- రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి
- బెంగళూరులో రాహుల్ రోడ్డు షో రద్దు
సాక్షి, బెంగళూరు : ప్రజా రవాణా వ్యవస్థలోని అన్ని వాహనాలకు ఈ నెల 20 లోపు జీపీఎస్(గ్లోబల్ పోజిషన్ సిస్టం) వ్యవస్థను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజా రవాణా వ్యవస్థలో బస్సు పాత్ర’ అనే అంశంపై బెంగళూరులో బుధవారం నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో బస్సు, ట్యాక్సీ తదితర ప్రజా రవాణా వాహనాలన్నింటికీ ఈ నెల 20 లోపు జీపీఎస్ ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వాలను కేంద్రం సూచించిందని గుర్తు చేశారు.
అయితే గడువు తక్కువగా ఉండడం వల్ల మరింత సమయం కోరనున్నట్లు తెలిపారు. ఒకవేళ కచ్చితంగా ఏర్పాటు చేయాల్సి వస్తే బెంగళూరుతో పాటు మంగళూరు, మైసూరు, హుబ్లీ-ధార్వాడ నగరాల్లోని వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ కల్పిస్తామని చెప్పారు. రాబోవు బడ్జెట్‌లో రోడ్లకు ఇరువైపులా శౌచలయాలు, హోటళ్ల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.
తరచూ పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల రాష్ట్ర రవాణా శాఖపై పెనుభారం పడుతోందని చెప్పారు. సగటున నెలకు లీటరు డీజిల్‌కు 60 పైసలు పెరుగుతుండడంతో ఒక్క బీఎంటీసీపై ఏడాదికి రూ. 36 కోట్ల భారం పడుతోందని వివరించారు. బెంగళూరులో రాహుల్‌గాంధీ రోడ్ షో రద్దయిందని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.