ప్రధాన డిమాండ్లు
⇒35 శాతం వేతన పెంపు
⇒ఒక విభాగం నుంచి మరో విభాగానికి సిబ్బందిని బదిలీ చేయడానికి వీలుగా నూతన పాలసీ రూపకల్పన
⇒ఎనిమిది గంటల పని
⇒ఆరునెలల శిక్షణ కాలం తర్వాత కచ్చితంగా ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి.
⇒శిక్షణ కాలంలో రూ.18 వేల గౌరవవేతనం
⇒విశ్రాంత రవాణాశాఖ ఉద్యోగులకు కనిష్టంగా రూ.10 వేల పింఛన్, రూ.10 లక్షల వరకూ జీవితబీమా పాలసీ
⇒ఉన్నతాధికారుల తనిఖీల్లో టికెట్టు లేని ప్రయాణికులు పట్టుబడినప్పుడు కండక్టర్‌పై చర్యలు తీసుకోకూడదు.
బెంగళూరు : అటు కార్మిక సంఘాల్లోను ప్రభుత్వంలోను పట్టువిడుపులు లేకపోవడంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. తొలిరోజు కేఎస్ ఆర్టీసీ సమ్మె పూర్తిగా విజయవంతమైంది. తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందే నంటూ కార్మికులు పట్టుబట్టగా ముందు సమ్మె విరమించండి ఆ తరువాత డిమాండ్ల గురించి ఆలోచిస్తాం అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి చెప్పడంతో ఆర్టీసీ కార్మికులు స్పందించలేదు. 35 శాతం వేతన పెంపు అసాధ్యమంటూ సోమవారం మంత్రి రామలింగారెడ్డి మీడియాతో అన్నారు. ఇదిలా ఉంటే ఆదివారం అర్ధరాత్రి నుంచి కేఎస్ ఆర్టీసీ సిబ్బంది సమ్మెలోకి వెళ్లిపోవడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో లక్షల మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు ప్రైవేట్ రవాణా సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నారు. వేతన సవరణతో ఇతర డిమాండ్లు పరిష్కరించాలని 1.25 లక్షల మంది సిబ్బంది ఒక్కసారిగా సమ్మె చేస్తుండటంతో 23 వేల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో సగటున రోజు ప్రభుత్వానికి రూ. 21 కోట్ల ఆదాయం గండిపడింది. ఇదిలా ఉండగా సమ్మె సందర్భంగా కొంతమంది దినసరి వేతనంపై కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో కొన్ని చోట్ల బస్సులను నడపడానికి ప్రయత్నించగా ఆందోళకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో పదిమందికి గాయాలు కాగా 142 బస్సులు ధ్వంసమయ్యాయి. ఒక్కరోజే రూ. 12 లక్షల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి.
ప్రైవేటు దోపిడీ :
రెండు రోజుల పాటు ప్రైవేట్ రవాణాకు అనుమతి ఇవ్వడంతో వారు అందినకాడికి దోచుకున్నారు. వివిధ ఉపాధి, ఉద్యోగ నిమిత్తం పల్లెల నుంచి బెంగళూరు, మైసూరు, మంగళూరు వంటి నగరాలకు వచ్చేవారు ప్రైవేట్ బస్సులపైకి ఎక్కి గమ్యస్థానాలకు చేరుకోవడం కనిపించింది. ఇక వివిధ పట్టణాల్లో ఆస్పత్రులకు వచ్చే వారి పరిస్థితి వర్ణనాతీతం. సమ్మె విషయం తెలిసిన కొంతమంది రోగులు వారి సహాయకులతో ఆదివారం రాత్రికే ఆయా నగరాల బస్టాండ్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి వెళ్లేందుకు రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లకు రెట్టింపు చార్జీలు చెల్లించి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు బెంగళూరు శివారులోని అత్తిబెలె నుంచి ఫోరంమాల్ వరకూ సాధారణ రోజుల్లో రూ.35 వసూలు చేసే ప్రైవేటు బస్సులు సోమవారం ఒక్కొక్కరి నుంచి రూ.87 వసూలు చేసింది. ఇక ఆటోవాలాలు ఇదే అదనుగా తీసుకుని రూ. 200 నుంచి 800 వరకు వసూలు చేశారు. ఇక సమ్మె నేపథ్యంలో మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
మెట్రోకు పెరిగిన డిమాండ్...
సమ్మెలో భాగంగా బెంగళూరులో బీఎంటీసీ సేవలు కూడా నిలిచిపోవడంతో ‘మెట్రో’కు డిమాండ్ పెరిగింది. తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి మెట్రోరైలును ఆశ్రయించే ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బీఎంఆర్‌సీఎల్ అధికారులు ప్రతి ఆరు నిమిషాలకు ఒక మెట్రో రైలును ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ఉన్న మెట్రో సేవలను మరో గంట పాటు పెంచుతూ 11 గంటల వరకూ అందబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
అదనపు సర్వీసుల ఆలోచనలో...
బెంగళూరులోని ‘శాంతలా సిల్క్స్’ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ సంస్థలు బస్సు సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. సమ్మె ప్రభావం తమ సేవలపై కొంత మేర ప్రభావం చూపుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శాంతలా శిల్క్స్ చేరుకోవడానికి బీఎంటీసీ బస్సులు లేకపోవడంతో కొంతమంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.
దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు మరోరెండురోజుల పాటు ఇక్కడి పరిస్థితులను చూసి ఏపీఎస్ ఆర్టీసీ అదనపు సర్వీసులను నడిపే ఆలోచనలో ఉంది. సాధారణంగా ప్రయాణాలను ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ వాయిదా వేసుకోలేరని అందువల్ల మరో రెండు రోజుల తర్వాత సాధారణం కంటే ఎక్కువగానే ప్రయాణికులు వస్తారని ఇక్కడి అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నారు. అదే గనుక జరిగితే అదనపు సర్వీసులను కూడా నడిపే ఆలోచన ఉందని ఏపీఎస్‌ఆర్టీసీ బెంగళూరు విభాగం ఏటీఎం రవీంద్ర తెలిపారు.
కార్మికులతో చర్చలు జరపాలి : మాజీ సీఎం కుమార
మైసూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కార్మికులకు వేతనాలు పెంచితే సంస్థ నష్టాలపాలవుతుందని చెబుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందు సంస్థలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేతనాలు పెంచాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా పెడచెవిన పెట్టడంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారని పేర్కొన్నారు. ఇంధన ధరలు తగ్గినపుడు టికెట్ ధరలను తగ్గించ కుండా అటు ప్రజల్లోనూ, వేతనాలు పెంచకుండా ఇటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు.
పట్టు వీడం..
Published Tue, Jul 26 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
Advertisement