గ్రూప్‌–2 అభ్యర్థులకు ‘ఫొని’ ఎఫెక్ట్‌ | Cyclone Fani Attack On Group 2 Screening test candidates | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 అభ్యర్థులకు ‘ఫొని’ ఎఫెక్ట్‌

Published Sat, May 4 2019 4:13 AM | Last Updated on Sat, May 4 2019 4:13 AM

Cyclone Fani Attack On Group 2 Screening test candidates  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గుంటూరు: ఫొని తుపాను ప్రభావం గ్రూప్‌–2 స్క్రీనింగ్‌ పరీక్ష రాస్తున్న అభ్యర్థులపై పడింది. 446 గ్రూప్‌–2 పోస్టులకు ఈ నెల 5న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2.95 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఫొని తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే దాదాపు 80 రైళ్లను రద్దు చేసింది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తుపాను ప్రభావం ఎక్కువ ఉన్న ఉత్తరాంధ్రలో అభ్యర్థుల కష్టాలు అన్నీఇన్నీ కావు. 

రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం
చాలా మంది అభ్యర్థులు హైదరాబాద్, విశాఖ తదితర నగరాల్లో కోచింగ్‌ తీసుకున్నారు. గ్రూప్‌–2 పరీక్షకు హాజరయ్యేందుకు తమ సొంత జిల్లాలకు చేరుకోవడానికి వీరంతా రైళ్లు, బస్సులకు రిజర్వేషన్‌ చేయించుకున్నారు. ఫొని తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే 80 వరకు రైళ్లను రద్దు చేసింది. రోడ్డు మార్గంలో చేరుకోవాలన్నా ఉత్తరాంధ్ర సహా తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా తుపాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలు, తీర ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగానికి సెలవులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌–2కు దరఖాస్తు చేసుకున్న వీఆర్‌వో, వీఆర్‌ఏ, కానిస్టేబుళ్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు పరీక్షకు దూరం కావాల్సిన పరిస్థితి. 

పరీక్ష వాయిదా వేయాలి
అభ్యర్థులు తమ సొంత జిల్లాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించడం ఏపీపీఎస్సీ నియంతృత్వ ధోరణికి నిదర్శనం. పరీక్షలను వెంటనే వాయిదా వేసి అందరూ హాజరయ్యే విధంగా మళ్లీ నిర్వహించాలి. 
– సమయం హేమంత్‌ కుమార్,ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు

పరీక్ష కేంద్రాలకు వెళ్లడం కష్టమే
మాది కొత్తపాలెం గ్రామం. నేను గ్రూప్‌–2 పరీక్ష రాయాల్సిన కేంద్రం టెక్కలిలో ఉంది. తుపాను నేపథ్యంలో మా ప్రాంతంలో రవాణాకు తీవ్ర అంతరాయం నెలకొంది. పరీక్ష వాయిదా వేస్తే బాగుంటుంది. 
– జి.లక్ష్మి, గ్రూప్‌–2 అభ్యర్థిని, శ్రీకాకుళం జిల్లా

ప్రైవేట్‌ రవాణా ఏర్పాటు చేసుకోవాలన్నారు
ఫొని తుపానుతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కోరగా ఆయన ప్రైవేట్‌ రవాణా ఏర్పాటు చేసుకుని పరీక్షకు హాజరుకావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
– ఎస్‌.మహబూబ్‌ బాషా, ఏపీ నిరుద్యోగ జేఏసీ వ్యవస్థాపకుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement