Dialysis Patients
-
డయాలసిస్ బాధితులకు 108లో ఉచిత ప్రయాణానికి మంగళం
-
విషాదం: వైద్యం కోసం బస్సులో వెళ్తుండగా భార్య ఒడిలోనే..
పరకాల: వైద్యం కోసం ఆర్టీసీ బస్సులో బయల్దేరిన ఒక డయాలసిస్ రోగి గుండెపోటుతో భార్య ఒడిలోనే కుప్పకూలాడు. ఈ విషాద సంఘటన హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన అలిగేటి తిరుపతి రెడ్డి (44) కొంతకాలంగా వరంగల్‌లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైద్యం కోసం భార్య స్వప్నతో కలిసి వెంకట్రావుపల్లి నుంచి వరంగల్‌కు ఆర్టీసీ బస్సులో వస్తున్నారు. బస్సు పరకాల బస్టాండ్‌కు చేరుకున్న కాసేపటికే.. భార్య ఒడిలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వైద్యం చేస్తే బతుకుతాడనుకున్న భర్త.. కన్ను మూయడంతో భార్య స్వప్న కన్నీరుమున్నీరుగా విలపించింది. (క్లిక్ చేయండి: సోదరులిద్దరికీ ఒకేసారి వివాహం.. పెళ్లైన ఆరు నెలలకే మృత్యుఒడికి) -
డయాలసిస్ రోగులందరికీ పింఛన్లు ఇస్తున్నాం
సాక్షి, హైదరాబాద్/వెంగళరావునగర్: రాష్ట్రంలోని ప్రతి డయాలసిస్ రోగికి ఎలాంటి నిబంధనలు లేకుండా ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వేల మంది డయాలసిస్ రోగులున్నారని, వారిలో 10 వేల మంది ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లోనే ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నారని తెలిపారు. వివిధ కేటగిరీల్లో అందిస్తున్న సామాజిక పింఛన్ల పరిధిలోకి రాని 5 వేల మంది డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్ల కింద ప్రతి నెలా రూ. 2,016 అందిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ)లో డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్ కార్డులను మంత్రి హరీశ్‌రావు అందించారు. ఆసరా పింఛన్ అందని డయాలసిస్ రోగులు అధికారులను సంప్రదిస్తే పింఛన్లు మంజూరు చేస్తారన్నారు. రాష్ట్రంలో 102 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఇప్పటికే 83 కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని.. అతిత్వరలో మిగతా చోట్ల కూడా డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలతోపాటు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, జీవితకాలం ఉచితంగా మందులు, ఉచిత బస్‌పాస్‌లు మొదలైనవి ప్రభుత్వం అందిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సింగిల్ యూజ్ సిస్టమ్‌తో డయాలసిస్ పరీక్షలను రాష్ట్రంలో ప్రవేశపెట్టినట్టు మంత్రి హరీశ్‌రావు వివరించారు. గతంలో ఒక ఫిల్టర్‌ను ముగ్గురు, నలుగురికి వాడితే ఇన్ఫెక్షన్లు వచ్చేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. మానసిక ఆందోళనలను దూరం చేసేలా... అనంతరం టెలి మెంటల్ హెల్త్ సర్వీసుల (టెలి–మానస్) కాల్‌సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవనశైలి మార్పుల వల్ల చాలా మందిలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని... వాటిని అరికట్టే చర్యల్లో భాగంగా టెలి–మానస్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్న వారు 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఉచితంగా వైద్య సలహాలు పొందొచ్చన్నారు. అలాగే అవసరమైతే వారికి సంబంధిత ఆస్పత్రులకు రెఫర్ చేస్తామని చెప్పారు. ఈ కేంద్రంలో 25 మంది సైకాలజిస్ట్‌లు, కౌన్సిలర్లు పనిచేస్తున్నారని, వారికి ప్రత్యేకంగా బెంగళూరులో శిక్షణ సైతం ఇప్పించినట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. -
కరోనా బాధితుడి కన్నీటి వ్యథ!
సాక్షి, తుర్కపల్లి (ఆలేరు) : రెండు కిడ్నీలు చెడిపోయిన ఓ వ్యక్తి కరోనా కాటుకు గురై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది, కరోనాను జయించాడు. కాని నాటి నుంచి డయాలసిస్ కష్టాలు మొదలయ్యాయి. ఏం చేయాలో తెలియక కన్నీరుమున్నీరవుతున్నాడు. తనను బతికించాలని వేడుకుంటున్నాడు. ఏడు సంవత్సరాల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధి.. తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన కొమ్మరాజు బాల్‌రాజు తన రజక కులవృత్తిని కొనసాగిస్తూ, మరో వైపు బ్యాండ్ మేళంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడు సంవత్సరాల క్రితం తన రెండు కిడ్నీలు చెడిపోవడంతో వైద్యం చేయించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. గత ఐదారు సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నాడు. కరోనా బారిన పడి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకొని వస్తున్న క్రమంలో.. అదే ఆస్పత్రిలో ఓ కిడ్నీ పేషెంట్‌కు కరోనా పాజిటివ్ రావడంతో, అదే రోజు డయాలసిస్‌కు వచ్చిన వారు కోవిడ్ – 19 పరీక్షలు చేయించుకోవాలని బాల్‌రాజుకు ఆస్పత్రి నుంచి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో గత నెల 27న కోవిడ్ 19 పరీక్ష చేయించుకున్నాడు. 29న పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. వెంటనే బాల్‌రాజు కుమారుడు 108కు సమాచారం ఇచ్చాడు. బాల్రాజును అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 16 రోజుల చికిత్స అనంతరం ఈనెల 15న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కరోనా వ్యాధి తగ్గిందని, పరీక్షల అనంతరం వచ్చిన నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. వెంటాడుతున్న డయాలసిస్ కష్టాలు.. మూడు రోజులకోసారి డయాలసిస్ చేయించుకోవాలి్సన అవసరం ఉండడంతో, ఆరు సంవత్సరాల నుంచి తాను పరీక్ష చేయించుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా.. ప్రస్తుతం తనకు డయాలసిస్ పరీక్షలు చేయబోమని, వేరేచోట చేయించుకోవాలని పంపించారు. ఒకటి, రెండు ఆస్పత్రులు తిరిగినా ఇదే పరిస్థితి ఎదురైంది. చేసేదేమీ లేక ఆలేరులోని ప్రభుత్వ భగవాన్ మహావీర్ జనరల్ లైఫ్ ఫాండేషన్ సెంటర్లో డయాలసిస్ పరీక్ష కోసం వెళ్లాడు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చినా.. క్వారంటైన్లో ఉన్న వాళ్లకి ఇక్క డ డయాలసిస్ చేయ బోమని, హైదరాబాద్‌లోని ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న చోట చేయించుకోవాలని తిరిగి పంపించారు. తాను డయాలసిస్ ఎక్క డ చేయించుకోవా లో తెలి యని పరిస్థితి ఏర్పడిందని, మూడు రో జు లకోసారి డయాలసిస్ చేయించుకోకపోతే ఆరోగ్య సమస్యలు వెంటాడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సమస్యను పరిష్కరిస్తాం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కృషితో ఈ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు అయింది. కరోనా నెగెటివ్ వచ్చిన తరువాత సేవలందించాలి్సన అవసరం ఉంది. జరిగిన సంఘటనపై విచారణ జరిపి బాధితుడి సమస్య పరిష్కరిస్తాం. – సాంబశివరావు, డీఎంహెచ్ఓ -
షరతులు వర్తిస్తాయి..
►జగన్ నవరత్నాల ప్రకటనకు బాబు సర్కారు బెంబేలు ►కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 పింఛన్ ఇస్తామంటూ ప్రకటన ►ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకున్న వారికేనంటూ మెలిక ► జిల్లాలో రెండు వేల మందికి పైగా డయాలసిస్ పేషెంట్లు ►సర్కారు వైద్యశాల్లో డయాలసిస్ చేయించుకునేవారు 750 మందే ►మిగిలినవారి సంగతి తేల్చని ప్రభుత్వం ►ఆందోళనలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఒంగోలు : నానా మెలికలతో రైతు రుణమాఫీని మొక్కుబడిగా చేపట్టిన బాబు సర్కారు కిడ్నీ వ్యాధిగ్రస్తుల విషయంలోనూ షరతులు పెడుతోంది. ప్రకటించీ ప్రకటించకముందే పింఛన్ ఎగ్గొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ ఇస్తామంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బెంబేలెత్తిన చంద్రబాబు సర్కారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ప్రకాశం జిల్లా కనిగిరి, కొండపి ప్రాంతాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.2,500 చొప్పున పింఛన్లు అందజేస్తామంటూ ప్రకటించింది. ఈ పింఛన్ల విధానానికి స్పష్టత లేకుండా చంద్రబాబు మెలిక పెట్టారు. రైతు రుణమాఫీ లాగానే కొర్రీలు వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ చేయించుకున్న పేషెంట్లకే పింఛన్ విధానం వర్తిస్తుందని తాజాగా వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. ఈ లెక్కన ప్రైవేట్ వైద్యశాలలో డయాలసిస్ చేయించుకున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ లేనట్లే. దీనిపై కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దానం కంటే అధ్వానం.. వాస్తవానికి ప్రకాశం జిల్లాలో వ్యాధి తీవ్రత ఉద్దానం కంటే తక్కువేమీ కాదు. కేవలం రెండేళ్లలోనే ప్రభుత్వ గణాంకాల ప్రకారం 427 మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. ఇక అధికారికంగా 2,200 మందికిపైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు వివిధ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. అనధికారికంగా ఈ లెక్కలు మరింత అధికం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 750 మంది మాత్రమే ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో చికిత్స చేయించుకుంటున్నట్లు ఎన్టీఆర్ వైద్యసేవ అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. ఈ లెక్కన దాదాపు 1400 మంది వివిధ ప్రాంతాల్లోని ప్రైవేట్ వైద్యశాలల్లో డయాలసిస్ చేయించుకుంటున్నట్లే లెక్క. అంటే వీరందరికీ రూ.2,500 పింఛన్ వర్తించే అవకాశం లేదు. అదే జరిగితే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పింఛన్ ఎందుకు ప్రకటించినట్టో.. అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రైవేటు వైద్యంతో ఆర్థిక భారం.. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం అందుబాటులో లేకపోవడం వల్లే ప్రాణం పొగొట్టుకోలేక వ్యాధిగ్రస్తులు ఆర్థిక భారాన్ని భరిస్తూనే ప్రైవేట్ వైద్యశాలల్లో డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. పైగా ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ రోగులకు అందుబాటులో లేదు. చాలా కాలంగా వ్యాధి అధికంగా ఉన్న కనిగిరి, కొండపి, కందుకూరు, పొదిలి ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యాధి బాధితులతో పాటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కోరుతోంది. అయినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. ఇటీవల ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిలు కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తెచ్చారు. అటు కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కనిగిరి పర్యటించి కిడ్నీ వ్యా«ధిగ్రస్తులను పరామర్శించారు. వారికి వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ కనిగిరి పర్యటన నేపథ్యంలోనే ప్రభుత్వం కనిగిరి, కందుకూరు, మార్కాపురంలలో డయాలసిస్ కేంద్రాలను ప్రకటించింది. ఇప్పటికీ కనిగిరి, కందుకూరులలో మాత్రమే ఐదు బెడ్లతో డయాలసిస్ కేంద్రాలను ఇటీవల ప్రారంభించింది. ఇంతకు ముందంతా డయాలసిస్ అందుబాటులోకి లేకపోవడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఒంగోలుతో పాటు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, చెన్నై ప్రాంతాలకు వెళ్ళి ప్రైవేట్‌గా డయాలసిస్ చేయించుకునేవారు. ఇది వారికి ఆర్థికభారంగా మారింది. అంతా డొంక తిరుగుడే.. తాజాగా చంద్రబాబు సర్కారు కేవలం ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ చేయించుకున్న వారికి మాత్రమే పింఛన్ ప్రకటించటం బాబు డొంక తిరుగుడు వ్యవహారానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రైవేట్ వైద్యశాలలో డయాలసిస్ చేయించుకున్న వారే అధికంగా ఉన్నారు కాబట్టి తక్షణం ప్రభుత్వం, ప్రైవేట్ వైద్యశాలల్లో డయాలసిస్ చేయించుకున్న వారందరికీ పింఛన్ల మంజూరు చేయాలని వ్యాధిగ్రస్తులతో పాటు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు.