ఒంటరి మహిళలకు ‘ఆసరా’ అందేదిలా..
షెడ్యూల్ ఖరారు
- ఈ నెల 13 నుంచి 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
- 17 నుంచి 21 వరకు దరఖాస్తుల పరిశీలన.. అర్హుల జాబితా విడుదల
- అనంతరం తుది జాబితా..మే 1 నుంచి పింఛను పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకం ద్వారా ఒంటరి మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించే ప్రక్రియకు షెడ్యూల్ ఖరారైంది. తెలంగాణ వ్యాప్తంగా ఏ ఆదరువూ లేని ఒంటరి మహిళలకు నెలకు రూ.1,000 చొప్పున ఏప్రిల్ నుంచి ఆర్థిక భృతి ఆందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌కు సంబంధిం చిన ఆర్థిక భృతిని మే నెల 1 నుంచి అందజేయాల్సి ఉన్నందున.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ షెడ్యూల్‌ను గ్రామీణాభివృద్ధి శాఖ ఖరారు చేసింది. షెడ్యూల్ మేరకు ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాల్లోనూ గ్రామ సభ/వార్డు సభలు నిర్వహించి అధికారులు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఈనెల 17 నుంచి 21 వరకు దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన లబ్ధిదా రుల జాబితాలను ఆయా గ్రామాల్లో/వార్డుల్లో మూడు ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రదర్శిస్తారు. 22 నుంచి 24 వరకు లబ్ధిదారుల జాబితాపై అభ్యంత రాలను స్వీకరించి తుది జాబితాను ప్రచురిస్తారు. ఈనెల 25 నుంచి 29 వరకు సమాచారాన్ని గ్రామాల్లోనైతే ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లాలో తహసీల్దార్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో డిప్యూటీ కమిషనర్లు ఆసరా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. మే 1న నుంచి అర్హులైన ఒంటరి మహిళలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక భృతిని ప్రభుత్వం అందించనుంది.
దరఖాస్తు చేయాల్సినది ఇలా..: అర్హులైన ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తును వ్యక్తిగతం గా సమర్పించాలి. దరఖాస్తుపై ఫోటోను అంటిం చడంతోపాటు ఆధార్ కార్డు, బ్యాంక్ లేదా పోస్టల్ ఖాతా పుస్తకం, వయస్సు, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జిరాక్సు ప్రతులను జత చేయాలి. అత్యాచార, యాసిడ్ దాడుల బాధితులైనట్లయితే పోలీసులు ఇచ్చే ఎఫ్‌ఐఆర్ కాపీని జత చేయాలి.
పరిశీలన జరిగేది ఇలా..
లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామసభలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలు నిర్వహించాలి. కిందిస్థాయి సిబ్బంది మార్గదర్శకాల మేరకు పరిశీలన చేసేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల గుర్తింపు నిమిత్తం మున్సిపల్ సిబ్బంది సహకారాన్ని పొందవచ్చు. పది శాతం దరఖాస్తులను మచ్చుకు తనిఖీ చేసే నిమిత్తం ప్రత్యేక అధికారులను నియమించాలి. తప్పుడు గుర్తింపు, పరిశీలన చేసిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలతోపాటు అప్పటికే చెల్లించిన సొమ్మును రికవరీ చేయాలి.
అర్హతలు ఇలా
► ఏడాదికి పైగా భర్త వదిలేసిన, భర్త నుంచి వేరుగా ఉంటున్న, విడాకులు తీసుకున్న మహిళలను, ఏ ఆదరువు (కుటుంబం, ఆర్థిక తోడ్పాటు) లేని, 18 ఏళ్లు పైబడిన వారిని ఒంటరి మహిళలుగా పరిగణిస్తారు. స్థానికంగా విచారణ (లోకల్ ఎంక్వయిరీ) ద్వారా వీరి అర్హతను నిర్ధారిస్తారు.
► దేవునితో పెళ్లి జరిగిన మాతమ్మ, జోగిని, బసవి, తాయమ్మ, పార్వతి.. తదితర పేర్లతో ఉన్న వారు కూడా ఒంటరి మహిళల కింద ఆర్థిక భృతికి అర్హులు. అలాగే యాసిడ్ దాడుల బాధితులు, అత్యాచారానికి గురైన మహిళలకు ఆర్థిక భృతి కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు వారి విచక్షణ మేరకు సిఫారసు చేయవచ్చు.
► గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న మహిళలే అర్హులు. దరఖాస్తుదారు ఇప్పటికే ఎలాంటి సామాజిక భద్రత పింఛన్ గానీ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి గానీ పింఛన్ పొందుతున్న వారు కాకూడదు.
► ఒకవేళ తిరిగి వివాహం చేసుకున్నా, ఏదేని ఉద్యోగంలో చేరి ఆర్థిక స్థిరత్వాన్ని పొందిన మహిళలకు ఎప్పుడైనా ఆర్థిక భృతిని నిలిపివేస్తారు.
► పైన పేర్కొన్న కేటగిరీల్లో ఆర్థిక భృతిని పొందుతున్న మహిళలు 65 ఏళ్లు దాటిన తర్వాత ఆసరా (వృద్ధాప్య) పింఛన్ పథకంలోకి వస్తారు.