవారే అధికం. కొంతకాలం క్రితం దేవాదాయశాఖ అధికారులు ఆ భూమిని కోరుతాడిపర్రులోని శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయానికి సంబంధించినదని ప్రకటించటం ఆ రైతు కుటుంబాల్లో కల్లోలాన్ని రేపింది. అంతేకాకుండా భూమిపై కౌలు హక్కులకు సంబంధించి వేలం కూడా వేశారు. ఎకరాకు రూ.3000 కౌలు చొప్పన వేలం పూర్తిచేశారు. ఆ భూమి స్వాధీనంలో ఉన్న రైతుల అభ్యంతరాలను పట్టించుకోలేదంటారు. దీనిపై ల్యాండ్ రెవెన్యూ కమిషనరు వరకు వివాదం నడిచింది. కోర్టులోనూ వ్యాజ్యం వేసినట్టు చెబుతున్నారు. ఈలోగా స్వాధీనంలో ఉన్న రైతులే పంటలు వేశారు. తీరా కోత సమయం వచ్చేసరికి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ వేలం హక్కులు దక్కించుకున్న రైతులు పంట కోసుకున్నారు. మళ్లీ ఇప్పుడు వేలం నిర్వహించటంతో ఆ భూములకు శాశ్వతంగా నీళ్లొదులు కోవాల్సి వస్తుందన్న భయాందోళనలతోనే శివనాగేశ్వరరావు, సత్తెయ్యతోపాటు నక్కా ఏడుకొండలు, గొడవర్తి నాగేశ్వరరావు, తాళ్లూరి బోసుబాబు, రెడ్డి వెంకటసుబ్బమ్మ సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మరో రైతు అస్వస్థతకు లోనయ్యాడు. వీరంతా ఇప్పుడు తెనాలి, గుంటూరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముందురోజే బెదిరించారు... పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న భూమిని ఇప్పుడు కాదుపొమ్మంటే ఏం చేయాలని దూపాటి శివనాగేశ్వరరావు కుటుంబ సభ్యులు తెనాలి ఆస్పత్రిలో కన్నీరుమున్నీరయ్యారు. వేలం నిలుపుదల చేయాలని కోరితే ఖాతరు చేయలేదన్నారు. ‘ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ నుంచి ఆ భూమిపై స్టేటస్కో ఉందనీ..అయినా వినకుండా వేలం వేశారు. వేలం ఛాయలకు వస్తే అరెస్టు చేస్తాం అని సీఐ మమ్మల్ని ముందురోజే బెదిరించారు’ అని చిలకపాటి మధుసూదనరావు చెప్పారు. తక్కువ ధరకు భూములు కౌలుకు వస్తాయనీ, భవిష్యత్‌లో సొంతం చేసుకోవచ్చని మభ్యపెట్టి వేలంకు దింపారనీ, రైతుల మధ్య చిచ్చుపెట్టారని ఆరోపించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినపుడు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చాం...అందులో ఇవి ఏస్టేట్ భూములు’ అని స్పష్టంగా ఉందని వామనగుంటపాలెం సర్పంచ్ కోగంటి తరుణ్‌కుమార్ చెప్పారు. అసలయినా వివాదంలో ఉన్న భూమికి వేలం ఎలా నిర్వహిస్తారని సీపీఎం డివిజన్ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి ప్రశ్నించారు. బడుగు జీవుల భూమిని లాక్కుని పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే ఇదని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరికల కాంతారావు ఆరోపించారు. ఇలా విషణ్ణ వదనాలతో ఉన్న రైతుల కుటుంబసభ్యులను పరామర్శించిన రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు అధికారుల వైఖరిని ఖండించారు. వేలం దగ్గర ఏం జరగలేదు... కోరుతాడిపర్రు ఆలయంలో జరిగిన భూముల వేలం ప్రశాంతంగా జరిగిందనీ, అక్కడ రైతులెవరూ ఆత్యహత్యాయత్నం ప్రయత్నం చేయలేదనీ మా అధికారులు చెప్పారు. ఛానళ్లలో వస్తున్న వార్తలను చూసి వాకబు చేస్తే ఆ విధంగా చెప్పారు. - సురేష్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ అధికారుల కారణంగానే.. రైతుల ఆత్మహత్యాయత్నం వేమూరు: కొన్నేళ్ల నుంచి సాగు చేసుకొని బతుకుతున్న రైతులపై ఎండోమెంట్ అధికారులు, పోలీసులు ఓవరాక్షన్ చేసినందునే రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించారనీ, బాధ్యులైన ఆధికారులపై చర్యలు తీసుకుంటామని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు స్పష్టం చేశారు. అమృతలూరు మండలంలోని కోరుతాడిపర్రులోని 47 ఎకరాల భూమిని దేవాదాయ భూమి పేరుతో అధికారులు వేలం వేయటంతో ఆ భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఆరుగురు సోమవారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వీరిని ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు పరామర్శించారు. వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, రైతులు 50 సంవత్సరాలు నుంచి సాగు చేసుకుంటున్న భూములకు ఎండోమెంట్ ఆధికారులు, పోలీసు యంత్రాంగం వేలం పెట్టటంతో రైతులు ఆత్మహత్యకు పూనుకున్నట్టు చెప్పారు. దీనికి ఎండోమెంట్ ఆధికారులు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.ఎండోమెంట్ అధికారులకు తమ భూములు ఎక్కడ ఉన్న సంగతి ఈ రోజు వరకు పూర్తిగా తెలియదు. చిన్న సన్న కారులు రైతులు సాగు చేస్తుంటే అవి మాత్రం అధికారులకు కన్పిస్తాయని అన్నారు. రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీరితో జడ్పీటీసీ చందోలు పృధ్వీలత, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తదితరులున్నారు.