అటావా : సాధారణంగా ఉద్యోగులు తమకు జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతారు. కదా.. కానీ కెనడియన్ డాక్టర్లు మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించారు. తమ జీతాల పెంపును నిరసిస్తూ ఆదోళనకు దిగారు. తమకు ఎక్కువ జీతాలు వద్దు అంటూ వందలాది మంది వైద్య సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 700మందికి పైగా డాక్లర్లు, ఇతర సిబ్బంది ఈ మేరకు ఒక బహిరంగ లేఖను రాశారు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, రోగుల అవసరాలను తీర్చడానికి వినియోగించాలని లేఖలో డిమాండ్ చేశారు. దీంతో పాటు నర్సులపై పడుతున్న పనిభారాన్ని, ప్రజలకు అవసరమైన వైద్య సౌకర్యాలను ప్రాధాన్యతను పేర్కొంటూ ఈ లేఖను రాయడం విశేషంగా నిలిచింది.
మెడికల్ ఫెడరేషన్ చేపట్టిన ఇటీవలి జీతాల పెంపును క్యూబెక్ వైద్యులు వ్యతిరేకించారు. 213 జనరల్ ప్రాక్టీషనర్స్, 184 స్పెషలిస్టులు, 149 రెసిడెంట్ మెడికల్ డాక్టర్లు, 162 మంది మెడికల్ విద్యార్థులు తమ పెరిగిన జీతాలను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నర్సులు, రోగులు బాధలు పడుతున్నపుడు తమకు జీతాల పెంపు ఎందుకంటూ ప్రశ్నించారు. నర్సులు, క్లర్కులు సహా ఇతర ఉద్యోగులు అనేక కష్టాలను అనుభవిస్తున్న తరుణంలో తమకు జీతాల పెంపు వద్దని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.
వివిధ దేశాలలోని అనేకమంది నర్సులు చాలా తక్కువ వేతనం కోసం ఎక్కువ గంటలు పని చేస్తారు. అయితే, కెనడాలో ఒక సోషలిస్టు ప్రజా ఆరోగ్య వ్యవస్థలో కూడా నర్సులు తక్కువ వనరులతో ఎక్కువ పనిగంటలు పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. పనిభారంతో నర్సులు బాగా అలసిపోతున్నారని, దీర్ఘకాలంగా సిబ్బంది కొరత కారణంగా ఓవర్ టైం(కొన్నిసార్లు కచ్చితంగా) పనిచేయాల్సి వస్తోందని తమ లేఖలో పేర్కొన్నారు.
అంతేకాదు ఇటీవల ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యల కారణంగా సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక రోగులు సతమతమవుతున్నారని వారు తమ లేఖలో పేర్కొన్నారు. అంతిమంగా ఇది రోగి సంరక్షణా భాధ్యత మీద ప్రభావం చూపుతుందని వైద్యులు వాదించారు. తమకు ప్రజా వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉందనీ, పెరిగిన తమ జీతాలను రద్దు చేసి, వాటిని ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment