12.5 శాతం వేతన పెంపునకు సర్కార్ అంగీకారం
సమ్మె విరమించిన ఆర్టీసీ ఉద్యోగులు
కదిలిన బస్సులు
బెంగళూరు: అటు రాష్ట్ర రవాణాశాఖ ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం పట్టు సడలించడంతో బుధవారం ‘బస్సు’ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో మూడు రోజులుగా ప్రభుత్వ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 35 శాతం వేతన పెంపు ప్రధాన డిమాండ్‌గా ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర రవాణాశాఖలోని నాలుగు విభాగాలకు చెందిన 1.25 లక్షల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. మొదట్లో 8 శాతం అటుపై 10 శాతం కంటే వేతన పెంపు సాధ్యం కాదని చెప్పిన ప్రభుత్వం.,. బుధవారం సాయంత్రం ఉద్యోగుల సంఘం నాయకులతో జరిపిన చర్చల అనంతరం 12.5 శాతం పెంచడానికి అంగీకరించింది. 35 శాతం కంటే తక్కువకు ఒప్పుకునేది లేదని చెబుతూ వస్తున్న ఉద్యోగ సంఘం నాయకులు కూడా పట్టు సడలించి ప్రభుత్వ సూచనకు ఒప్పుకున్నారు.
దీంతో మూడు రోజులుగా జరుగుతున్న సమ్మెకు తెరపడింది. ఫలితంగా బెంగళూరు సీటీ సర్వీసులైన బీఎంటీసీ బస్సులు బుధవారం సాయంత్రం నుంచే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా మిగిలిన మూడు విభాగాలకు చెందిన బస్సులు గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇక మూడు రోజులుగా విధులకు గైర్హాజరైన ఉద్యోగుల జీతాల్లో కోత వేస్తున్నట్లు కేఎస్‌ఆర్టీసీ ఎం.డీ రాజేంద్రకుమార్ కటారియా తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమ్మె వల్ల రోజుకు సగటున రూ.21 కోట్ల లెక్కన మూడు రోజులకు దాదాపు రూ.63 కోట్ల ఆదాయానికి గండిపడినట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.
రైట్..రైట్
Published Thu, Jul 28 2016 2:03 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
Advertisement