మాది ప్రగతిపథం | 111 GO pullout | Sakshi
Sakshi News home page

మాది ప్రగతిపథం

Published Mon, Sep 8 2014 10:23 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

111 GO pullout

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలో ప్రతిరోజు 35 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. నగరీకరణ నేపథ్యంలో భవిష్యత్తులో పెరిగే రద్దీకి అనుగుణంగా రవాణా వ్యవస్థను విస్తృతం చేయనున్నాం. అందుకనుగుణంగా మరిన్ని బస్సు డిపోలను ఏర్పాటు చే యాలని నిర్ణయించాం. గ్రేటర్ పరిధిలో కొత్తగా 9 డిపోలను ఏర్పాటు చేస్తున్నాం.

ముర్తుజాగూడ, కొండాపూర్, దొమ్మరిపోచంపల్లి, తిమ్మాపూర్(మహబూబ్‌నగర్ జిల్లా), నార్సింగి, శంకర్‌పల్లి, ఉప్పర్‌పల్లి, కుత్బుల్లాపూర్, కోహెడలో ప్రతిపాదించిన ఈ డిపోలు ఏడాదిలోగా కార్యరూపం దాలుస్తాయి. ఐదెకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన వీటికి స్థలాలను సేకరిస్తున్నాం.

 చేవెళ్ల, జవహర్‌నగర్, నాదర్‌గుల్, శామీర్ పేటల్లో డిపోలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి కే నిర్వహణలో ఉన్న మహేశ్వరం డిపోకు 60 బస్సులను కేటాయించాం. మిగతా డిపోలకు కూడా కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నాం. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 80 ఏసీ బస్సుల్లో అధికశాతం గ్రేటర్ పరిధిలోనే తిప్పనున్నాం.

 ‘క్యూ’ బాగుంది
 ఇటీవల ముంబై రవాణా వ్యవస్థను అధ్యయనం చేశాం. మాజీ ప్రధాని మొరార్జీదేశాయ్ ప్రవేశపెట్టిన ‘క్యూ’ విధానాన్ని ఇప్పటివరకు అవలంభిస్తుండడం ఆశ్చర్యం కలిగించింది. మెట్రో, లోకల్ రైళ్లు, బస్‌స్టేషన్లను అనుసంధానించడం వల్ల క్రమపద్ధతికి అక్కడి ప్రజలు అలవాటుపడ్డారు. హైదరాబాద్‌లో ఆ తరహా వ్యవస్థ లేకపోవడంతో లైన్‌లో బస్సులు ఎక్కే విధానానికి ఇక్కడి ప్రయాణికులు అలవాటు పడలేదు. ఎన్జీఓస్‌కాలనీ, సచివాలయం, దిల్‌సుఖ్‌నగర్, మల్కాజ్‌గిరి తదితర కాలనీలో ఈ విధానం అమలులో ఉన్నా... పూర్తిస్థాయిలో అమలు కావాలంటే మాత్రం ‘మెట్రో’ అందుబాటులోకి వచ్చిన తర్వాతే సాధ్యపడే అవకాశముంది.

 111 జీవోను సడలిస్తాం
 పశ్చిమ ప్రాంతంలోని 84 గ్రామాల అభివృద్ధికి నిరోధకంగా మారిన 111 జీవోను సడలించే ందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉన్నందున.. న్యాయ నిపుణులతో అత్యున్నతస్థాయి కమిటీ వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా. ఎన్నిక ల్లో హామీ ఇచ్చినందున అసెంబ్లీ సమావేశాలనంతరం దీనిపై ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పారు. త్వరలోనే 111 జీవో సమస్య కొలిక్కి రానుంది.

 మారనున్న రూపురేఖలు
 విస్తారంగా ఉన్న వనరులు జిల్లాకు కలిసొచ్చే అంశం. పెట్టుబడుల తాకిడి కూడా మన జిల్లాకే ఎక్కువ ఉంది. ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే అనుమతులిచ్చేలా ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానానికి శ్రీకారం చుడుతుండడం సానుకూలంగా మారింది. ఏపీతో పోలిస్తే భూ లభ్యత, వాతావరణ పరిస్థితులు మన రాష్ట్రానికి ప్లస్‌పాయింట్లు.

 కొత్తగా ఐదు జిల్లాలు
 జిల్లాల పునర్వ్యస్థీకరణతో బాగా లబ్ధిపొందేది మన జిల్లానే. ఒక జిల్లా స్థానే నాలుగైదు జిల్లాలుగా ఏర్పడనుంది. వికారాబాద్ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త జిల్లాలో పొరుగున ఉన్న మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల నియోజకవర్గాలను కూడా చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. జిల్లాల ఏర్పాటులో పరిపాలనా సౌలభ్యం ప్రాతిపదికగా తీసుకుంటాం.

 కలుపుకుపోతా
 ఐదేళ్లవరకు ఎలాంటి ఎన్నికల్లేవు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులతో సమన్వయంగా వ్యవహరిస్తాం. జిల్లా అభివృద్ధిలో అన్ని పార్టీల సూచనలు, సలహాలు స్వీకరిస్తా. రాజకీయాల జోలికి వె ళ్లకుండా జిల్లా సమగ్రాభివృద్ధికి ‘పెద్దన్న’లా వ్యవహరిస్తా.

 ఉద్యానపంటలకు ప్రోత్సాహం
 నగరానికి 60 కి.మీ. విస్తీర్ణంలో కూరగాయల మండలిని ఏర్పాటు చేయనున్నాం. కూరగాయలు, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రైతాంగానికి రాయితీలు ఇవ్వాలని యోచిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పూలు, పండ్లను ఇక్కడే పండించేలా రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాం. రుణమాఫీ కింద జిల్లాలో 2.18 లక్షల మందికి రూ.1061 కోట్ల మేర అప్పులు మాఫీ అవుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు పరిగి, తాండూరు, చేవెళ్లలో పంటలకు ఆపారనష్టం కలిగింది. రైతాంగాన్ని అదుకునేందుకు పంటనష్టం అంచనాలు రూపొందించాలని యంత్రాంగాన్ని ఆదేశించాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement