సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణ ఆర్టీసీకి తిరిగి జవసత్వాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కీలక సూచన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల నిర్వహణ ఒక సంస్థే పర్యవేక్షిస్తే అది ఎప్పటికీ బాగుపడదని, హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను విడిగా చూసినప్పుడే పరిస్థితి మెరుగుపడుతుందని కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఇందుకోసం లండన్ మోడల్‌ను తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ సిటీ వరకు లండన్ మోడల్‌ను నిర్వహిస్తే సిటీలో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతోపాటు ఆర్టీసీపై సిటీ భారం తొలగిపోయి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో బస్సుల నిర్వహణ గాడిలో పడుతుందని కమిటీ తన సిఫారసులో ఖరారు చేసినట్లు తెలిసింది. త్వరలో దీన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమైంది.
ఏమిటీ లండన్ మోడల్...?
ప్రపంచ పట్టణ రవాణాలో లండన్ నగరాన్ని ఉత్తమంగా పేర్కొంటారు. అక్కడ సిటీ బస్సులు, ట్రామ్ సర్వీసులు, మెట్రో రైలు వ్యవస్థతోపాటు ఇతర రవాణా వ్యవస్థలు ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయి. వాటన్నింటినీ నగర మేయర్ పర్యవే క్షిస్తారు. లండన్ ప్రజలు మంచినీటి సరఫరా కంటే రవాణా వ్యవస్థకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. రవాణా వ్యవస్థ గాడి తప్పితే మేయర్ సీటులో ఉన్న వ్యక్తి చీత్కారాలు ఎదుర్కోవాల్సిందే. వెరసి అక్కడ రవాణా వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది.
హైదరాబాద్ సిటీలో కూడా అదే తరహా వ్యవస్థ అవసరమని కమిటీ సిఫారసులో పేర్కొంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 3,800 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఇటీవలే రెండు కారిడార్ల మెట్రో రైలు సేవలు మొదలయ్యాయి. దాదాపు దశాబ్దంన్నర నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పరుగుపెడుతున్నాయి. కానీ ఈ మూడు ప్రధాన రవాణా సాధనాలు మూడు సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇలా కాకుండా వాటిని ఒకే సంస్థ పర్యవేక్షించేలా చూడాలని, ఆ బాధ్యత ఆర్టీసీ కాకుం డా హైదరాబాద్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ తరహాలో ఓ వ్యవస్థ పర్యవేక్షించాలని కమిటీ తేల్చింది.
ఒకే పరిధిలో ఉండటం వల్లే సమస్యలు...
హైదరాబాద్ సిటీలో బస్సుల నిర్వహణకు, జిల్లాల్లో బస్సుల నిర్వహణకు చాలా తేడా ఉంటుంది. వాటిని ఒకేలా పర్యవేక్షిస్తుండటంతో ఆర్టీసీకి సమస్యలు వస్తున్నాయని కమిటీ తేల్చింది. జిల్లా బస్సు సర్వీసులు పకడ్బందీగా కొనసాగాలంటే ఆర్టీసీపై సిటీ బస్సుల నిర్వహణ భారం ఉండరాదని తేల్చింది. ప్రస్తుతం కర్ణాటకలో బెంగళూరు మహానగర ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఉంది. సిటీ బస్సులను అదే నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని ముఖ్య నగరాలతో పోలిస్తే బెంగళూరులో సిటీ బస్సుల నిర్వహణ మెరుగ్గా ఉంది. దీనికి ఈ ప్రత్యేక వ్యవస్థే కారణం. హైదరాబాద్‌లో కూడా అలాంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి మెట్రో రైలు, ఎంఎంటీఎస్ రైళ్లను దాని పరిధిలోకి తీసుకోవాలనేది కమిటీ అభిప్రాయం.
అమలు కష్టమే..
నిపుణుల కమిటీ చేసిన సిఫారసు అమలు ఎంతవరకు సాధ్యమనే విషయంలో సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థ కనుసన్నల్లో కొనసాగుతోంది. దాన్ని ప్రభుత్వం తీసుకోవడం అంత సులభం కాదు. ఇక ఎంఎంటీఎస్ రైళ్లను రైల్వేశాఖ పర్యవేక్షిస్తోంది. వాటిని రైల్వే నుంచి విడదీసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్రం అంగీకరించాల్సి ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి తదనుగుణంగా ప్రయత్నిస్తే అది అసాధ్యం కాదని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment