షరతులు వర్తిస్తాయి.. | Kidneys in the Anxiety | Sakshi
Sakshi News home page

షరతులు వర్తిస్తాయి..

Published Thu, Jul 20 2017 2:22 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

షరతులు వర్తిస్తాయి..

షరతులు వర్తిస్తాయి..

జగన్‌ నవరత్నాల ప్రకటనకు బాబు సర్కారు బెంబేలు
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 పింఛన్‌ ఇస్తామంటూ ప్రకటన
ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్‌ చేయించుకున్న వారికేనంటూ మెలిక
జిల్లాలో రెండు వేల మందికి పైగా   డయాలసిస్‌ పేషెంట్లు
సర్కారు వైద్యశాల్లో డయాలసిస్‌ చేయించుకునేవారు 750 మందే
మిగిలినవారి సంగతి తేల్చని ప్రభుత్వం
ఆందోళనలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు


ఒంగోలు : నానా మెలికలతో రైతు రుణమాఫీని మొక్కుబడిగా చేపట్టిన బాబు సర్కారు కిడ్నీ వ్యాధిగ్రస్తుల విషయంలోనూ షరతులు పెడుతోంది. ప్రకటించీ ప్రకటించకముందే  పింఛన్‌ ఎగ్గొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల జరిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ ఇస్తామంటూ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బెంబేలెత్తిన చంద్రబాబు సర్కారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ప్రకాశం జిల్లా కనిగిరి, కొండపి ప్రాంతాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.2,500 చొప్పున పింఛన్లు అందజేస్తామంటూ ప్రకటించింది. ఈ పింఛన్ల విధానానికి స్పష్టత లేకుండా చంద్రబాబు మెలిక పెట్టారు. రైతు రుణమాఫీ లాగానే కొర్రీలు వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్‌ చేయించుకున్న పేషెంట్లకే పింఛన్‌ విధానం వర్తిస్తుందని తాజాగా వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ప్రకటించారు. ఈ లెక్కన ప్రైవేట్‌ వైద్యశాలలో డయాలసిస్‌ చేయించుకున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ లేనట్లే. దీనిపై కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఉద్దానం కంటే అధ్వానం..
వాస్తవానికి ప్రకాశం జిల్లాలో వ్యాధి తీవ్రత ఉద్దానం కంటే తక్కువేమీ కాదు. కేవలం రెండేళ్లలోనే ప్రభుత్వ గణాంకాల ప్రకారం 427 మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. ఇక అధికారికంగా 2,200 మందికిపైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు వివిధ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. అనధికారికంగా ఈ లెక్కలు మరింత అధికం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 750 మంది మాత్రమే ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాల్లో చికిత్స చేయించుకుంటున్నట్లు ఎన్‌టీఆర్‌ వైద్యసేవ అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. ఈ లెక్కన దాదాపు 1400 మంది వివిధ ప్రాంతాల్లోని ప్రైవేట్‌ వైద్యశాలల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్నట్లే లెక్క. అంటే వీరందరికీ రూ.2,500 పింఛన్‌ వర్తించే అవకాశం లేదు. అదే జరిగితే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పింఛన్‌ ఎందుకు ప్రకటించినట్టో.. అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ప్రైవేటు వైద్యంతో ఆర్థిక భారం..
ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం అందుబాటులో లేకపోవడం వల్లే ప్రాణం పొగొట్టుకోలేక వ్యాధిగ్రస్తులు ఆర్థిక భారాన్ని భరిస్తూనే ప్రైవేట్‌ వైద్యశాలల్లో డయాలసిస్‌ చేయించుకోవాల్సి వస్తోంది. పైగా ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్‌ రోగులకు అందుబాటులో లేదు. చాలా కాలంగా వ్యాధి అధికంగా ఉన్న కనిగిరి, కొండపి, కందుకూరు, పొదిలి ప్రాంతాల్లో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యాధి బాధితులతో పాటు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి కోరుతోంది. అయినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. ఇటీవల ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిలు కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. అటు కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కనిగిరి పర్యటించి కిడ్నీ వ్యా«ధిగ్రస్తులను పరామర్శించారు. వారికి వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ కనిగిరి పర్యటన నేపథ్యంలోనే ప్రభుత్వం కనిగిరి, కందుకూరు, మార్కాపురంలలో డయాలసిస్‌ కేంద్రాలను ప్రకటించింది. ఇప్పటికీ కనిగిరి, కందుకూరులలో మాత్రమే ఐదు బెడ్లతో డయాలసిస్‌ కేంద్రాలను ఇటీవల ప్రారంభించింది. ఇంతకు ముందంతా డయాలసిస్‌ అందుబాటులోకి లేకపోవడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఒంగోలుతో పాటు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, చెన్నై ప్రాంతాలకు వెళ్ళి ప్రైవేట్‌గా డయాలసిస్‌ చేయించుకునేవారు. ఇది వారికి ఆర్థికభారంగా మారింది.

అంతా డొంక తిరుగుడే..
తాజాగా చంద్రబాబు సర్కారు కేవలం ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్‌ చేయించుకున్న వారికి మాత్రమే పింఛన్‌ ప్రకటించటం బాబు డొంక తిరుగుడు వ్యవహారానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రైవేట్‌ వైద్యశాలలో డయాలసిస్‌ చేయించుకున్న వారే అధికంగా ఉన్నారు కాబట్టి తక్షణం ప్రభుత్వం, ప్రైవేట్‌ వైద్యశాలల్లో డయాలసిస్‌ చేయించుకున్న వారందరికీ పింఛన్ల మంజూరు చేయాలని వ్యాధిగ్రస్తులతో పాటు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement