పెన్షన్ నిధికి దర్జాగా గండి!
► దేవాదాయశాఖలో అడ్డగోలు వ్యవహారం
► పాలకమండలి నియామకాలను ప్రభుత్వ నియామకాలుగా చూపుతున్న వైనం
► నిబంధనలకు విరుద్ధంగా సర్వీసు లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖలో స్వాహా పర్వం కొనసాగుతోంది. అడ్డదారిలో కొంతమంది పింఛన్ నిధిని కొల్లగొట్టేస్తున్నారు. గుమస్తాలుగా చేరి పదోన్నతిపై ఈవోలుగా నియమితులైన పలువురు ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. అసలు వారి నియామకాలే వివాదాస్పదం... ఆపై ప్రభుత్వ ఉద్యోగులుగా మారటమూ ఓ మిస్టరీ. అందునా నిబంధనలు తోసిరాజని ప్రభుత్వ పెన్షన్ పథకం జాబితాలోకి చేరి దర్జాగా పెన్షన్ స్వాహా చేస్తున్నారు.
నిబంధనలున్నా ఇష్టారాజ్యం...
సాధారణంగా ఎక్కడైనా నేరుగా ప్రభుత్వ నియామక ప్రక్రియల ద్వారా నియమితులైనవారినే ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. కానీ, దేవాదాయశాఖలో నిబంధనలు, అర్హతలు ఏమీ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులవుతున్నారు. క్యాడర్ స్ట్రెన్త్‌తో సంబంధం లేకుండానే దేవాలయ పాలకమండళ్లు తోచిన వ్యక్తులను ఆలయ గుమస్తా(క్లర్క్)గా నియమించుకుంటున్నారు. తర్వాత ఏకంగా కార్యనిర్వహణాధికారులు(ఈవో)గా పదోన్నతి పొందుతున్నారు. ఈవో అంటే అది ప్రభుత్వ ఉద్యోగమే. ఈ వ్యవహారమే ఓ గందరగోళమంటే... ఇప్పుడు దాన్ని మించిన బాగోతం వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగులుగా మారకముందు గుమస్తాలుగా ఉన్న కాలాన్ని కూడా అడ్డదారిలో పరిగణనలోకి తీసుకొచ్చి ఏకంగా పింఛన్ పొందుతున్నారు. గుమస్తాలుగా నియమితులైనవారు ఈవోలుగా మారినప్పటి నుంచి మాత్రమే వారి సర్వీసు లెక్కలోకి వస్తుంది.
ఈవోలుగా 2004 ఆగస్టుకు ముందు నియమితులైతేనే పెన్షన్ పథకానికి అర్హత పొందుతారు. కానీ, 2004 తర్వాత ఈవోలుగా మారుతున్నవారు, అంతకుముందు గుమస్తాలుగా, సూపరింటెండెంట్లుగా పనిచేసిన కాలాన్ని కూడా సర్వీసుకు కలిపి అడ్డదారిలో ‘అర్హత’ తెచ్చు‘కొంటున్నారు’. దీన్ని గుర్తిం చాల్సిన ఉన్నతాధికారులు కళ్లు మూసుకుని సంతకాలు పెట్టేస్తున్నారు. అలా 2004 తర్వాత ఈవోలుగా మారి పదవీ విరమణ పొందుతున్న వందలమంది నిబంధనలకు విరుద్ధంగా గ్రాట్యుటీ, పింఛన్ పొందుతున్నారు. పెన్షన్ స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అమలులోకి వచ్చింది. 2004 ఆగస్టు తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు వారి మూలవేతనంలో 10 శాతాన్ని దీనికి జమచేయాలి.
అంతేమొత్తం ప్రభుత్వం దానికి జత చేస్తుంది. పదవీ విరమణ తర్వాత ఈ మొత్తం ఒకేవిడతలో ఉద్యోగికి అందిస్తారు. కొంతమంది అడ్డదారిలో పెన్షన్ పథకం ఖాతాలోకి చేరుతున్నారు. విజిలెన్సు విభాగం కాని, ఆడిటింగ్ బృందాలు కాని అభ్యంతరం చెప్పకపోవటం గమనార్హం. సాధారణంగా పెన్షన్ పథకానికి ఎవరు అర్హులో గుర్తించాల్సిన విభాగం కూడా దీన్ని పసిగట్టకపోవటం కొసమెరుపు.