రోడ్లకు రూ.7,332 కోట్ల వ్యయం
మౌలిక వసతుల కల్పనపై సీఆర్‌డీఏ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో తొలిదశ రహదారుల నిర్మాణానికి రూ.7,332 కోట్లు అవసరమని సీఆర్‌డీఏ అంచనా వేసింది. రాజధానిలో తొలి దశలో మౌలిక వసతుల కల్పన కోసం ఏ రంగానికి ఎంత వ్యయం అవుతుందనే అంశంపై సీఆర్‌డీఏ అంచనాలను రూపొందించి, ఆ మేరకు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఆర్వోడబ్ల్యూ రోడ్లు ఉండగా భూగర్భ కేబుళ్ల ఏర్పాటు నిమిత్తం చేపట్టే సొరంగ నిర్మాణాన్ని కూడా రోడ్ల విభాగంలోనే చేర్చారు. ఈ రహదారుల నిర్మాణానికి ఒక్కో కిలోమీటర్‌కు రూ.7 కోట్ల చొప్పున వ్యయమవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది.
భూగర్భ కేబుళ్ల కోసం 306 కిలోమీటర్ల మేర టన్నల్ నిర్మాణానికి ఒక్కో కిలోమీటర్ టన్నల్‌కు రూ.8 కోట్ల చొప్పున వ్యయం అవుతుందని పేర్కొంది. ఇక మంచినీటి సరఫరాకు రూ.1,637 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది. ఇందుకోసం వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, నీటి నిల్వ రిజర్వాయర్లు, నీటి పంపిణీ నెట్ వర్క్, అటోమేటిక్ కంట్రోల్ అండ్ కమాండ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వృధా నీటి నిర్వహణ పనులకు రూ.2,562 కోట్ల వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. స్మార్ట్ విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ ఏర్పాటునకు రూ.7,500 కోట్లు ఖర్చవుతాయని ప్రతిపాదించింది. 1,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి ఒక్కో మెగావాట్‌కు రూ.5 కోట్ల చొప్పున రూ.7,500 కోట్ల వ్యయం అవుతుందని వివరించింది. రాజధాని ప్రాంతంలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీ మౌలిక సదుపాయాల కల్పన కోసం 600 కోట్లు, నిఘా వ్యవస్థ ఏర్పాటునకు రూ.50 కోట్లు, ఇంటిలిజెంట్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ఏర్పాటునకు రూ.300 కోట్లు వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ పేర్కొంది.