దెబ్బమీద దెబ్బ | kadapa district in heavy winds | Sakshi
Sakshi News home page

దెబ్బమీద దెబ్బ

Published Thu, Apr 30 2015 3:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

kadapa district in heavy winds

సాక్షి, కడప: జిల్లాలోని పులివెందుల ప్రాంతంలోని లింగాల మండలంలో బుధవారం రాత్రి వీచిన గాలులకు తమలపాకు తోటలతోపాటు అరటి తోటలు నిలువునా నేలకూలాయి. గెలలు వేసిన సమయంలో ఇలా జరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అలాగే చిన్నమండెం, సంబేపల్లె, గాలివీడు మండలాల్లో పెనుగాలుల ధాటికి మామిడికాయలు నిలువునా రాలిపోయాయి. ఇక్కడ కూడా భారీ పంటనష్టం జరిగింది. ఇటీవల కురిసిన వడగండ్ల వాన దెబ్బకు కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతన్న ప్రస్తుతం వీచిన గాలులతో నష్టాల్లో కూరుకుపోయాడు.
 
పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రొద్దుటూరు నియోజకవర్గపరిధిలోని రాజుపాళెం, పులివెందుల నియోజకవర్గ పరిధిలోని తొండూరుతోపాటు జిల్లాలోని అనేకమండలాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. పెనుగాలుల ధాటికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో ముందుజాగ్రత్తగా ట్రాన్స్‌కో అధికారులు సరఫరాను నిలిపి వేశారు. పెనుగాలుల ధాటికి రాజుపాళెం మండలంలో గడ్డివాములు, కొట్టాలు, రేకులషెడ్లు, ఇతర ఇళ్లు కూలిపోయాయి. అలాగే పలుస్తంభాలు నేలకూడంతో అంధకారం నెలకొంది.
 
కడప-పులివెందుల రహదారిలో స్తంభించిన ట్రాఫిక్

కడప-పులివెందుల ప్రధాన రహదారిలో బుధవారం రాత్రి వర్షం, గాలులతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రహదారిలో ఎక్కడ చూసినా కంప రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగింది. ప్రధానంగా చీమలపెంట-పెండ్లిమర్రి మధ్యలో తాటి చెట్లు నిట్టనిలువునా కూలిపోయాయి. ఈ కారణంగా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో స్థానికులు వాహనాలను దారి మళ్లించారు. ఒకవైపు రోడ్డును పూర్తి స్థాయిలో మూసివేశారు. ఎక్కడ చూసినా రోడ్డు వెంబడి గాలివానకు చెట్లను కూలిపోయాయి. అలాగే బద్వేలు ప్రాంతంలో కూడా చెట్లు కూలడంతో పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయి ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఊహించని పరిణామానికి జిల్లాలో భారీ ఎత్తున నష్టం వాటిల్లినప్పటికీ పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉం
 
చిన్నమండెంలో భారీగా ఈదురు గాలులు
చిన్నమండెం:  మండల పరిధిలోని పడమటికోన, చిన్నర్సుపల్లె, కలిబండ గ్రామాలలో మంగళవారం రాత్రి వచ్చిన ఈదురు గాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మూడు గ్రామాల పరిధిలో సుమారు 3నుంచి 5టన్నుల వరకు మామిడి కాయలు రాలిపోయినట్లు రైతులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపోయిన  రాచరాయుడు, దస్తగిరి, బాబయ్యలతో పాటు మరో 10మందికి పైగా రైతులు కోరుతున్నారు.  పడమటికోన గ్రామం బోరెడ్డిగారిపల్లెకు చెందిన పడమటికోన బాబురెడ్డికి సంబంధించిన పశువుల పాక రేకులు గాలికి కొట్టుకుపోయాయి.
 
బద్వేలులో పెనుగాలి బీభత్సం
బద్వేలు అర్బన్: బద్వేలులో బుధవారం రాత్రి పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతోపాటు వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఓ మోస్తరు వర్షానికే డ్రైనేజీలు ఉప్పొంగి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి భారీగా పెనుగాలులు వీచడంతో పట్టణంలోని జాంబవంతనగర్, గౌరీ శంకర్‌నగర్, దర్గా వీధులలో పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. అంతేగాకుండా పెనుగాలి ధాటికి  జాంబవంత నగర్‌లో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే సుమిత్రానగర్‌లో ఓ షెడ్డుకు చెందిన రేకులు గాలికి ఎగిరిపోయాయి.  అలాగే మున్సిపాలిటీ పరిధిలోని తొట్టిగారిపల్లె, చెముడూరు, వల్లెలవారిపల్లెల లో పెనుగాలి ధాటికి పశువుల పాకలు కూలిపోయాయి. చాలా సంవత్సరాల తర్వాత బద్వేలులో వడగండ్లతో కూడిన వర్షం పడింది.
 
రాజుపాళెం మండలంలో గాలీ, వాన బీభత్సం
రాజుపాళెం: మండలంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా గాలి వాన కొద్దిసేపు బీభత్సం సృష్టించాయి. రాజుపాళెంలో హోటల్ మాపీరాకు చెందిన ఇంటిపైకప్పు లేచిపోయింది. ఇంట్లో వస్తువులన్నీ దెబ్బతిన్నాయి. దాదాపు రూ.30 వేలు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. అలాగే కొత్తకొట్టాలలో చెట్లు పడిపోయాయి. ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న సూచికబోర్డు, పక్కనే ఉన్న ఇంకో బోర్డు నేలవాలాయి. పోలీస్‌స్టేషన్‌లో చెట్లు విరిగాయి. గాదెగూడూరు గ్రామంలో మనోహర్, రాముడులకు చెందిన రెండు వాములు గాలులకు లేచిపోయాయి.

పోలా వెంగల్‌రెడ్డికి చెందిన రేకులు లేచి గేదెలపై పడటంతో వాటికి గాయాలయ్యాయి. రాజాకు చెందిన గడ్డివామి గాలికి లేచి పక్కనే పొయ్యి ఉండడంతో పూర్తిగా కాలిపోయింది. దాదాపు రూ.35 వేలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.  కొట్టాల గ్రామంలో గాలులకు 10 విద్యుత్ స్తంభాలు, వైర్లు నేలవాలాయి. మునెయ్యకు చెందిన వామి గాలులకు లేచిపోయి రెండు దూడలపై పడిపోయింది. ఈదురు గాలులకు కొర్రపాడు-గోపవరం ప్రధాన రహదారి మధ్యలో పత్తికట్టె వచ్చి పడింది. తహశీల్దార్ భాస్కరరెడ్డి సమాచారం తెలుసుకొని ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement