కొత్త పింఛన్ల మంజూరుపై వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ కలెక్టర్ రఘునందన్ రావు
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురు చూసే పండుటాకులకు శుభవార్త. ‘ఆసరా’ కోసం దరఖాస్తు చేసుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నవారికి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నగదు అందించనున్నారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 4 లక్షల మంది అర్హులు ఉన్నట్టు అధికార యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించింది. వృద్ధాప్య పింఛన్ల అర్హతను 57 ఏళ్లకు తగ్గించడంతో ఓటర్ల జాబితా ఆధారంగా నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త పింఛన్‌దారుల ఎంపిక ప్రక్రియ మార్చిలోగా పూర్తి చేసి ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 1,51,285 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వారి సంఖ్య మూడింతలు పెరగనుంది. వాస్తవానికి ఇప్పటికే అర్హులను గుర్తించి నివేదిక రూపొందించినప్పటికీ అదనంగా వచ్చే దరఖాస్తులను బట్టి వాటి సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వార్షికాదాయం రూ.2 లక్షలు
ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం ఆసరా పింఛన్ల లబ్ధిదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలు ఉండి 57 ఏళ్లు దాటినవారు అర్హులు. మరోవైపు నెలవారీ పింఛన్ సొమ్ము కూడా రూ.2016కు పెంచారు. ఓటరు జాబితా ఆధారంగా గుర్తించిన 54 నుంచి 57 వయసు గలవారి వివరాలు ‘ఎస్‌కేఎఫ్’ డేటాలో పొందుపర్చనున్నారు. ఆ జాబితాపై క్షేత్ర స్థాయి విచారణ చేపడతారు. అర్హులైన లబ్దిదారుడి యూఐడీ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఫొటోతో సహా సేకరించి పరిపాలన అనుమతి నిమిత్తం జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు. మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్న తర్వాత అర్హుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
పింఛన్లపై సీఎస్ ఆరా..
ఆసరా కొత్త పింఛన్ల మంజూరుపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లను అర్హుల గుర్తింపుపై ఆరా తీశారు. నిర్ణీత గడువులోగా అర్హులైన వారిని గుర్తించి వివరాలు పంపించాలని ఆదేశించారు. కొత్త పింఛన్ల కోసం 57 ఏళ్ల నుంచి 64 సంవత్సరాల వయసు గలవారు అర్హులన్నారు. ఇందు కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ కలెక్టర్ రఘునందన్‌రావు, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీపీఓ రామభద్రం, సెక్షన్ సూపరిటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment