సాక్షి, గుంటూరు : జిల్లాలో నేడు రవాణా వ్యవస్థ నిలిచిపోనుంది. 2014 రోడ్ సేఫ్టీ బిల్‌కు ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీకి, వాహన యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ట్రేడ్ యూనియన్ నాయకులు మండిపడుతున్నారు.కేంద్రం వైఖరికి నిరసనగా జిల్లాలోని అనేక ట్రేడ్ యూనియన్‌లు బుధవారం రాత్రి సమ్మెకు పిలుపునిచ్చాయి.
దీంతో గురువారం జిల్లాలో లారీలు, ఇతర వాహనాలు రోడ్లపైకి రాకుండా నిలిచిపోనున్నాయి. ఈ సమ్మెలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఎమ్‌ఎస్, హెచ్‌ఎమ్‌ఎస్, లారీ ఓనర్స్ అసోసియేషన్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫెడరేషన్‌లతోపాటు మరికొన్ని ట్రేడ్ యూనియన్‌లు మద్దతు పలుకుతున్నాయి. సమ్మె కారణంగా జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుండడంతో వ్యాపారులు, ప్రజలు రాత్రికి తమ సరుకులను చేర్చుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుంటూరు ఉప రవాణాశాఖ అధికారి కార్యాలయంలో ఉద్యోగులు గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
నిలిచిపోనున్న రవాణా వ్యవస్థ..!
Published Thu, Apr 30 2015 4:42 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement