సాక్షి, హైదరాబాద్/వెంగళరావునగర్: రాష్ట్రంలోని ప్రతి డయాలసిస్ రోగికి ఎలాంటి నిబంధనలు లేకుండా ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వేల మంది డయాలసిస్ రోగులున్నారని, వారిలో 10 వేల మంది ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లోనే ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నారని తెలిపారు.
వివిధ కేటగిరీల్లో అందిస్తున్న సామాజిక పింఛన్ల పరిధిలోకి రాని 5 వేల మంది డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్ల కింద ప్రతి నెలా రూ. 2,016 అందిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ)లో డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్ కార్డులను మంత్రి హరీశ్‌రావు అందించారు. ఆసరా పింఛన్ అందని డయాలసిస్ రోగులు అధికారులను సంప్రదిస్తే పింఛన్లు మంజూరు చేస్తారన్నారు.
రాష్ట్రంలో 102 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఇప్పటికే 83 కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని.. అతిత్వరలో మిగతా చోట్ల కూడా డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలతోపాటు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, జీవితకాలం ఉచితంగా మందులు, ఉచిత బస్‌పాస్‌లు మొదలైనవి ప్రభుత్వం అందిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సింగిల్ యూజ్ సిస్టమ్‌తో డయాలసిస్ పరీక్షలను రాష్ట్రంలో ప్రవేశపెట్టినట్టు మంత్రి హరీశ్‌రావు వివరించారు. గతంలో ఒక ఫిల్టర్‌ను ముగ్గురు, నలుగురికి వాడితే ఇన్ఫెక్షన్లు వచ్చేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
మానసిక ఆందోళనలను దూరం చేసేలా...
అనంతరం టెలి మెంటల్ హెల్త్ సర్వీసుల (టెలి–మానస్) కాల్‌సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవనశైలి మార్పుల వల్ల చాలా మందిలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని... వాటిని అరికట్టే చర్యల్లో భాగంగా టెలి–మానస్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్న వారు 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఉచితంగా వైద్య సలహాలు పొందొచ్చన్నారు.
అలాగే అవసరమైతే వారికి సంబంధిత ఆస్పత్రులకు రెఫర్ చేస్తామని చెప్పారు. ఈ కేంద్రంలో 25 మంది సైకాలజిస్ట్‌లు, కౌన్సిలర్లు పనిచేస్తున్నారని, వారికి ప్రత్యేకంగా బెంగళూరులో శిక్షణ సైతం ఇప్పించినట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం ఓఎస్‌డీ గంగాధర్, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment