పింఛన్ల ఘోష పట్టదా!
బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలో మొత్తం 20వేల పింఛన్లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. దీనిలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తుదారుల ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే పరిశీలన చేయకుండానే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీనిపై సాక్షి దినపత్రికలో ఇటీవల పింఛన్ దారి మళ్లెన్ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై కలెక్టర్ ముత్యాలరాజు స్పందించి పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు.
జరిగిందిలా..
కలెక్టర్ ఆదేశాలతో అన్ని మండలాలతో పాటు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ నరసింహరావు పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఆన్‌లైన్ నమోదు చేయాలని సూచించారు. అయితే పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన దాఖలాలు లేవు.
పింఛన్ల నమోదులో తమ్ముళ్ల గోల
పింఛన్ల నమోదులో అధికారపార్టీ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆన్‌లైన్ నమోదు చివరి రెండు రోజులు రాత్రింబవళ్లు ఎంపీడీఓ కార్యాలయంలో కొలువుదీరారు. ఎవరికివారు తమ పేర్లు నమోదు చేయమని పట్టుబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, లక్షాధికారుల పేర్లను పంపి పింఛన్ మంజూరు చేయించారు.
నిబంధనలు ఇలా..
దరఖాస్తు చేసుకున్న పింఛన్‌దారులకు సంబంధించి నూరుశాతం ఫీల్డ్ లెవల్ వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్‌కు సంబంధించి పింఛన్ కమిటీలో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు కూడా తప్పనిసరిగా ఉండాలి. నూతన పింఛన్ మంజూరుకు సంబంధించి జీఓ 135ను విధిగా పాటించాలి. దీనిలో భాగంగా ఎస్టీలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే ఎస్సీలతో పాటు చేతివృత్తుల వారికి, వికలాంగులకు, నిరుపేదలకు పింఛన్లు మంజూరు చేయాలి. అయితే జీఓకు విరుద్ధంగా జరిగిన పింఛన్ల మంజూరుపై దేవాదాయశాఖ ఉద్యోగి కుటుంబంలో , వడ్డీ వ్యాపారులకు, లక్షాధికారులకు పింఛన్లు మంజూరు చేశారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు
మండలంలోని అధికారపార్టీ నేతలు, అధికారుల కుమ్మక్కు రాజకీయంతో తమకు పింఛన్ రాదని తెలుసుకున్న మండలంలోని పోలినాయుడు చెరువుకు చెందిన పొట్లూరు లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులు మీడియా ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ప్రేమ్‌చంద్ సాల్మన్ క్షేత్రస్థాయి విచారణ జరిపి పింఛన్ల మంజూరుకు ఇన్‌చార్జి ఎంపీడీఓకు సిఫార్సు చేశారు. వారికి పింఛన్లు మంజూరైన దాఖలాలు లేవు.
పింఛన్ ఇప్పించండి సారూ
నేను, నా భర్త ఏ పనిచేయలేకున్నాం. మం దులకు డబ్బుల్లేవు. పూట గడవడం కష్టం గా ఉంది. పింఛన్ ఇప్పించండి సారూ. కలెక్టర్ సారూ పట్టిం చుకుని న్యాయం చేయాలి.
–పొట్లూరు లక్ష్మమ్మ,పోలినాయుడు చెరువు
పరిశీలన జరిపి తొలగిస్తాం
అంగన్‌వాడీ కార్యకర్తకు పింఛన్ మంజూరు చేసిన విషయం తెలియదు. పరిశీలన చేసి ఆమె పేరును తొలగిస్తాం. అనర్హుల పేర్లను గుర్తించి చర్యలు తీసుకుంటాం.
–బుచ్చినాయుడు, పంచాయతీ కార్యదర్శి, బుచ్చిరెడ్డిపాళెం