pay raise
-
బాత్రూముల్లో కంపు.. ట్విట్టర్ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్న మస్క్
వాషింగ్టన్: ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచీ సిబ్బందికి చుక్కులు చూపుతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నిర్వాకాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఓవైపు పొదుపు చర్యలకు దిగుతుంటే పారిశుధ్య సిబ్బంది వేతన పెంపుకు డిమాండ్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి వారందరినీ పీకిపడేశారు. దాంతో సరైన నిర్వహణ లేక బాత్రూములన్నీ భరించలేనంత కంపు కొడుతున్నాయని సిబ్బంది మొత్తుకుంటున్నారు. చివరికి వాటిలో టాయ్‌లెట్ పేపర్లకు కూడా దిక్కు లేదట! వాటిని ఇంటి నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. పలు నగరాల్లోని ట్విట్టర్ కార్యాలయాల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా కరువయ్యారట! నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఉద్యోగులందరినీ రెండంతస్తుల్లోనే కుక్కి నాలుగింటిని ఖాళీ చేశారట. సియాటిల్, శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయ భవనాలకు అద్దె చెల్లించడం కూడా ఆపేశారు. సిబ్బందిని వీలైనంత వరకూ వర్క్ ఫ్రం హోం చేయాలని చెబుతున్నారు. ట్విట్టర్ సిబ్బందిలో సగం మందిని తీసేయడం తెలిసిందే. టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సొంత కంపెనీల నుంచి సిబ్బందిని ట్విట్టర్‌కు మస్క్ తరలిస్తున్నారట! -
జీతాలు పెంచొద్దంటూ డాక్టర్ల ఆందోళన
అటావా : సాధారణంగా ఉద్యోగులు తమకు జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతారు. కదా.. కానీ కెనడియన్ డాక్టర్లు మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించారు. తమ జీతాల పెంపును నిరసిస్తూ ఆదోళనకు దిగారు. తమకు ఎక్కువ జీతాలు వద్దు అంటూ వందలాది మంది వైద్య సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 700మందికి పైగా డాక్లర్లు, ఇతర సిబ్బంది ఈ మేరకు ఒక బహిరంగ లేఖను రాశారు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, రోగుల అవసరాలను తీర్చడానికి వినియోగించాలని లేఖలో డిమాండ్ చేశారు. దీంతో పాటు నర్సులపై పడుతున్న పనిభారాన్ని, ప్రజలకు అవసరమైన వైద్య సౌకర్యాలను ప్రాధాన్యతను పేర్కొంటూ ఈ లేఖను రాయడం విశేషంగా నిలిచింది. మెడికల్ ఫెడరేషన్ చేపట్టిన ఇటీవలి జీతాల పెంపును క్యూబెక్ వైద్యులు వ్యతిరేకించారు. 213 జనరల్ ప్రాక్టీషనర్స్, 184 స్పెషలిస్టులు, 149 రెసిడెంట్ మెడికల్ డాక్టర్లు, 162 మంది మెడికల్ విద్యార్థులు తమ పెరిగిన జీతాలను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నర్సులు, రోగులు బాధలు పడుతున్నపుడు తమకు జీతాల పెంపు ఎందుకంటూ ప్రశ్నించారు. నర్సులు, క్లర్కులు సహా ఇతర ఉద్యోగులు అనేక కష్టాలను అనుభవిస్తున్న తరుణంలో తమకు జీతాల పెంపు వద్దని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. వివిధ దేశాలలోని అనేకమంది నర్సులు చాలా తక్కువ వేతనం కోసం ఎక్కువ గంటలు పని చేస్తారు. అయితే, కెనడాలో ఒక సోషలిస్టు ప్రజా ఆరోగ్య వ్యవస్థలో కూడా నర్సులు తక్కువ వనరులతో ఎక్కువ పనిగంటలు పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. పనిభారంతో నర్సులు బాగా అలసిపోతున్నారని, దీర్ఘకాలంగా సిబ్బంది కొరత కారణంగా ఓవర్ టైం(కొన్నిసార్లు కచ్చితంగా) పనిచేయాల్సి వస్తోందని తమ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఇటీవల ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యల కారణంగా సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక రోగులు సతమతమవుతున్నారని వారు తమ లేఖలో పేర్కొన్నారు. అంతిమంగా ఇది రోగి సంరక్షణా భాధ్యత మీద ప్రభావం చూపుతుందని వైద్యులు వాదించారు. తమకు ప్రజా వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉందనీ, పెరిగిన తమ జీతాలను రద్దు చేసి, వాటిని ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
రైట్..రైట్
12.5 శాతం వేతన పెంపునకు సర్కార్ అంగీకారం సమ్మె విరమించిన ఆర్టీసీ ఉద్యోగులు కదిలిన బస్సులు బెంగళూరు: అటు రాష్ట్ర రవాణాశాఖ ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం పట్టు సడలించడంతో బుధవారం ‘బస్సు’ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో మూడు రోజులుగా ప్రభుత్వ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 35 శాతం వేతన పెంపు ప్రధాన డిమాండ్‌గా ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర రవాణాశాఖలోని నాలుగు విభాగాలకు చెందిన 1.25 లక్షల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. మొదట్లో 8 శాతం అటుపై 10 శాతం కంటే వేతన పెంపు సాధ్యం కాదని చెప్పిన ప్రభుత్వం.,. బుధవారం సాయంత్రం ఉద్యోగుల సంఘం నాయకులతో జరిపిన చర్చల అనంతరం 12.5 శాతం పెంచడానికి అంగీకరించింది. 35 శాతం కంటే తక్కువకు ఒప్పుకునేది లేదని చెబుతూ వస్తున్న ఉద్యోగ సంఘం నాయకులు కూడా పట్టు సడలించి ప్రభుత్వ సూచనకు ఒప్పుకున్నారు. దీంతో మూడు రోజులుగా జరుగుతున్న సమ్మెకు తెరపడింది. ఫలితంగా బెంగళూరు సీటీ సర్వీసులైన బీఎంటీసీ బస్సులు బుధవారం సాయంత్రం నుంచే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా మిగిలిన మూడు విభాగాలకు చెందిన బస్సులు గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇక మూడు రోజులుగా విధులకు గైర్హాజరైన ఉద్యోగుల జీతాల్లో కోత వేస్తున్నట్లు కేఎస్ఆర్టీసీ ఎం.డీ రాజేంద్రకుమార్ కటారియా తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమ్మె వల్ల రోజుకు సగటున రూ.21 కోట్ల లెక్కన మూడు రోజులకు దాదాపు రూ.63 కోట్ల ఆదాయానికి గండిపడినట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. -
పట్టు వీడం..
ప్రధాన డిమాండ్లు ⇒35 శాతం వేతన పెంపు ⇒ఒక విభాగం నుంచి మరో విభాగానికి సిబ్బందిని బదిలీ చేయడానికి వీలుగా నూతన పాలసీ రూపకల్పన ⇒ఎనిమిది గంటల పని ⇒ఆరునెలల శిక్షణ కాలం తర్వాత కచ్చితంగా ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. ⇒శిక్షణ కాలంలో రూ.18 వేల గౌరవవేతనం ⇒విశ్రాంత రవాణాశాఖ ఉద్యోగులకు కనిష్టంగా రూ.10 వేల పింఛన్, రూ.10 లక్షల వరకూ జీవితబీమా పాలసీ ⇒ఉన్నతాధికారుల తనిఖీల్లో టికెట్టు లేని ప్రయాణికులు పట్టుబడినప్పుడు కండక్టర్‌పై చర్యలు తీసుకోకూడదు. బెంగళూరు : అటు కార్మిక సంఘాల్లోను ప్రభుత్వంలోను పట్టువిడుపులు లేకపోవడంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. తొలిరోజు కేఎస్ ఆర్టీసీ సమ్మె పూర్తిగా విజయవంతమైంది. తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందే నంటూ కార్మికులు పట్టుబట్టగా ముందు సమ్మె విరమించండి ఆ తరువాత డిమాండ్ల గురించి ఆలోచిస్తాం అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి చెప్పడంతో ఆర్టీసీ కార్మికులు స్పందించలేదు. 35 శాతం వేతన పెంపు అసాధ్యమంటూ సోమవారం మంత్రి రామలింగారెడ్డి మీడియాతో అన్నారు. ఇదిలా ఉంటే ఆదివారం అర్ధరాత్రి నుంచి కేఎస్ ఆర్టీసీ సిబ్బంది సమ్మెలోకి వెళ్లిపోవడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో లక్షల మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు ప్రైవేట్ రవాణా సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నారు. వేతన సవరణతో ఇతర డిమాండ్లు పరిష్కరించాలని 1.25 లక్షల మంది సిబ్బంది ఒక్కసారిగా సమ్మె చేస్తుండటంతో 23 వేల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో సగటున రోజు ప్రభుత్వానికి రూ. 21 కోట్ల ఆదాయం గండిపడింది. ఇదిలా ఉండగా సమ్మె సందర్భంగా కొంతమంది దినసరి వేతనంపై కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో కొన్ని చోట్ల బస్సులను నడపడానికి ప్రయత్నించగా ఆందోళకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో పదిమందికి గాయాలు కాగా 142 బస్సులు ధ్వంసమయ్యాయి. ఒక్కరోజే రూ. 12 లక్షల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రైవేటు దోపిడీ : రెండు రోజుల పాటు ప్రైవేట్ రవాణాకు అనుమతి ఇవ్వడంతో వారు అందినకాడికి దోచుకున్నారు. వివిధ ఉపాధి, ఉద్యోగ నిమిత్తం పల్లెల నుంచి బెంగళూరు, మైసూరు, మంగళూరు వంటి నగరాలకు వచ్చేవారు ప్రైవేట్ బస్సులపైకి ఎక్కి గమ్యస్థానాలకు చేరుకోవడం కనిపించింది. ఇక వివిధ పట్టణాల్లో ఆస్పత్రులకు వచ్చే వారి పరిస్థితి వర్ణనాతీతం. సమ్మె విషయం తెలిసిన కొంతమంది రోగులు వారి సహాయకులతో ఆదివారం రాత్రికే ఆయా నగరాల బస్టాండ్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి వెళ్లేందుకు రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లకు రెట్టింపు చార్జీలు చెల్లించి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు బెంగళూరు శివారులోని అత్తిబెలె నుంచి ఫోరంమాల్ వరకూ సాధారణ రోజుల్లో రూ.35 వసూలు చేసే ప్రైవేటు బస్సులు సోమవారం ఒక్కొక్కరి నుంచి రూ.87 వసూలు చేసింది. ఇక ఆటోవాలాలు ఇదే అదనుగా తీసుకుని రూ. 200 నుంచి 800 వరకు వసూలు చేశారు. ఇక సమ్మె నేపథ్యంలో మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మెట్రోకు పెరిగిన డిమాండ్... సమ్మెలో భాగంగా బెంగళూరులో బీఎంటీసీ సేవలు కూడా నిలిచిపోవడంతో ‘మెట్రో’కు డిమాండ్ పెరిగింది. తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి మెట్రోరైలును ఆశ్రయించే ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బీఎంఆర్సీఎల్ అధికారులు ప్రతి ఆరు నిమిషాలకు ఒక మెట్రో రైలును ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ఉన్న మెట్రో సేవలను మరో గంట పాటు పెంచుతూ 11 గంటల వరకూ అందబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. అదనపు సర్వీసుల ఆలోచనలో... బెంగళూరులోని ‘శాంతలా సిల్క్స్’ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ సంస్థలు బస్సు సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. సమ్మె ప్రభావం తమ సేవలపై కొంత మేర ప్రభావం చూపుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శాంతలా శిల్క్స్ చేరుకోవడానికి బీఎంటీసీ బస్సులు లేకపోవడంతో కొంతమంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు మరోరెండురోజుల పాటు ఇక్కడి పరిస్థితులను చూసి ఏపీఎస్ ఆర్టీసీ అదనపు సర్వీసులను నడిపే ఆలోచనలో ఉంది. సాధారణంగా ప్రయాణాలను ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ వాయిదా వేసుకోలేరని అందువల్ల మరో రెండు రోజుల తర్వాత సాధారణం కంటే ఎక్కువగానే ప్రయాణికులు వస్తారని ఇక్కడి అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నారు. అదే గనుక జరిగితే అదనపు సర్వీసులను కూడా నడిపే ఆలోచన ఉందని ఏపీఎస్ఆర్టీసీ బెంగళూరు విభాగం ఏటీఎం రవీంద్ర తెలిపారు. కార్మికులతో చర్చలు జరపాలి : మాజీ సీఎం కుమార మైసూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కార్మికులకు వేతనాలు పెంచితే సంస్థ నష్టాలపాలవుతుందని చెబుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందు సంస్థలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేతనాలు పెంచాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా పెడచెవిన పెట్టడంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారని పేర్కొన్నారు. ఇంధన ధరలు తగ్గినపుడు టికెట్ ధరలను తగ్గించ కుండా అటు ప్రజల్లోనూ, వేతనాలు పెంచకుండా ఇటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. -
‘మీ సేవ’కులకు 50 శాతం వేతన పెంపు
కొత్త సర్వీస్ ప్రొవైడర్‌గా నెట్ ఎక్స్ఎల్ నియామకం సాక్షి, హైదరాబాద్: ‘మీ సేవ’ కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు (ఆపరేటర్లు, మేనేజర్) 50 శాతం మేర వేతనాలను పెంచినట్లు సుపరిపాలన ప్రత్యేక కమిషనర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 అధీకృత కేంద్రాల్లోని ఉద్యోగులకు జూన్ 1 నుంచి వేతన పెంపు వర్తిస్తుం దని పేర్కొన్నారు. ఉద్యోగులకు ప్రతినెల మొదటి వారంలోనే వేతనాలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. అలాగే హైదరాబాద్‌లోని మీ సేవ కేంద్రాల్లో పని చేస్తున్న ఆపరేటర్లకు రోజుకు 125 లావాదేవీలు, జిల్లాల్లో పని చేస్తున్న ఆపరేటర్లకు రోజుకు 75 లావాదేవీలను లక్ష్యాలుగా నిర్దేశించామని తెలిపారు. ఉద్యోగుల ఉత్పాదకతపై మూడు నెలలకోసారి సమీక్ష జరపాలని నిర్ణయించామన్నారు. గత సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్ట్ గడువు మే 31తో ముగిసినందున, కొత్తగా నెట్ ఎక్స్ఎల్ సంస్థను నియమించామని వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. ఉద్యోగ భద్రతపై తొలగని ఆందోళన: మరోవైపు ఉద్యోగులకు వేతన పెంపు నిర్ణయం కొంత మేరకు సంతృప్తి ఇచ్చినప్పటికీ, ఉద్యోగ భద్రత విషయమై ఆందోళన మాత్రం తొలగలేదని మీ సేవ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు జెన్నీఫర్ తెలిపారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగులుగానైనా సర్కారు గుర్తించాలని డిమాండ్ చేశారు.