కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు
నిత్యం కొన్ని పత్రికలు ఆ నేతల మాటలను ప్రచురిస్తున్నాయి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే
ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి వినతి
ప్రభుత్వ ఉద్యోగులు ఈనాడు పత్రికను బహిష్కరించాలని పిలుపు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను నిత్యం కొన్ని పత్రికలు ప్రచురిస్తున్నాయని తెలిపారు.
ఆయా పత్రికల క్లిప్పింగులను కూడా మీనాకు అందజేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తనను సస్పెండ్ చేశారని.. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొన్ని ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యలు కూడా ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘన కిందకే వస్తాయని వెంకట్రామిరెడ్డి వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఈనాడు తప్పుడు కథనాల వల్లే..
మార్చి 31న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ హోదాలో తాను వైఎస్సార్ జిల్లాలో ఏపీపీటీడీ ఉద్యోగులను కలిసి వారి సమస్యలపై చర్చించానని వెంకట్రామిరెడ్డి తెలిపారు. అయితే అదే రోజు ఈనాడు పత్రిక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే ఉద్యోగులు మునిగిపోయారంటూ ఒక తప్పుడు కథనం ప్రచురించిందన్నారు.
ఈ కథనాన్ని తాను ఖండిస్తూ విలీనం వల్ల ఉద్యోగులకు మేలే జరిగిందని.. ఉద్యోగుల గురించి తప్పుడు కథనాలు రాయొద్దని పత్రికా ప్రకటన విడుదల చేశానని తెలిపారు. దీంతో తనపై కక్ష కట్టిన ఈనాడు ఏప్రిల్ 2న తాను ఉద్యోగులతో మాట్లాడుతున్న ఫొటోను ప్రచురించి.. ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నానని తప్పుడు కథనం రాసిందన్నారు. ఈ కథనం ఆధారంగా తమపైన నాలుగు కేసులు పెట్టడంతోపాటు 11 మందిని సస్పెండ్ చేశారని వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ పత్రికలు విష పురుగులు
కొన్ని పత్రికలు రోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాల నాయకులతో మాట్లాడిస్తున్నాయని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు. ప్రభుత్వం ఉద్యోగులకు మంచి చేసింది అంటే తప్పు.. ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది అంటే అది కరెక్టా? అది కోడ్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వార్తలు రాయడమంటే ఇదేనా అని ధ్వజమెత్తారు.
కొంతకాలంగా ఆ పత్రికలు తమకు నచ్చిన వారికి మేలు చేయడమే లక్ష్యంగా కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ పత్రికలు విష పురుగులతో సమానమన్నారు. ఎయిడ్స్, కరోనా లాంటివే ఈ పత్రికలు కూడా అని పేర్కొన్నారు. ఆ వ్యాధులకు మందు కనుక్కున్నారు కానీ ఈ పత్రికలకు మాత్రం మందు కనుక్కోలేకపోతున్నారన్నారు. ఉద్యోగుల సమాఖ్య తరఫున ఈనాడును బహిష్కరిస్తున్నామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment